Begin typing your search above and press return to search.

''పిచ్చెక్కిందా? సినిమా ముఖ్యామా.. ఒకరి ప్రాణం ముఖ్యామా?'' ఫోటోగ్రాఫ‌ర్ల‌పై భాయ్ సీరియ‌స్!

బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ (సల్లూ భాయ్) ముంబైలోని ఒక ఆసుపత్రి వెలుపల ఫోటోగ్రాఫర్స్ పై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసిన ఉదంతం ప్రస్తుతం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.

By:  Sivaji Kontham   |   21 May 2026 5:00 AM IST
పిచ్చెక్కిందా? సినిమా ముఖ్యామా.. ఒకరి ప్రాణం ముఖ్యామా? ఫోటోగ్రాఫ‌ర్ల‌పై భాయ్ సీరియ‌స్!
X

బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ (సల్లూ భాయ్) ముంబైలోని ఒక ఆసుపత్రి వెలుపల ఫోటోగ్రాఫర్స్ పై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసిన ఉదంతం ప్రస్తుతం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. ముంబై హిందూజా ఆసుపత్రిలో చేరిన త‌మ బంధువులు లేదా మిత్రులను ప‌రామ‌ర్శించేందుకు స‌ల్లూ భాయ్ అక్క‌డికి వెళ్లారు. అయితే ట్రాఫిక్ సిగ్నల్ వద్దే ఆయన వాహనాన్ని గుర్తించిన కొందరు ఫోటోగ్రాఫర్స్ అక్కడ నుండి ఆసుపత్రి ప్రాంగణం వరకు సల్మాన్‌ను వెంబడించారు. భాయ్ ఆసుపత్రి లోపలికి వెళ్లేటప్పుడు ఏమీ మాట్లాడక‌పోయినా.. తిరిగి బయటకు వచ్చే సమయంలో ఫోటోగ్రాఫర్స్ ప్రవర్తన హద్దులు దాటింది.

సల్మాన్ ఖాన్ బయటకు రాగానే ఆయన దృష్టిని ఆకర్షించడానికి కొందరు ఫోటోగ్రాఫర్స్ త‌న త‌దుప‌రి చిత్రం పేరును ప్రస్తావిస్తూ ''భాయ్, భాయ్, మాతృభూమి!'' అంటూ బిగ్గరగా కేకలు వేశారు. ఆసుపత్రి వంటి అత్యంత సున్నితమైన ప్రదేశంలో అలా అల్లరి చేయడంతో తీవ్ర అసహనానికి గురైన సల్మాన్... తలపై చేయి వేసి చూపిస్తూ ''మీకు పిచ్చెక్కిందా?'' అంటూ హెచ్చరించారు. అంతేకాకుండా.. వారి వైపు నడుచుకుంటూ వెళ్లి, ''మీ కుటుంబ సభ్యులలో ఎవరైనా ఆసుపత్రిలో చేరితే మీరు ఇలాగే ప్రవర్తిస్తారా?'' అని నిలదీశారు. దాంతో భయపడిపోయిన సదరు ఫోటోగ్రాఫర్స్ అక్కడికక్కడే ఆయనకు క్షమాపణలు చెప్పారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో సల్మాన్ ఖాన్ సోషల్ మీడియా వేదికగా మీడియా తీరును తీవ్రంగా ఎండగట్టారు. ప్రెస్ జీవనోపాధి కోసం తాను ఎల్లప్పుడూ అండగా నిలబడ్డానని గుర్తుచేసిన ఆయన ఒకరి వ్యక్తిగత బాధను చూసి ఆనందిస్తూ వ్యాపారం చేసుకోవాలనుకోవడంపై మండిపడ్డారు. ''సినిమా పేరును లాగుతూ కేకలు వేస్తున్నారు.. అసలు మీకు సినిమా ముఖ్యామా లేక ఒకరి ప్రాణం ముఖ్యామా?'' అంటూ సల్మాన్ ఘాటుగా ప్రశ్నించారు. తనకు 60 ఏళ్లు వచ్చినా పోరాడటం మర్చిపోలేదని.. భవిష్యత్తులో తన కుటుంబ సభ్యులు బాధల్లో ఉన్నప్పుడు ఇలాంటి స్టంట్స్ మరొకసారి ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని పవర్‌ఫుల్ వార్నింగ్ ఇచ్చారు.

సల్మాన్ ఖాన్ విషయంలోనే కాదు... బాలీవుడ్‌లో సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలలో త‌ల‌దూరుస్తూ ఫోటోగ్రాఫర్లు ఇలా హద్దులు మీరడం కొత్తేమీ కాదు. ఇంత‌కుముందు కూడా సెల‌బ్రిటీల ప్రైవ‌సీ మ్యాట‌ర్స్ లో ఫోటోగ్రాఫ‌ర్లు అతిగా ఇన్వాల్వ్ అయ్యి అసంద‌ర్భంగా వివాదాలకు తెర‌తీసిన సంద‌ర్భాలున్నాయి. విచారకరమైన విషయం ఏమిటంటే.. కొన్నిసార్లు చావుల వద్ద, ప్రముఖుల అంత్యక్రియల సమయంలో కూడా వారి అంతిమయాత్రను, కుటుంబ సభ్యుల కన్నీళ్లను క్లోజప్ షాట్స్‌లో క్యాప్చర్ చేయడానికి కొందరు ఫోటోగ్రాఫర్ ప్రబుద్ధులు అత్యుత్సాహం ప్రదర్శిస్తుంటారు. చావుల వద్ద కూడా మానవత్వాన్ని మర్చిపోయి కేవలం వ్యూస్, క్లిక్స్ కోసం ఎమోషనల్ ఘట్టాలను వ్యాపార వస్తువులుగా మార్చేయడం బాలీవుడ్ మీడియా కల్చర్‌లో తరచూ విమర్శలకు దారితీస్తోంది.

ఉత్తరాది హిందీ మీడియాతో పోలిస్తే మన టాలీవుడ్ (తెలుగు) మీడియా - ఫోటోగ్రాఫర్లు ఇలాంటి సున్నితమైన విషయాలలో ఎంతో సంయమనంతో వ్యవహరిస్తారు. తెలుగు ఇండస్ట్రీలో స్టార్ల వ్యక్తిగత జీవితాలకు.. ముఖ్యంగా ఆసుపత్రులు, అంత్యక్రియలు వంటి ఎమోషనల్ సందర్భాలలో అనవసరమైన హంగామా సృష్టించకుండా తగిన గౌరవాన్ని ఇస్తారు. సెలబ్రిటీలు ఎలాంటి బాధాకరమైన సన్నివేశంలో ఉన్నారో తెలుసుకోకుండా కేవలం ఫోటోల కోసం వెంటపడటం ముమ్మాటికీ పెద్ద తప్పే. బాలీవుడ్ స్టిల్ ఫోటోగ్రాఫ‌ర్లు ఇప్పటికైనా సల్మాన్ ఖాన్ ఆగ్రహాన్ని ఒక హెచ్చరికగా తీసుకుని..సెలబ్రిటీల వ్యక్తిగత స్వేచ్ఛకు.. మానవీయత‌కు విలువ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది.