లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ టార్గెట్ చేసిన టాప్-7 సెలబ్రిటీల జాబితా ఇదే!
ముంబైలో గ్యాంగ్ స్టర్స్ ఉనికి పోలీసుకు కంటిమీద కునుకు పట్టనివ్వకుండా చేస్తోంది.
By: Sivaji Kontham | 19 Oct 2026 8:20 AM ISTముంబైలో గ్యాంగ్ స్టర్స్ ఉనికి పోలీసుకు కంటిమీద కునుకు పట్టనివ్వకుండా చేస్తోంది. ముఖ్యంగా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ అల్లర్లు సృష్టిస్తూ పలుమార్లు సినీ ప్రముఖులపై బెదిరింపులకు పాల్పడటమే కాకుండా... కాల్పుల ఘటనలకు పాల్పడటం కలకలం రేపింది. సినీ, రాజకీయ ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని ఈ ముఠా జరిపిన కాల్పులు- దాడుల వివరాలు పరిశీలిస్తే...
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ -గెలాక్సీ అపార్ట్మెంట్ కాల్పుల ఘటన - ఏప్రిల్ 2024
లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ టార్గెట్లలో సల్మాన్ ఖాన్ మొదటి వ్యక్తి. 1998 నాటి కృష్ణజింకల వేట ఉదంతానికి ప్రతీకారంగా ఈ గ్యాంగ్ అతడిని అంతం చేయాలని చూస్తోంది. ఇందులో భాగంగా 2024 ఏప్రిల్ 14 తెల్లవారుజామున ముంబైలోని బాంద్రాలో ఉన్న సల్మాన్ ఖాన్ నివాసం `గెలాక్సీ అపార్ట్మెంట్` బయట ఇద్దరు దుండగులు మోటార్ సైకిల్‌పై వచ్చి విచక్షణారహితంగా గాల్లోకి... భవనంపైకి కొన్ని రౌండ్లు కాల్పులు జరిపారు. లారెన్స్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్ ఈ బాధ్యతను తీసుకున్నానని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఇది కేవలం ఒక హెచ్చరిక మాత్రమేనని హెచ్చరించారు. బిష్ణోయ్ గ్యాంగ్ పదే పదే సల్మాన్ ఖాన్, అతడి కుటుంబాన్ని చంపేస్తామని లేఖలు కూడా రాయడం కలకలం రేపింది.
ప్రఖ్యాత గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య -మే 2022
పంజాబీ పాపులర్ సింగర్, రాజకీయ నాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ చరిత్రలోనే అత్యంత సంచలనాత్మకమైనది. 2022 మే 29న పంజాబ్‌లోని మన్సా జిల్లాలో మూసేవాలా ప్రయాణిస్తున్న కారుపై అత్యాధునిక ఆయుధాలతో కొందరు దుండగులు దాడి చేసి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో మూసేవాలా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కెనడాలో ఉన్న గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్‌తో కలిసి తీహార్ జైలులో ఉన్న లారెన్స్ బిష్ణోయ్ ఈ హత్యకు ప్లాన్ వేసినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్.ఐ.ఏ తేల్చింది.
ప్రముఖ దర్శకుడు రోహిత్ శెట్టి నివాసంపై కాల్పులు -ఫిబ్రవరి 2026)
బాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ రోహిత్ శెట్టిని హెచ్చరిస్తూ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సంచలన చర్యకు దిగింది. 2026 ఫిబ్రవరిలో ముంబైలోని జుహు ప్రాంతంలో ఉన్న రోహిత్ శెట్టి నివాసం వెలుపల దుండగులు కాల్పులు జరిపారు. గ్యాంగ్ సభ్యులు శుభమ్ లోంకర్, హరి బాక్సర్ తదితరులు దీనికి బాధ్యత వహిస్తూ.. తమ అంతర్గత విషయాల్లో తలదూర్చవద్దని.. ఇది బాలీవుడ్ మొత్తానికి హెచ్చరిక అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఘటనతో ముంబై ఇండస్ట్రీలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.
