వంశీ పైడిపల్లి చిత్రంలో తెలుగు హీరో!
ప్రతిగా సల్మాన్ హీరోగా నటించిన ఓ హిందీ సినిమాలో రామ్ చరణ్ గెస్ట్ రోల్ పోషించిన సంగతి తెలిసిందే.
By: Srikanth Kontham | 27 March 2026 3:00 PM ISTబాలీవుడ్ సుల్తాన్ సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో ఓ భారీ చిత్రానికి సన్నాహాలు జరుగుతోన్న సంగతి తెలిసిందే. వంశీ-రాజుగారు తొలిసారి బాలీవుడ్ కి వెళ్లి నిర్మిస్తోన్న చిత్రమిది. దీంతో ఈ చిత్రాన్ని పాన్ ఇండియాలో ప్లాన్ చేసే అవకాశం లేకపోలేదు. కేవలం నార్త్ మార్కెట్ కే పరిమితం చేస్తే అందులో రాజుగారి గొప్పతనం ఏముంటుంది? ఈ నేపథ్యంలో తెలుగులోనూ తప్పక రిలీజ్ చేపే అవకాశాలున్నాయి. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఒక టాలీవుడ్ అగ్ర హీరో కీలక పాత్రలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇది కేవలం గెస్ట్ రోల్ మాత్రమే కాకుండా కథను మలుపు తిప్పే ఒక పవర్‌ఫుల్ క్యారెక్టర్ అని సమాచారం. ఇదే నిజమైతే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా మార్కెట్ అమాంతం పెరిగిపోతుంది. సల్మాన్ ఖాన్ చిత్రాలకు సౌత్ ఇండియాలోనూ క్రేజ్ ఉంటుంది. దానికి తోడు తెలుగు స్టార్ హీరో తోడైతే మార్కెట్ పరంగా కలిసొస్తుంది. పాన్ ఇండియా ట్రెండ్‌లో భాగంగా ఇలాంటి మల్టీస్టారర్ కలయికలు బాక్సాఫీస్ వద్ద భారీ ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. వంశీ పైడిపల్లి తన సినిమాల్లో ఎమోషన్స్ ,స్టైలింగ్‌ను అద్భుతంగా చూపిస్తారు. ఇద్దరు సూపర్ స్టార్లు ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే ఫ్యాన్స్‌లో అంచనాలు వేరే లెవల్లో ఉంటాయి.
ఆ పాత్ర కోసం ఇప్పటికే ఓ స్టార్ హీరోతో చర్చలు జరుగుతున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. గతంలో వారసుడు సినిమాతో విజయ్‌ను తెలుగు ప్రేక్షకులకు దగ్గర చేసిన వంశీ ఇప్పుడు సల్మాన్ ఖాన్ సినిమాతో తెలుగు హీరోను బాలీవుడ్ మార్కెట్‌లోకి మరింత బలంగా చూపించే అవకాశం లేకపోలేదు. ఇది కేవలం ఒక సినిమా మాత్రమే. కాదు టాలీవుడ్ -బాలీవుడ్ మధ్య దూరాన్ని తగ్గించే ఒక వారధిలా మారుతుంది. సల్మాన్ ఖాన్ కూడా తెలుగు హీరోలతో మంచి అనుబంధాన్ని కలిగి ఉన్నారు. గతంలో చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాలో చిన్న పాత్రలో మెరిశారు.
ప్రతిగా సల్మాన్ హీరోగా నటించిన ఓ హిందీ సినిమాలో రామ్ చరణ్ గెస్ట్ రోల్ పోషించిన సంగతి తెలిసిందే. తాజా హిందీ సినిమాలోనూ తెలుగు స్టార్ యాడ్ అయితే అది కలిసొచ్చే అంశమే. రెండు ఇండస్ట్రీల మధ్య ఉన్న స్నేహపూర్వక వాతావరణాన్ని చాటి చెబుతుంది. ముఖ్యంగా గ్లోబల్ స్థాయిలో తెలుగు సినిమా సత్తా చాటుతోన్న తరుణంలో ఈ కలయిక బాలీవుడ్‌కు కూడా కొత్త ఎనర్జీని ఇస్తుంది. వ్యాపార పరంగా చూస్తే ఈ నిర్ణయం అత్యంత తెలివైనది. సల్మాన్ ఖాన్ సినిమాకు తెలుగు హీరో అదనపు ఆకర్షణగా నిలవడమే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ రైట్స్ , శాటిలైట్ హక్కులు భారీ ధరలకు అమ్ముడయ్యే అవకాశం ఉంటుంది. పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ సాధించాలంటే సౌత్ మార్కెట్ ఎంత కీలకమో ఇప్పటికే ఆర్ఆర్ఆర్, పుష్ప వంటి చిత్రాలు నిరూపించాయి. వంశీ పైడిపల్లి కూడా అదే పంథాలో ఈ ప్రాజెక్ట్‌ను డిజైన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది.
