ఒక్క సినిమా.. మూడు మార్కెట్లు.. సల్మాన్ "మాన్‌స్టర్" ప్లాన్ ఇదేనా?
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కెరీర్‌లో ఇప్పుడు మరో కీలక దశ మొదలైనట్టే కనిపిస్తోంది.
By: Sravani Lakshmi Srungarapu | 26 Aug 2026 12:16 PM ISTబాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కెరీర్‌లో ఇప్పుడు మరో కీలక దశ మొదలైనట్టే కనిపిస్తోంది. గత కొంతకాలంగా ఆయన నుంచి వస్తున్న సినిమాలు ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్ వద్ద ఇంపాక్ట్ ను చూపలేకపోయాయి. దీంతో సల్మాన్‌కు మరో స్ట్రాంగ్ సక్సెస్ అవసరమనే డిస్కషన్ బాలీవుడ్‌లో వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాన్‌స్టర్ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. ఇది కేవలం మరో భారీ సినిమా మాత్రమే కాకుండా.. సల్మాన్‌కు మళ్లీ తన స్టార్‌డమ్‌ను బలంగా చాటుకునే అవకాశం కావొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే ఈ ప్రాజెక్ట్‌లో ప్రత్యేకంగా కనిపిస్తున్న అంశం సల్మాన్‌తో కలిసి పనిచేస్తున్న సౌత్ ఫిల్మ్‌మేకింగ్ టీమ్. టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న వంశీ పైడిపల్లి ఇప్పుడు బాలీవుడ్ సూపర్‌స్టార్‌ను డైరెక్ట్ చేస్తున్నారు. దిల్ రాజు నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమా ద్వారా సల్మాన్‌ను వంశీ ఏ విధంగా ప్రెజెంట్ చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా యాక్షన్‌తో పాటు ఎమోషన్‌కు ప్రాధాన్యత ఇచ్చే కథతో సల్మాన్‌ను కొత్తగా చూపించే ప్రయత్నం జరుగుతుందనే అంచనాలున్నాయి.
ఇక్కడే సల్మాన్- సౌత్ కనెక్ట్ అనే అంశం కూడా ప్రాధాన్యత సంతరించుకుంటోంది. డైరెక్టర్ వంశీ పైడిపల్లి, నిర్మాత దిల్ రాజు, హీరోయిన్ నయనతార.. ఇలా కీలక విభాగాల్లో సౌత్‌కు చెందిన పేర్లు ఉండటం సినిమాకు ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొస్తోంది. సల్మాన్‌కు ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ మార్కెట్ ఉంది. అయితే ఈ కాంబినేషన్‌తో నార్త్ మార్కెట్‌తో పాటు తెలుగు, తమిళ మార్కెట్లలోనూ సినిమాకు మరింత స్ట్రాంగ్ కనెక్ట్ తీసుకురావాలనే ప్రయత్నంగా దీన్ని చూడొచ్చు.
మరోవైపు సల్మాన్ సినిమాలకు, ఈద్ సీజన్‌కు ఉన్న అనుబంధం కూడా మాన్‌స్టర్ విషయంలో కీలకంగా మారనుంది. పండగ సీజన్‌లో భారీ స్థాయిలో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే సల్మాన్ బ్రాండ్ వాల్యూ ఈ సినిమాకు అదనపు బలంగా మారే అవకాశం ఉంది. సరైన కంటెంట్, స్టార్ ఇమేజ్, పండగ సీజన్.. ఈ మూడు కలిస్తే మాన్‌స్టర్‌కు భారీ ఓపెనింగ్స్ దక్కే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఇప్పుడు మాన్‌స్టర్ ను ఒకే మార్కెట్‌కు పరిమితమైన సినిమా కంటే.. బాలీవుడ్‌లో సల్మాన్ మార్కెట్, తెలుగు రాష్ట్రాల్లో వంశీ- దిల్ రాజు కాంబినేషన్, తమిళ మార్కెట్‌లో నయనతార క్రేజ్‌ను కలిపే ప్రయత్నంగా చూడొచ్చు. ఒక్క సినిమా.. మూడు మార్కెట్లు.. ఇదే సల్మాన్ మాన్‌స్టర్ అసలు ప్లాన్‌నా? అన్నదే ఇప్పుడు ఆసక్తికరమైన ప్రశ్నగా మారింది.