ప్రముఖ పంజాబీ సింగర్ గిప్పీ గ్రెవాల్ నివాసంపై దాడి -నవంబర్ 2023
సల్మాన్ ఖాన్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే కారణంతో కెనడాలో నివసించే ప్రఖ్యాత పంజాబీ గాయకుడు, నటుడు గిప్పీ గ్రెవాల్‌ను కూడా ఈ గ్యాంగ్ టార్గెట్ చేసింది. 2023 నవంబర్‌లో కెనడాలోని వాంకోవర్‌లో ఉన్న గిప్పీ గ్రెవాల్ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి కాల్పులు జరిపారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగే స్వయంగా ఈ కాల్పులకు బాధ్యత వహిస్తూ.. సల్మాన్ ఖాన్‌తో స్నేహం చేసేవారందరికీ ఇదే గతి పడుతుందని బహిరంగంగా హెచ్చరిక జారీ చేసింది.
కెనడాలో ఏపీ ధిల్లాన్ ఇళ్లపై కాల్పుల ఘటన -సెప్టెంబర్ 2024
అంతర్జాతీయంగా ఖ్యాతి గాంచిన ప్రముఖ ఇండో-కెనెడియన్ సింగర్ ఏపీ ధిల్లాన్‌ను సైతం ఈ ముఠా వదల్లేదు. 2024 సెప్టెంబర్ లో కెనడాలోని వాంకోవర్‌లో ఉన్న ఏపీ ధిల్లాన్ నివాసాల వద్ద వరుస కాల్పుల ఘటనలు కలకలం రేపాయి. సల్మాన్ ఖాన్‌తో ధిల్లాన్ ఒక మ్యూజిక్ వీడియోలో కలిసి నటించడమే ఈ దాడికి ప్రధాన కారణమని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన రోహిత్ గోదారా వర్గం సోషల్ మీడియా వేదికగా ప్రకటించి సెలబ్రిటీలను వణికించింది.
టైగర్ ష్రాఫ్- బిష్ణోయ్ గ్యాంగ్ తాజా టార్గెట్ -2026 అక్టోబర్- దసరా
తాజాగా టైగర్ ష్రాఫ్ పై జుహూలో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కాల్పులు జరిపింది. ఈ ఘటనలో టైగర్ ష్రాఫ్ తృటిలో తప్పించుకున్నా కానీ... అతడి డ్రైవర్ కి గాయాలయ్యాయి. ఈ కాల్పులకు బాధ్యత వహిస్తున్నామని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ మరోసారి ప్రకటించింది. సల్మాన్ ఖాన్ తో స్నేహంగా ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ శిక్ష తప్పదని హెచ్చరించడం కొసమెరుపు. సల్మాన్ తో టైగర్ సన్నిహితంగా ఉండటమే ఈ ముప్పునకు కారణమని దీనిని బట్టి అర్థం చేసుకోవాలి. అయితే లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కేవలం భయపెడుతోంది. కానీ సినీసెలబ్రిటీల విషయంలో ఒక సరిహద్దు రేఖను మెయింటెయిన్ చేయడం ఆశ్చర్యపరుస్తోంది. అయితే సల్మాన్ ఖాన్ స్నేహితుడే అయిన రాజకీయ నాయకుడు బాబా సిద్ధిఖీని మాత్రం బిష్ణోయ్ గ్యాంగ్ పాశవికంగా కాల్చి చంపిన విషయాన్ని చరిత్ర మరువదు. సల్మాన్ రెండు కృష్ణ జింకల్ని వేటాడి చంపాడు. అయితే కృష్ణ జింకలు మొత్తం బాలీవుడ్ ని, ముంబై పోలీస్ ని కూడా ఒణికిస్తున్నాయి. రేయింబవళ్లు కంటి మీద కునుకుపట్టనివ్వకుండా చేస్తున్నాయి!
