మంచి రిలేషన్‌షిప్స్ కోసం 50కోట్ల పారితోషికం తగ్గించుకున్న స్టార్ హీరో!
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ప్రస్తుతం తెలుగు దర్శకుడు, తెలుగు బ్యానర్‌తో కలిసి పని చేస్తున్న సంగతి తెలిసిందే.
By: Sivaji Kontham | 2 Aug 2026 5:00 AM ISTబాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ప్రస్తుతం తెలుగు దర్శకుడు, తెలుగు బ్యానర్‌తో కలిసి పని చేస్తున్న సంగతి తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న భారీ చిత్రం SVC63 ప్రస్తుతం నిరంతర చర్చల్లో నిలుస్తోంది. ఈ మూవీ కోసం బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తీసుకున్న ఒక నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
సల్మాన్ ఖాన్ తన కెరీర్ లో నెవ్వర్ బిఫోర్ డెసిషన్ ఇది అని అందరూ పొగిడేస్తున్నారు. అంతగా ఆయన ఏం చేసారు? అంటే... భాయి జాన్ తన అడ్వాన్స్ పారితోషికాన్ని భారీగా తగ్గించుకోవడానికి అంగీకరించినట్లు వార్తలు వస్తున్నాయి. భారతదేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే నటులలో ఒకరైన సల్మాన్ సాధారణంగా ఒక్కో సినిమాకు దాదాపు 120 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ వసూలు చేస్తారు. అయితే ఈ చిత్రం కోసం ఆయన 70 కోట్లు మాత్రమే పారితోషికంగా తీసుకోవడానికి అంగీకరించారట. ఇటీవలి కాలంలో సల్మాన్ తీసుకున్న ఈ విధమైన నిర్ణయం సినీ వర్గాల్లోనూ, అభిమానుల్లోనూ ఆసక్తిని రేకెత్తించింది.
ఈ భారీ పారితోషికం తగ్గింపు వెనుక ఆర్థికపరమైన అంశాల కంటే వ్యక్తిగత అనుబంధాలే ప్రధాన కారణమని తెలుస్తోంది. సినీ పరిశ్రమ వర్గాల ప్రకారం.. సల్మాన్ ఖాన్ తన ఆప్తమిత్రుడు రఫీ కాజీ తో ఉన్న సుదీర్ఘ అనుబంధం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకోవడంలో రఫీ కీలక పాత్ర పోషించడమే కాకుండా ఈ చిత్రానికి సహ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. స్నేహితుడికి మద్దతుగా నిలవడంలో ఎప్పుడూ ముందుండే సల్మాన్ తన అడ్వాన్స్ ఫీజును తగ్గించుకోవడం ద్వారా ఈ ప్రాజెక్ట్‌కు తన మద్దతును అందించారని సమాచారం.
ఈ చిత్రానికి అడ్వాన్స్ పారితోషికంగా 70 కోట్లు మాత్రమే తీసుకుంటున్నట్లు వార్తలు వచ్చినా ఈ సినిమా లాభాల్లో వాటా లేదా ఇతర హక్కుల ఒప్పందం ఏమైనా ఉందో లేదో అనే విషయమై స్పష్టత లేదు. సాధారణంగా సల్మాన్ ఖాన్ ఒప్పందాలలో అడ్వాన్స్ ఫీజుతో పాటు లాభాల్లో భాగస్వామ్యం కూడా ప్రధాన భూమిక పోషిస్తుంది. అయితే ఈ ప్రాజెక్ట్ విషయంలో అటువంటి ప్రత్యేక ఒప్పందం జరిగిందో లేదో తెలియరాలేదు.
గత పదేళ్లుగా సల్మాన్ ఖాన్ వ్యాపార సరళిని పరిశీలిస్తే.. కేవలం స్థిరమైన పారితోషికంపైనే ఆధారపడకుండా లాభాల్లో వాటా లేదా నిర్మాణ భాగస్వామ్యాలనే ఎక్కువగా ఎంచుకుంటున్నారు. 2010లో వచ్చిన `దబంగ్` సినిమా నుండి ఆయన నటించిన చాలా చిత్రాలు స్వంత నిర్మాణ సంస్థ సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ (SKF) లేదా కుటుంబ సభ్యుల నిర్మాణంలోనే తెరకెక్కాయి. ఇతర బ్యానర్లతో పనిచేసేటప్పుడు కూడా డిజిటల్, శాటిలైట్ లేదా ఇతర హక్కుల వాటాల ద్వారా ప్రాజెక్ట్ భాగస్వామ్యాన్ని కొనసాగించడం ఆయన అలవాటు.
మరోవైపు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ పై టాలీవుడ్ లో భారీ అంచనాలేర్పడ్డాయి. ఇందులో సల్మాన్ ఖాన్ సరసన కథానాయికగా నయనతార నటిస్తోంది. ఈ ప్రాజెక్ట్‌తో పాటు అపూర్వ లఖియా దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ నటిస్తున్న `మాతృభూమి: మే వార్ రెస్ట్ ఇన్ పీస్` చిత్రం కూడా విడుదలకు సిద్ధమవుతోంది.
