Begin typing your search above and press return to search.

వంశీ పైడిపల్లి బాలీవుడ్ గేమ్ స్టార్ట్.. సల్మాన్ కోసం భారీ స్కెచ్!

టాలీవుడ్ డైరెక్ట‌ర్ వంశీ పైడిప‌ల్లి, బాలీవుడ్ మెగాస్టార్ స‌ల్మాన్ ఖాన్ కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ సినిమా SVC63 ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

By:  Sravani Lakshmi Srungarapu   |   24 May 2026 4:00 PM IST
వంశీ పైడిపల్లి బాలీవుడ్ గేమ్ స్టార్ట్.. సల్మాన్ కోసం భారీ స్కెచ్!
X

టాలీవుడ్ డైరెక్ట‌ర్ వంశీ పైడిప‌ల్లి, బాలీవుడ్ మెగాస్టార్ స‌ల్మాన్ ఖాన్ కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ సినిమా SVC63 ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో ప్లాన్ చేస్తుండగా, తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరో ఆసక్తికరమైన బజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే.. ఈ సినిమాకు ఇద్దరు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లు పనిచేస్తున్నారనే వార్త. కోలీవుడ్ సెన్సేషన్ అనిరుధ్ ర‌విచందర్ ఈ సినిమాకు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను హ్యాండిల్ చేస్తుండగా, టాలీవుడ్ స్టార్ కంపోజర్ S. త‌మ‌న్ పాటలను కంపోజ్ చేయనున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై ఎలాంటి అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ రాకపోయినా, ఈ వార్త ఇప్పటికే ఫ్యాన్స్ మధ్య భారీ డిబేట్‌కు దారితీసింది.

ఒకే సినిమాకు ఇద్దరు సంగీత దర్శకులు పని చేయడం భారతీయ సినీ పరిశ్రమకు కొత్త విషయమేమీ కాదు. గతంలో కూడా కొన్ని భారీ సిర‌నిమాల్లో సాంగ్స్ కోసం ఒకరు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కోసం మరొకరు పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే SVC63 విషయంలో ఆసక్తి పెరగడానికి ప్రధాన కారణం అనిరుధ్, త‌మన్ ఇద్దరూ ప్రస్తుతం తమ తమ ఇండస్ట్రీల్లో టాప్ ఫామ్‌లో ఉండటమే. ముఖ్యంగా జవాన్ తర్వాత అనిరుధ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కు నార్త్ మార్కెట్‌లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. యాక్షన్ సీక్వెన్స్‌లకు ఆయన ఇచ్చే ఎలివేషన్ మ్యూజిక్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తుందనే అభిప్రాయం ఉంది. మరోవైపు త‌మన్ మాస్ సాంగ్స్, చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌ల విషయంలో తనదైన ముద్ర వేసుకున్నారు. దీంతో సల్మాన్ ఖాన్ లాంటి మాస్ హీరోకి త‌మన్ ట్యూన్స్ పర్ఫెక్ట్‌గా సెట్ అవుతాయని అభిమానులు భావిస్తున్నారు.

ఇప్పటికే సోషల్ మీడియాలో అనిరుధ్ బీజీఎం vs త‌మన్ సాంగ్స్ అంటూ పెద్ద ఎత్తున చర్చలు మొదలయ్యాయి. ఎవరి వర్క్ సినిమాకు ఎక్కువ హైలైట్ అవుతుందనే అంశంపై ఫ్యాన్స్ మధ్య వాదనలు జరుగుతున్నాయి. కొందరు అనిరుధ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రాణంగా మారుతుందని చెబుతుంటే, మరికొందరు త‌మన్ మాస్ పాటలే మూవీకి అసలు బలం అవుతాయని అంటున్నారు. ముఖ్యంగా సల్మాన్ ఖాన్ ఈద్ రిలీజ్ సినిమాల్లో సాంగ్స్‌కు ఉండే ప్రాధాన్యత దృష్ట్యా త‌మన్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ ప్రాజెక్ట్ మరో విధంగా కూడా ఇండస్ట్రీలో చర్చనీయాంశమవుతోంది. బాలీవుడ్ ప్రస్తుతం సౌత్ టెక్నీషియన్స్‌పై ఎక్కువగా ఆధారపడుతోందనే వాదనకు SVC63 మరో ఉదాహరణగా మారుతోంది. గత కొన్నేళ్లుగా సౌత్ డైరెక్ట‌ర్లు, మ్యూజిక్ డైరెక్ట‌ర్లు, యాక్షన్ టెక్నీషియన్స్‌కు హిందీలో భారీ డిమాండ్ ఏర్పడింది. పాన్ ఇండియా ట్రెండ్ పెరిగిన తర్వాత బాలీవుడ్ నిర్మాతలు కూడా సౌత్ కమర్షియల్ స్టైల్‌పై ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. అందుకే వంశీ పైడిపల్లి లాంటి డైరెక్ట‌ర్‌ని, అనిరుధ్- త‌మన్ వంటి మ్యూజిక్ డైరెక్ట‌ర్ల‌ను ఒకే ప్రాజెక్ట్ కోసం తీసుకురావడం వెనుక పెద్ద మార్కెట్ స్ట్రాటజీ ఉందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

ఇక నిర్మాత దిల్ రాజు కూడా ఈ సినిమాతో నార్త్ మార్కెట్‌లో మరింత బలమైన స్థానం సంపాదించాలనే టార్గెట్‌తో ఉన్నట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఈద్ 2027 కానుకగా విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సల్మాన్ ఖాన్‌కు ఈద్ సీజన్‌లో ఉన్న ప్రత్యేకమైన బాక్సాఫీస్ ట్రాక్ రికార్డ్ దృష్ట్యా, SVC63పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.