Begin typing your search above and press return to search.

'మగవాళ్లే కాదు లేడీస్ కూడా'.. సామ్ 'బంగారం' అదరగొట్టేసిందిగా!

ఒకప్పుడు సినిమా ఓపెనింగ్స్ అంటే స్టార్ హీరోల అభిమానుల హంగామా, ఫస్ట్ డే ఫస్ట్ షో సందడి గుర్తుకు వచ్చేది. కానీ ఇప్పుడు ఆ లెక్కలు మారుతున్నాయనే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

By:  M Prashanth   |   21 Jun 2026 9:51 AM IST
మగవాళ్లే కాదు లేడీస్ కూడా.. సామ్ బంగారం అదరగొట్టేసిందిగా!
X

ఒకప్పుడు సినిమా ఓపెనింగ్స్ అంటే స్టార్ హీరోల అభిమానుల హంగామా, ఫస్ట్ డే ఫస్ట్ షో సందడి గుర్తుకు వచ్చేది. కానీ ఇప్పుడు ఆ లెక్కలు మారుతున్నాయనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. స్టార్ హీరోయిన్ సమంత లీడ్ రోల్ లో తెరకెక్కిన మా ఇంటి బంగారం తొలి రోజు వసూళ్లు, దానికి వస్తున్న రెస్పాన్స్ అదే విషయాన్ని మరోసారి ప్రూవ్ చేస్తున్నాయి.




లాంగ్ గ్యాప్ తర్వాత సమంత సోలోగా నటించిన మా ఇంటి బంగారం జూన్ 19న విడుదలై మంచి టాక్‌ సొంతం చేసుకుంది. నందినీ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఆ యాక్షన్ డ్రామాపై విడుదలకు ముందే మంచి అంచనాలు నెలకొన్నాయి. చాలా కాలం తర్వాత సమంతను లీడ్ రోల్ లో చూడబోతున్నామనే ఆసక్తి ప్రేక్షకుల్లో కనిపించింది. అదే జోష్ థియేటర్ల వద్ద కూడా కనిపించడంతో తొలి రోజు నుంచే సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి.

మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.13.15 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు మూవీ టీమ్ ప్రకటించింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాకు ఆ రేంజ్ ఓపెనింగ్స్ రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ముఖ్యంగా సమంత యాక్టింగ్, యాక్షన్ సీన్స్, నందినీ రెడ్డి టేకింగ్ ఆకట్టుకుంటున్నాయని సోషల్ మీడియాలో రివ్యూ ఇస్తున్నారు సినీ ప్రియులు.

అయితే మూవీ సక్సెస్ పై స్పందించిన సమంత చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్‌ గా మారింది. ఒక సినిమా మొదటి రోజే ఇంత మంచి ఓపెనింగ్స్ సాధించడం ఎంతో ఆనందంగా ఉందని ఆమె పేర్కొన్నారు. హీరో సినిమా, హీరోయిన్ సినిమా అనే తేడా లేకుండా కథను నమ్మి ప్రేక్షకులు థియేటర్లకు రావడం సంతోషంగా ఉందన్నారు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ సినిమాను ఆదరిస్తుండటం తనకు మరింత ఆనందాన్ని ఇచ్చిందని చెప్పారు.

అయితే సమంత పోస్ట్‌ లో ఎక్కువగా చర్చకు వస్తున్న విషయం లేడీ ఆడియన్స్ గురించిన కామెంట్సే. చాలా కాలంగా థియేటర్లలో భారీ ఓపెనింగ్స్ అంటే మగవాళ్లు ప్రధాన కారణమనే అభిప్రాయం ఉందని, కానీ మా ఇంటి బంగారం’ విషయంలో మహిళలు పెద్ద ఎత్తున థియేటర్లకు రావడం తనను ఎంతో సంతోషపరిచిందని ఆమె పేర్కొన్నారు. ఆడియన్స్ టేస్ట్ మారుతుందని, సినిమాను ఆదరించే వాళ్లు పెరుగుతున్నారని వ్యాఖ్యానించారు.

నిజానికి గత కొన్నేళ్లుగా లేడీ ఓరియంటెడ్ కథలతో వచ్చిన సినిమాలు మంచి విజయాలు సాధించినా, తొలి రోజు భారీ వసూళ్లు సాధించడం మాత్రం అరుదుగానే కనిపించింది. ఈ నేపథ్యంలో మా ఇంటి బంగారం మూవీకి వచ్చిన ఓపెనింగ్స్ ప్రత్యేకంగా నిలిచాయి. ఇది కేవలం సమంత స్టార్‌ డమ్ మాత్రమే కాకుండా, కంటెంట్‌ పై ప్రేక్షకుల నమ్మకానికి కూడా ఎగ్జాంపుల్ గా కనిపిస్తోంది.

మరోవైపు వీకెండ్ కావడంతో వసూళ్లు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలి రోజు వచ్చిన పాజిటివ్ టాక్ రెండో, మూడో రోజుల్లో కూడా కొనసాగితే బాక్సాఫీస్ వద్ద మరింత భారీ వసూళ్లు సాధించే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ఏదేమైనా మా ఇంటి బంగారం విజయంలో మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. ఓపెనింగ్స్ అంటే కేవలం జెంట్స్ మాత్రమే కాదు, లేడీస్ కూడా కీలక పాత్ర పోషించగలరని సినిమా నిరూపించిందని చెప్పాలి. అదే విషయాన్ని సమంత కూడా చెబుతున్నారు. అందుకే ఇప్పుడు టాలీవుడ్‌ లో సామ్ బంగారం కేవలం కలెక్షన్లతోనే కాదు.. కొత్త చర్చకు కూడా తెరతీసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.