సల్మాన్ సినిమా.. రిలీజ్‌కు ముందే ప్రశ్నార్థకం?
అసలే వరుస ఫెయిల్యూర్లతో సతమతం అవుతున్నాడు బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్.
By: Garuda Media | 13 April 2026 10:23 AM ISTఅసలే వరుస ఫెయిల్యూర్లతో సతమతం అవుతున్నాడు బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్. ఈ ఫ్లాపుల పరంపర నుంచి బయటపడేందుకు ట్రెండును ఫాలో అయితే.. అది పెద్ద తలపోటుగా మారింది. దేశ సరిహద్దుల్లో జరిగే యుద్ధాలు, సైనిక చర్యల నేపథ్యంలో సినిమాలు తీస్తే మంచి ఫలితాలు వస్తున్నాయని... సల్మాన్ కూడా హిట్టు కోసం గత ఏడాది ఆ బాటే పట్టాడు. బాలీవుడ్లో చాలా వరకు పాకిస్థాన్‌ను టార్గెట్ చేస్తూ సినిమాలు తీస్తుంటే.. సల్మాన్ చైనాతో ఇండియా క్లాష్ మీద సినిమాకు రెడీ అయ్యాడు. ఆ చిత్రమే.. బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్.
కొన్నేళ్ల ముందు గాల్వాన్ లోయలో ఇండియా, చైనా సైనికుల మధ్య జరిగిన చిన్నపాటి యుద్ధ ఘటన నేపథ్యంలో ఈ సినిమా తీయాలని తలపోశారు. ఈ ఘర్షణలో వీరోచితంగా పోరాడి ప్రాణాలు కోల్పోయిన తెలుగు సోల్జర్ సంతోష్ కుమార్ పాత్రనే సల్మాన్ పోషిస్తున్నాడు ఇందులో. ఐతే ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ బయటికి వచ్చినప్పటి నుంచి ఏదీ కలిసి రావడం లేదు. ఆ గ్లింప్స్‌కు నెగెటివ్ రెస్పాన్స్ రావడం టీంను నిరాశకు గురి చేసింది.
ఇది చాలదన్నట్లు ఈ సినిమాపై చైనా నుంచి అభ్యంతరాలు రావడంతో బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్ పేరును మాతృభూమిగా మార్చారు. ఇప్పుడేమో.. సినిమాలో ఎక్కడా చైనా ప్రస్తావనే ఉండకూడదని.. ఇంకా చైనాను బ్యాడ్ లైట్లో చూపించకూడదని.. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలను దెబ్బ తీసేలా కంటెంట్‌ను నివారించాలని ప్రభుత్వ వర్గాల నుంచి ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది. దీని వల్ల సినిమాలో చాలా సన్నివేశాలను రీషూట్ చేయాల్సిన పరిస్థితి తలెత్తినట్లు చెబుతున్నారు. ఐతే ఇప్పటికే సినిమా చాలా ఆలస్యం అయింది. ఇప్పుడు దాదాపు సినిమా పూర్తయిన దశలో రీషూట్లు అంటే అది చాలా భారం అవుతుంది. ఇంతా కష్టపడి సినిమాకు ఆశించిన ఫలితం వస్తుందా అంటే అదీ సందేహంగానే ఉంది. మొదట రిలీజ్ చేసిన గ్లింప్సే ఆకట్టుకోలేదు.
పైగా టైటిల్ మార్చి, చైనా ప్రస్తావనే లేకుండా ఒక కల్పిత కథలా గాల్వాన్ యుద్ధాన్ని తెరపై చూపిస్తే ఏం కిక్కు ఉంటుందన్నది ప్రశ్న. చైనా ప్రస్తావన లేకుండా సినిమా తీసినా.. సైనికులను చైనీయుల్లా చూపించినా రేప్పొద్దున అభ్యంతరాలు తలెత్తే అవకాశాలను కొట్టి పారేయలేం. ఇది రియల్ స్టోరీ అని చూపించకపోయినా.. చూసే కథ వాస్తవికంగా అనిపించకపోయినా.. ఈ సినిమా ప్రేక్షకులు కోరుకున్న అనుభూతిని ఇవ్వకపోవచ్చు. కాబట్టి ఈ సినిమా పరిస్థితి ఏంటన్నది అయోమయమే. అసలే సల్మాన్ ఫ్లాపుల్లో ఉన్నాడు. ఈ సినిమా తీస్తున్న అపూర్వ లఖియా సైతం ఫ్లాప్ డైరెక్టరే. ఇలాంటి కాంబినేషన్లో వస్తున్న సినిమాలో కథను మధ్యలో మారిస్తే పరిస్థితి ఏంటో అంచనా వేయొచ్చు. మేకింగ్ దశలో ఉండగానే సినిమా ఫేట్ ఏంటన్నది ముందే నిర్ణయం అయిపోయిన పరిస్థితి. ఈ స్థితి నుంచి సల్మాన్ మూవీ ఎలా గట్టెక్కుతుందో చూడాలి.
