సెట్లో స్త్రీల విషయంలో స్టార్ హీరో అలా ప్రవర్తిస్తారు!
అంతేకాదు సెట్ లో ఉన్నప్పుడు ఆడవారికి అసౌకర్యం కలిగించేలా సన్నివేశం చిత్రీకరించాల్సి ఉంటే దానిని సల్మాన్ మార్చాలని సూచించినట్టు కూడా డైసీ తెలిపారు.
By: Sivaji Kontham | 27 Aug 2025 11:49 AM ISTసల్మాన్ ఖాన్ సరసన జై హూ, రేస్ 3 లాంటి భారీ చిత్రాల్లో నటించింది డైసీ షా. తాను అతడితో కలిసి పని చేస్తున్న సమయంలో సెట్లలో నటీమణులు ఎలా ఉండాలో సల్మాన్ ఖాన్ కొన్ని నియమాలు అమలు చేసారని తెలిపింది. సెట్లో ఉన్నప్పుడు మహిళలు సాంప్రదాయబద్ధమైన దుస్తులు ధరించాలని సూచించినట్టు డైసీ షా తెలిపారు. సెట్లో ఆడవారి భద్రత గురించి సల్మాన్ చాలా జాగ్రత్తలు తీసుకుంటారని, వృత్తిపరంగా సెట్లో ఉన్న మహిళలకు ఆయన గొప్ప గౌరవం ఇస్తారని వెల్లడించారు.
అమ్మాయిలు అందమైన అలంకార వస్తువు! అనే భావన సల్మాన్ లో ఏ మూలా ఉండదు. నిరాడంబరమైన దుస్తులు ధరిస్తే స్త్రీ అందంతో పాటు, చక్కదనం పెరుగుతుందని ఆయన భావిస్తారు. మహిళల గౌరవం, భద్రత విషయంలో సల్మాన్ రాజీకి రారని కూడా డైసీ షా వెల్లడించారు. స్త్రీ ఎంతగా కప్పుకుని కనిపిస్తే, అంత అందంగా కనిపిస్తుందని సల్మాన్ అనేవారని కూడా డైసీ షా తెలిపారు.
అంతేకాదు సెట్ లో ఉన్నప్పుడు ఆడవారికి అసౌకర్యం కలిగించేలా సన్నివేశం చిత్రీకరించాల్సి ఉంటే దానిని సల్మాన్ మార్చాలని సూచించినట్టు కూడా డైసీ తెలిపారు. సహనటీమణులు అసౌకర్యంగా ఉన్నామని చెబితే ఆ సన్నివేశాన్ని చిత్రీకరించకూడదని సల్మాన్ చెబుతారు. జై హూ చిత్రీకరణ సమయంలో, ఓసారి నైట్ డ్రెస్ లో షూట్ చేయాల్సి ఉండగా, ఆ దుస్తులు ఆ సన్నివేశానికి సరిపడేవి కావని వెంటనే దుపట్టాతో కప్పాలని సల్మాన్ సూచించినట్టు తెలిపారు. సహనటీమణుల కేరింగ్ విషయంలో గొప్ప శ్రద్ధ, ఎనలేని గౌరవం కలిగి ఉంటారని డైసీ షా అన్నారు.
బాలీవుడ్ లో ప్రముఖ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్యకు సహాయకురాలిగా కెరీర్ ప్రారంభించిన డైసీ షా, ఆ తర్వాత భద్ర (2011) అనే కన్నడ చిత్రంలో కథానాయికగా నటించారు. అటుపై బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ జై హో (2014)లో నటించింది. హేట్ స్టోరీ 3 (2015), ఖత్రోన్ కే ఖిలాడి 13 (2023) తనకు గొప్ప పేరును తెచ్చాయి.
డైసీ షా తరహాలోనే యంగ్ బ్యూటీ పాలక్ తివారీ కూడా మహిళా నటీమణుల విషయంలో సల్మాన్ ఖాన్ ఎలా ప్రవర్తిస్తారు? అనేదానిపై సవివరంగా మాట్లాడారు. `యాంటిమ్` సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్నప్పుడు సెట్లో స్త్రీల దుస్తుల విషయంలో సల్మాన్ కొన్ని నియమాలను ప్రతిపాదించి కఠినంగా అమలు చేసారని తెలిపింది. సెట్ లో ఒంటిని పూర్తిగా కప్పుకునే దుస్తులతో నిరాడంబరంగా ఉండాలని సూచించినట్టు కూడా వెల్లడించారు. తన సమక్షంలో పని చేసే ఆడవారు తెలియనివారితో పని చేయాల్సి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలని సల్మాన్ భావించేవారని పాలక్ తెలిపారు.
సల్మాన్ ప్రస్తుతం గాల్వాన్ లోయ బ్యాటిల్ ఆధారంగా ఓ సినిమా చేయాల్సి ఉండగా, చిత్రీకరణ వాయిదా పడిందని కథనాలొచ్చాయి. సల్మాన్ కథానాయకుడిగా మురుగదాస్ తెరకెక్కించిన `సికిందర్` డిజాస్టర్ అయ్యాక సల్మాన్ సెలక్టివ్ గా కథలను ఎంపిక చేస్తున్న సంగతి తెలిసిందే.
