వయసుపై కామెంట్స్.. స్టేజ్‌పైనే విప్పేసిన సల్మాన్
ముందుగా క్యాప్ తీసేసిన సల్మాన్.. తర్వాత టీషర్ట్ కూడా తీసేశాడు. మేకప్ ఆర్టిస్ట్ ను పిలిచి ముఖంపై ఉన్న మేకప్‌ను కూడా తుడిపించుకున్నాడు.
By: M Prashanth | 20 Sept 2026 9:19 AM ISTసల్మాన్ ఖాన్ వయసు, బరువు, జుట్టు గురించి సోషల్ మీడియాలో కొంతకాలంగా కామెంట్స్ వస్తున్నాయి. వాటిపై పెద్దగా స్పందించని సల్మాన్ ఈసారి ‘బిగ్ బాస్ 20’ వేదికపైనే మాట్లాడాడు. తనకు 60 ఏళ్లు వచ్చాయని, ఇంకా ‘మైనే ప్యార్ కియా’ రోజుల్లానే కనిపించాలని ఎలా ఆశిస్తారని ప్రశ్నించాడు. అక్కడితో ఆగకుండా తన లుక్‌పై కామెంట్స్ చేసే వాళ్లకు అక్కడికక్కడే సమాధానం ఇచ్చాడు.
ముందుగా క్యాప్ తీసేసిన సల్మాన్.. తర్వాత టీషర్ట్ కూడా తీసేశాడు. మేకప్ ఆర్టిస్ట్ ను పిలిచి ముఖంపై ఉన్న మేకప్‌ను కూడా తుడిపించుకున్నాడు. ఆ తర్వాత తనను ట్రోల్ చేయాలనుకునేవాళ్లు చేసుకోవచ్చని అన్నాడు. ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత సల్మాన్ ఇలా స్పందించడం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.
తన గురించి మాత్రమే కాకుండా సోదరుడు సోహైల్ ఖాన్, వరుణ్ ధావన్‌పై వచ్చిన కామెంట్స్‌ను కూడా సల్మాన్ ప్రస్తావించాడు. ముందు తమను తాము చూసుకుని తర్వాత ఇతరుల శరీరం, లుక్ గురించి ఎగతాళి చేయాలని అన్నాడు. హీరోలు ఎప్పుడూ ఒకేలా కనిపించాలనే అంచనాలపైనా మాట్లాడాడు. వయసు పెరిగితే ముఖంలో, శరీరంలో మార్పులు రావడం సహజమేనని చెప్పాడు.
మహిళల బరువుపై వచ్చే కామెంట్స్ గురించి కూడా మాట్లాడాడు. గర్భధారణ తర్వాత బరువు పెరగడాన్ని కూడా కొందరు ట్రోల్ చేస్తున్నారని, తిరిగి సినిమాల్లోకి వచ్చినప్పుడు వాళ్లు మళ్లీ తమ పాత్రకు తగ్గట్టుగా సిద్ధమవుతారని అన్నాడు. సల్మాన్ ఎవరిపేరూ చెప్పలేదు. అయితే ఇటీవల కత్రినా కైఫ్‌పై వచ్చిన కామెంట్స్‌తో ఈ మాటలను సోషల్ మీడియాలో చాలామంది కలిపి చూస్తున్నారు.
హీరోయిన్లను ఫొటోగ్రాఫర్లు చిత్రీకరించే విధానంపైనా సల్మాన్ మాట్లాడాడు. వెనక నుంచి లేదా వారికి ఇబ్బందిగా అనిపించే కోణాల్లో ఫొటోలు, వీడియోలు తీయడం నచ్చదని చెప్పాడు. సాయి మంజ్రేకర్‌కు ఎదురైన ఘటనతో పాటు తన కుటుంబంలోని అమ్మాయిలను కూడా ఇలాగే పోటోలు తీసిన సందర్భాలను గుర్తుచేశాడు. ప్రస్తుతం సల్మాన్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న సినిమాలో నటిస్తున్నాడు. నయనతార హీరోయిన్‌గా చేస్తున్న ఈ చిత్రాన్ని 2027 ఈద్‌కు విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.
