పుస్తకం పై కవర్ చూసి జడ్జ్ చేయొద్దు!
‘మాతృభూమి: మే వార్ రెస్ట్ ఇన్ పీస్’పై వస్తున్న ఏఐ, వీఎఫ్ఎక్స్ విమర్శలకు సల్మాన్ ఖాన్ కౌంటర్ ఇచ్చారు. ట్రైలర్ చూసి సినిమాపై నిర్ణయానికి రావద్దని, పూర్తి చిత్రం డిసెంబర్ 4న థియేటర్లలో విడుదలయ్యాక మాట్లాడాలని సూచించారు. విమర్శల వల్ల వ్యూస్, డబ్బులు వస్తే తనకు అభ్యంతరం లేదని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
By: Srikanth Kontham | 21 Nov 2026 1:00 PM ISTబాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ హైదరాబాద్ వేదికగా జరిగిన `మాతృభూమి: మే వార్ రెస్ట్ ఇన్ పీస్` ప్రమోషనల్ ఈవెంట్‌లో తనదైన శైలిలో విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. సినిమాలో సైనికుల త్యాగాలు.. కుటుంబాల భావోద్వేగాల గురించి పట్టించుకోకుండా ఏఐ వీఎఫ్ఎక్స్ అంటూ సోషల్ మీడియాలో కొందరు చేస్తున్న హడావుడిని సల్మాన్ తప్పుబట్టారు. అసలు లొకేషన్లలో కష్టపడి షూట్ చేసిన సన్నివేశాలను కూడా కృత్రిమ మేధతో చేసినవని కొట్టేయడం వెనుక ఉన్న అంతర్యాన్ని సల్మాన్ ప్రశ్నించారు.
గతంలో విడుదలైన `మదిరాపన్` పాట నుంచే సల్మాన్ షూటింగ్‌లో పాల్గొనలేదనీ అంతా ఏఐ మాయాజాలమనీ ప్రచారం మొదలైంది. తాజాగాట్రైలర్ విషయంలోనూ అదే పల్లవి అందుకున్నారు. దీనిపై సల్మాన్ గట్టి కౌంటర్ ఇచ్చారు. ప్రతి ఒక్కరూ ఏఐ, వీఎఫ్ఎక్స్ నిపుణుల్లా మాట్లాడుతున్నారని అసలు వీళ్లంతా ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నారని సల్మాన్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. తాను స్వయంగా ఈ కామెంట్లను చూడకపోయినా? తన టీమ్ ద్వారా అన్ని విషయాలు తెలుస్తున్నాయన్నారు.
ఐదు నిమిషాల ట్రైలర్‌లోనే ఇన్ని వంకలు వెతికిన వారికి డిసెంబర్ 4న థియేటర్లలో విడుదలయ్యే రెండున్నర గంటల పూర్తి సినిమాలో ఇంకెన్ని పాయింట్లు దొరుకుతాయో? అని సల్మాన్ చురకలేశారు. `పుస్తకం ముఖచిత్రాన్ని చూసి లోపల ఏముందో అంచనా వేయకూడదు` అనే సామెతను గుర్తుచేస్తూ ఇప్పటికే ట్రైలర్‌తో ఓ నిర్ణయానికి వచ్చిన వాళ్లకు సినిమా విడుదలయ్యాక పరిస్థితి తారుమారైతే ఎలా ఉంటుందో? చూడాలన్నారు.
తనను ..తన సినిమాను విమర్శించడం వల్ల ఎవరికైనా వ్యూస్, ఫాలోవర్లు పెరిగి డబ్బులు వస్తుంటే సంతోషమేనని దేవుడు వారిని చల్లగా చూడాలని సల్మాన్ సరదాగా వ్యాఖ్యానించారు. విమర్శకుల మాటలతో సైనికుల కథ పక్కదారి పట్టదని.. నిజాయితీగా తీసిన సినిమా ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటుందనే ధీమాను సల్మాన్ వ్యక్తం చేసారు.
అపూర్వ లఖియా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సల్మాన్ సైనికుడిగా.. చిత్రాంగద సింగ్ ఆయన భార్యగా నటించారు. భారత్-చైనా సరిహద్దు ఘర్షణల నేపథ్యంలో సాగే కథాంశం ఇది. గతంలో `బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్` పేరుతో వార్తల్లో నిలిచింది. కానీ టైటిల్ పై అభ్యంతరం వ్యక్తమవ్వడంతో మార్పు చేసారు. ఈ సినిమాకు సంబంధించిన సెన్సాన్ పూర్తవ్వడంలోనూ చాలా అవాంతరాలు ఎదురయ్యాయి. సెన్సార్ తో పాటు కేంద్ర బృందం కూడా సినిమా చూసిన తర్వాతే సెన్సార్ ఒకే అయింది.
