Begin typing your search above and press return to search.

బంగారానికి పాత సినిమాలు అడ్డుపడతాయా?

తొలి వారం అద్భుతమైన వసూళ్లతో దూసుకెళ్తున్న ఆ సినిమాపై రీ రిలీజ్‌ ల ఎఫెక్ట్ ఉంటుందా? లేక తన జోరును కొనసాగిస్తుందా? అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

By:  M Prashanth   |   26 Jun 2026 11:29 AM IST
బంగారానికి పాత సినిమాలు అడ్డుపడతాయా?
X

ఓవైపు సక్సెస్.. మరోవైపు వరుసగా థియేటర్లలోకి వస్తున్న పాత హిట్ చిత్రాలు. ఆ రెండు పరిస్థితుల మధ్య స్టార్ హీరోయిన్ సమంత నటించిన మా ఇంటి బంగారం బాక్సాఫీస్ జర్నీ ఎలా ఉండబోతుందన్న చర్చ ఇప్పుడు మొదలైంది. తొలి వారం అద్భుతమైన వసూళ్లతో దూసుకెళ్తున్న ఆ సినిమాపై రీ రిలీజ్‌ ల ఎఫెక్ట్ ఉంటుందా? లేక తన జోరును కొనసాగిస్తుందా? అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

మూడేళ్ల బ్రేక్ తర్వాత సమంత సోలోగా లీడ్ రోల్ లో నటించిన చిత్రం మా ఇంటి బంగారం. దర్శకురాలు నందినీ రెడ్డితో ఆమెకు ఇప్పటికే ఓ బేబీ వంటి హిట్ ఉండటంతో ఆ సినిమాపై విడుదలకు ముందే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కాంబినేషన్స్ తో తెరకెక్కిన ఆ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటూ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తోంది.

ఇప్పటికే ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.55.71 కోట్లకుపేగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇండియాలో రూ.33.20 కోట్లకుపైగా నెట్, రూ.38.36 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లు నమోదు చేసినట్లు సమాచారం. విదేశాల్లోనూ సినిమాకు మంచి ఆదరణ లభించడంతో ఓవర్సీస్ మార్కెట్‌ లో రూ.17 కోట్లకుపైగా గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్లు తెలుస్తోంది. వీక్ డేస్ లో కూడా జోరు కొనసాగడం మూవీ టీమ్ లో జోష్ నింపింది.

అయితే సినిమాకు వరల్డ్ వైడ్ గా సుమారు రూ.9 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు వినికిడి. దీంతో బ్రేక్ ఈవెన్ సాధించాలంటే దాదాపు రూ.10 కోట్ల షేర్ అవసరమైంది. అయితే కేవలం రెండు రోజుల్లోనే ఆ లక్ష్యాన్ని చేరుకున్న ఆ చిత్రం, ఐదు రోజులు పూర్తయ్యేసరికి రూ.23 కోట్లకు పైగా షేర్ సాధించి బయ్యర్లకు భారీ లాభాలు అందించినట్లు సమాచారం. దీంతో సినిమా బ్లాక్‌ బస్టర్ దిశగా సాగుతోందని టాక్ వినిపిస్తోంది.

అయితే ఇప్పుడు అసలు పరీక్ష మొదలవుతుందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఎందుకంటే రానున్న రోజుల్లో పలు రీరిలీజ్ చిత్రాలు థియేటర్లలో సందడి చేయబోతున్నాయి. ముఖ్యంగా మహేష్ బాబు నటించిన ఒక్కడు, రాజ్ తరుణ్ హీరోగా వచ్చిన సినిమా చూపిస్తా మావ, మంచు విష్ణు నటించిన కన్నప్ప రీ-రిలీజ్‌లతో పాటు, హను-మాన్ 3డీ వెర్షన్ కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఆ సినిమాలకు అభిమానుల్లో మంచి క్రేజ్ ఉండటంతో కొన్ని సెంటర్స్ లో థియేటర్ల కేటాయింపుపై ఎఫెక్ట్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ మరోవైపు మా ఇంటి బంగారం మూవీకి ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుండటం చిత్రానికి కలిసివచ్చే అంశంమని చెప్పాలి. వీకెండ్‌తో పాటు వచ్చే రోజుల్లో కూడా ఇదే స్థాయి ఆక్యుపెన్సీ కొనసాగితే, రీరిలీజ్‌ ఎఫెక్ట్ ను ఆ సినిమా పెద్దగా పట్టించుకోకుండా ముందుకు వెళ్లే అవకాశం ఉంది.

ఏదేమైనా సమంత మా ఇంటి బంగారం మూవీ ఇప్పటికే కమర్షియల్ పరంగా మంచి విజయాన్ని అందుకుంది. ఇక నుంచి వచ్చే వసూళ్లు లాభాలే. అయితే వరుస రీరిలీజ్‌ ల మధ్య కూడా ఇదే జోరు కంటిన్యూ చేస్తుందా? లేక ప్రేక్షకుల దృష్టి పాత హిట్ సినిమాలవైపు మళ్లుతుందా? అన్న ప్రశ్నకు సమాధానం రాబోయే రోజుల్లో బాక్సాఫీస్ వద్ద వసూళ్లే చెప్పనున్నాయి.