Begin typing your search above and press return to search.

డైనోసార్ల ఉనికిని ప్రేక్షకులు నమ్మేలా చేసిన న‌టుడు!

సినిమా రంగానికి వీఎఫ్ఎక్స్- సీజీఐ సాంకేతిక‌త కొత్తగా పరిచయమవుతున్న రోజుల్లో `జురాసిక్ పార్క్` లాంటి చిత్రాలలో సామ్ నీల్ తన అద్భుతమైన నటనతో డైనోసార్ల ఉనికిని ప్రేక్షకులు నమ్మేలా చేశారు.

By:  Sivaji Kontham   |   13 July 2026 9:27 PM IST
డైనోసార్ల ఉనికిని ప్రేక్షకులు నమ్మేలా చేసిన న‌టుడు!
X

సినిమా రంగానికి వీఎఫ్ఎక్స్- సీజీఐ సాంకేతిక‌త కొత్తగా పరిచయమవుతున్న రోజుల్లో `జురాసిక్ పార్క్` లాంటి చిత్రాలలో సామ్ నీల్ తన అద్భుతమైన నటనతో డైనోసార్ల ఉనికిని ప్రేక్షకులు నమ్మేలా చేశారు. ఆనాటి కాలంలో దర్శకుడు స్టీవెన్ స్పీల్‌బ‌ర్గ్ కేవలం కంప్యూటర్ గ్రాఫిక్స్‌పైనే ఆధారపడకుండా... సెట్స్‌పైనే యానిమేట్రానిక్స్ టెక్నాలజీతో నిజమైన సైజులో ఉండే రాక్షసబల్లి రోబోలను ఉంచడం వల్ల నటులు తమ కళ్లముందున్న ఆకారాన్ని చూసి సహజమైన భయాన్ని, ఎమోషన్స్‌ను పండించగలిగారు. కానీ నేటి ఆధునిక లార్జ్-స్కేల్ సినిమాలలో కేవలం ఖాళీ గ్రీన్ స్క్రీన్ లేదా బ్లూ రూమ్‌లలో నిలబడి.. కళ్లముందు ఏమీ లేకపోయినా అంతా ఉన్నట్లు ఊహించుకుని నటించాల్సి రావడం వల్ల... ఎంతటి ప్రతిభావంతులైన నటులకైనా పాత్రలోని లోతును .. ఆర్గానిక్ ఎమోషన్స్‌ను ప్రదర్శించడం ఒక పెద్ద సవాల్‌గా మారింది.

అంతేకాకుండా.. ప్రస్తుత డిజిటల్ యుగంలో దర్శకులు - నిర్మాతలు పోస్ట్-ప్రొడక్షన్ సాంకేతికతపై మితిమీరిన నమ్మకం పెంచుకోవడం కూడా నటుల సహజ నటన కుంటుపడటానికి ప్రధాన కారణమైంది. షూటింగ్‌లో నటుడు సరిగ్గా ఎక్స్‌ప్రెషన్ ఇవ్వకపోయినా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ లో ఫిక్స్ చేస్తాం! అంటూ ఎడిటింగ్‌లో లేదా అత్యాధునిక ఏఐ (AI) టెక్నాలజీ ద్వారా ముఖ కవళికలను మార్చేస్తుండటం వల్ల నటులలోని క్రియేటివ్ శ్రమ - క్యారెక్టర్‌లోకి లీనమయ్యే తత్వం క్రమంగా మొద్దుబారుతున్నాయి. నేటి భారీ బడ్జెట్ హాలీవుడ్ చిత్రాలు కథ, కథనం, పాత్రల భావోద్వేగాల కంటే కేవలం కళ్లు చెదిరే విజువల్స్ కే ప్రాధాన్యత ఇస్తుండటం వల్ల.. పాత తరం సినిమాల్లో సామ్ నీల్ కనబరిచిన `రా అండ్ రియలిస్టిక్ యాక్టింగ్` నేటితరం సినిమాల్లో చాలా వరకు కరువవుతోందనేది అక్షరసత్యం.

ఇంత‌గా ఈ దిగ్గ‌జ న‌టుడి గురించి ప్ర‌స్థావించ‌డానికి కార‌ణం.. అత‌డు ఇక లేర‌నే నిజాన్ని ప్ర‌పంచ‌వ్యాప్త అభిమానులు జీర్ణించుకునేందుకే. హాలీవుడ్ చిత్రసీమలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న నటుడు సర్ సామ్ నీల్ (78) కన్నుమూశారు. `జురాసిక్ పార్క్` సినిమాలో ఆయన పోషించిన డాక్టర్ అలాన్ గ్రాంట్ పాత్ర ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది సినీప్రియుల హృదయాల్లో చెరిపేయలేని ముద్ర వేసింది. ఆస్ట్రేలియా సిడ్నీలో 13 జూలై 2026 న ఆయన తన చివరి శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు. ఎంతో అకస్మాత్తుగా, ఊహించని విధంగా జరిగిన ఆయన మరణం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులను, హాలీవుడ్ ఇండస్ట్రీని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

ఐదు దశాబ్దాలకు పైగా సాగిన తన సుదీర్ఘ నటనా ప్రస్థానంలో సామ్ నీల్ ఎన్నో అద్భుతమైన పాత్రలకు ప్రాణం పోశారు. జురాసిక్ పార్క్ సిరీస్‌తో పాటు ప్రశంసలు పొందిన `పీకీ బ్లైండర్స్`, `మెర్లిన్`, `పొసెషన్`, `ది పియానో` వంటి చిత్రాలలో ఆయన కనబరిచిన నటన సినిమా చరిత్రలో మైలురాళ్లుగా నిలిచిపోతాయి. ముఖ్యంగా 90ల కాలంలో హాలీవుడ్ చిత్రాలను చూడటం ప్రారంభించిన భారతీయ ప్రేక్షకులకు కూడా ఆయన ఒక `డైనోసార్ అంకుల్`గా.. చైల్డ్‌హుడ్ హీరోగా ఎంతో దగ్గరయ్యారు. ఆయన పోషించిన ప్రతి పాత్రలోనూ ఒక విలక్షణమైన శైలి, నటనలోని లోతు స్పష్టంగా కనిపించేవి.

ఆయన మరణ వార్త బయటకు రాగానే ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా వేదికగా అభిమానులు, సినీ ప్రముఖులు కన్నీటి వీడ్కోలు పలుకుతున్నారు. `మా బాల్యాన్ని ఎంతో అద్భుతంగా మార్చినందుకు ధన్యవాదాలు`...``సినిమా ప్రపంచం ఒక గొప్ప లెజెండ్‌ను కోల్పోయింది`` అంటూ నెటిజన్లు ఎమోషనల్ కామెంట్లు పెడుతున్నారు. సామ్ నీల్ భౌతికంగా మనల్ని విడిచివెళ్లినా...ఒక తరం సినీ ప్రేమికుల జ్ఞాపకాలలో .. చలనచిత్ర చరిత్ర ఉన్నంత కాలం ఆయన సృష్టించిన క్లాసిక్ పాత్రల రూపంలో సర్ సామ్ నీల్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది.