Begin typing your search above and press return to search.

ఖాళీ స్లాట్‌ను క్యాష్ చేసుకుంటున్న సమంత!

తెలుగు సినిమా బాక్సాఫీస్‌లో కొన్ని సందర్భాల్లో పరిస్థితులే ఒక సినిమాకు అదనపు బలంగా మారుతాయి.

By:  Sravani Lakshmi Srungarapu   |   23 Jun 2026 11:28 AM IST
ఖాళీ స్లాట్‌ను క్యాష్ చేసుకుంటున్న సమంత!
X

తెలుగు సినిమా బాక్సాఫీస్‌లో కొన్ని సందర్భాల్లో పరిస్థితులే ఒక సినిమాకు అదనపు బలంగా మారుతాయి. ప్రస్తుతం సమంత నటించిన మా ఇంటి బంగారం విషయంలో కూడా అలాంటి పరిస్థితే కనిపిస్తోంది. ఈ సినిమా రిలీజైన మొద‌టి రోజు నుంచి పూర్తిగా యునానిమస్ రెస్పాన్స్ ను అందుకోకపోయినా, ఆడియ‌న్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ మాత్రం రోజురోజుకూ బలపడుతోంది. ముఖ్యంగా వీకెండ్ తర్వాత కూడా క‌లెక్ష‌న్ల‌లో కనిపిస్తున్న స్థిరత్వం ట్రేడ్ వర్గాల దృష్టిని ఆకర్షిస్తోంది.

ఈ స‌క్సెస్‌కి కేవలం సినిమా కంటెంట్ మాత్రమే కారణమా, లేక సమంత ప‌ర్స‌న‌ల్ క్రేజ్ కూడా కీలక పాత్ర పోషించిందా అనే చర్చ ఇండ‌స్ట్రీలో మొదలైంది. ఎందుకంటే ఇటీవల కాలంలో లేడీ ఓరియెంటెడ్ సినిమాల‌కు భారీ ఓపెనింగ్స్ రావడం అంత ఈజీ కాదు. కానీ సమంత పేరు, ఆమెకు ఉన్న మార్కెట్, ఆడియ‌న్స్ తో ఏర్ప‌డిన బాండింగ్ ఈ సినిమాకు మొదటి నుంచే ఒక స్పెష‌ల్ అడ్వాంటేజ్‌ను తీసుకొచ్చాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

వీట‌న్నింటి కంటే ఎక్కువ‌గా క‌లిసొచ్చిన విష‌యం టాలీవుడ్ రిలీజ్ క్యాలెండర్‌లో చోటు చేసుకున్న మార్పు. జూన్ చివరి వారంలో రావాల్సిన లెనిన్ మూవీ పోస్ట్ పోన్ అవ‌డంతో బాక్సాఫీస్ వద్ద పోటీ అనూహ్యంగా తగ్గిపోయింది. సాధారణంగా ఒక పెద్ద సినిమా రిలీజైతే ఆడియ‌న్స్ దృష్టి అక్కడికి మళ్లిపోతుంది. కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేకపోవడంతో మా ఇంటి బంగారంకి ఎక్స్‌ట్రా స్క్రీన్లు, మెరుగైన షో కౌంట్, ఇంకొన్నాళ్ల పాటూ ఎలాంటి ఆటంకం లేకుండా ఆడే అవకాశం లభించినట్లైంది.

ఈ ఖాళీని ఉపయోగించుకుని సినిమా సెకండ్ వీకెండ్ కూడా మంచి ప్రదర్శన కనబరిస్తే, మొదట ఊహించిన దానికంటే ఎక్కువ స్థాయి క‌లెక్ష‌న్ల‌ను నమోదు చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియ‌న్స్ నుంచి వస్తున్న మద్దతు కొనసాగితే సినిమా రన్ మరింత బలపడవచ్చని భావిస్తున్నారు. అయితే ఈ స‌క్సెస్‌ను పూర్తిగా ఖాళీ స్లాట్ అకౌంట్ లో వేయడం కూడా సరైన విశ్లేషణ కాదనే అభిప్రాయం వినిపిస్తోంది. ఎందుకంటే పోటీ లేకపోయినా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగలిగే ఆకర్షణ సినిమాలో ఉండాల్సిందే. ఆ విషయంలో సమంత స్టార్ ఇమేజ్ కీలకంగా పనిచేసిందని సినీ వర్గాలు చెబుతున్నాయి. గతంలోనూ ఆమె ప్రధాన పాత్రల్లో వచ్చిన కొన్ని సినిమాలు ఇదే విషయాన్ని నిరూపించాయి.

మొత్తంగా చూస్తే మా ఇంటి బంగారం జ‌ర్నీలో రెండు అంశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకటి బాక్సాఫీస్ వద్ద పోటీ తగ్గడం ద్వారా దక్కిన అనుకూల పరిస్థితి. రెండోది సమంతకు ఇప్పటికీ ఉన్న ప్రేక్షకాదరణ. ఈ రెండు కలిసి రావడంతో సినిమా క‌లెక్ష‌న్ల‌ పరంగా ఊహించిన దానికంటే మెరుగైన ఫలితాలను అందుకుంటోందన్న అభిప్రాయం బలపడుతోంది. రాబోయే రోజుల్లో ఈ జోరు ఎంతదూరం వెళ్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.