అరుంధతి రికార్డు బ్రేక్ చేసిన 'బంగారం'.. నెక్స్ట్ ఫీట్ ఏంటి?
స్టార్ హీరోయిన్ సమంత లీడ్ రోల్ లో తెరకెక్కిన మా ఇంటి బంగారం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. విడుదలై పది రోజులు అయినా జోరు ఏమాత్రం తగ్గడం లేదు.
By: M Prashanth | 29 Jun 2026 7:40 PM ISTస్టార్ హీరోయిన్ సమంత లీడ్ రోల్ లో తెరకెక్కిన మా ఇంటి బంగారం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. విడుదలై పది రోజులు అయినా జోరు ఏమాత్రం తగ్గడం లేదు. ముఖ్యంగా రెండో వీకెండ్ లో ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ తో కలెక్షన్లు భారీగా వచ్చాయి. దీంతో ఒకప్పుడు లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో సంచలనం సృష్టించిన అరుంధతి లైఫ్ టైమ్ వసూళ్లను బ్రేక్ చేయగా, ఇప్పుడు అందరి దృష్టి రూ.100 కోట్ల గ్రాస్ మార్క్ పైనే ఉంది.
అయితే మా ఇంటి బంగారం మూవీ ప్రపంచవ్యాప్తంగా పది రోజుల్లో రూ.78.71 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లు తెలుస్తోంది. ఇందులో ఇండియా నుంచి నుంచి రూ.55.86 కోట్ల గ్రాస్, రూ.48.25 కోట్ల నెట్ రాగా.. ఓవర్సీస్ లో రూ.22.85 కోట్ల గ్రాస్ వసూలైంది! రెండో ఆదివారం ఒక్కరోజే ఇండియాలో రూ.5.30 కోట్ల నెట్, రూ.6.14 కోట్ల గ్రాస్ రావడం విశేషం. రెండో వారంలో కూడా ఇదే రేంజ్ లో కలెక్షన్లు నమోదు చేయడం విశేషం.
ఆ సక్సెస్ కు మరో కారణం.. ఈ వారంలో పెద్ద సినిమాలు విడుదల కాకపోవడమేనని చెప్పాలి. పోటీ లేకపోవడంతో కుటుంబ ప్రేక్షకుల తొలి సెలెక్షన్ గా మా ఇంటి బంగారం నిలిచింది. ముఖ్యంగా వీకెండ్ లో థియేటర్లకు ప్రేక్షకులు భారీగా రావడంతో కలెక్షన్లు మరింత పెరిగాయి. అయితే ఇప్పుడు రెండో సోమవారం నుంచి సినిమా అసలు పరీక్ష మొదలవుతుందని అంతా అంచనా వేస్తున్నారు. సాధారణ రోజుల్లో కూడా ఇదే రేంజ్ లో వసూళ్లు కొనసాగితే రూ.100 కోట్ల మార్క్ చేరుకోవడం కష్టమేమీ కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ప్రేక్షకుల రెస్పాన్స్ కూడా సినిమాకు బలంగా మారింది. ముఖంగా తెలుగు వెర్షన్ కు మంచి ఆక్యుపెన్సీ నమోదవుతుండగా, రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఆదివారం అత్యధిక వసూళ్లు రావడం సినిమాకు ఉన్న స్ట్రాంగ్ హోల్డ్ ను చూపిస్తోంది. మౌత్ పబ్లిసిటీ కూడా రోజురోజుకు పెరుగుతుండటంతో థియేటర్లలో ప్రేక్షకుల రద్దీ కొనసాగుతోంది.
సుమారు రూ.20 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఆ సినిమా ఇప్పటికే ఇన్వెస్ట్మెంట్ కు ఎన్నో రెట్ల వసూళ్లు సాధించింది. సమంత కెరీర్ లోనే బెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచే దిశగా సినిమా అడుగులు వేస్తోంది. చాలా కాలం తర్వాత సమంత లీడ్ రోల్ లో వచ్చిన ఆ చిత్రానికి ప్రేక్షకులు భారీ ఆదరణ చూపించడం విశేషం. యాక్షన్ తో పాటు ఎమోషన్ సీన్స్ లో ఆమె నటనకు మంచి ప్రశంసలు లభిస్తున్నాయి.
ఒకప్పుడు లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు అరుంధతి సెట్ చేసిన వసూళ్ల మార్క్ ను ఇప్పుడు మా ఇంటి బంగారం అధిగమించడం సినిమా విజయాన్ని మరో స్థాయికి తీసుకెళ్లింది. ఇదే జోరు మరో కొన్ని రోజులు కొనసాగితే రూ.100 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరే మరో లేడీ ఓరియంటెడ్ చిత్రంగా మా ఇంటి బంగారం రికార్డు సృష్టించే అవకాశం కనిపిస్తోంది. దీంతో సినీ ప్రియుల చూపంతా రెండో వీక్ వసూళ్లపైనే నిలిచింది.
