సల్మాన్-పైడిపల్లి సినిమా రీమేకా?
చాలా ఏళ్లుగా సరైన విజయం లేక ఇబ్బంది పడుతున్న సల్మాన్‌కు వంశీ, రాజు కలిసి హిట్ ఇస్తారని నార్త్ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
By: Garuda Media | 28 Sept 2026 1:00 PM ISTటాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో మహర్షి లాంటి భారీ చిత్రం చేశాక.. తమిళంలోకి వెళ్లి అక్కడ నంబర్ వన్ హీరోగా వెలుగొందుతున్న విజయ్‌తో వారిసు మూవీ తీశాడు వంశీ పైడిపల్లి. అట్నుంచి బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి ఇప్పుడు సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్‌తో మాన్‌స్టర్ మూవీ చేస్తున్నాడు వంశీ. మొదట్నుంచి వంశీతో సినిమాలు ప్రొడ్యూస్ చేస్తున్న దిల్ రాజే ఈ మూవీని కూడా నిర్మిస్తున్నాడు. చాలా ఏళ్లుగా సరైన విజయం లేక ఇబ్బంది పడుతున్న సల్మాన్‌కు వంశీ, రాజు కలిసి హిట్ ఇస్తారని నార్త్ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
ఈ సినిమా మీద సల్మాన్ కూడా చాలా ధీమాగా ఉన్నట్లు కనిపిస్తోంది. మేకింగ్ దశలో ఉండగానే ఈ సినిమాకు బిజినెస్ అయిపోయినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. మొదట్నుంచి పాజిటివ్ బజ్ ఉన్న ఈ సినిమా గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వార్త హల్‌చల్ చేస్తోంది. ఇది స్ట్రెయిట్ మూవీ కాదని, ఒక పాత తమిళ చిత్రానికి రీమేక్ అని ప్రచారం జరుగుతోంది. ఆ సినిమా ఏదో కాదు.. తనీ ఒరువన్.
జయం రవి హీరోగా అతడి సోదరుడు మోహన్ రాజా రూపొందించిన తనీ ఒరువన్ ఎప్పుడో 2015లో విడుదలైంది. ఆ టైంలో తమిళంలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిందీ మూవీ. తమిళంలో స్టార్ హీరోలు నటించిన బెస్ట్ థ్రిల్లర్ మూవీస్‌లో ఇదొకటిగా నిలిచింది. దీన్నే తెలుగులో రామ్ చరణ్ హీరోగా ధృవ పేరుతో రీమేక్ చేస్తే.. ఇక్కడా హిట్టయింది. ఇన్నేళ్ల తర్వాత ఈ సినిమాను హిందీలో తీస్తున్నారంటే ఆశ్చర్యం కలుగుతోంది. సల్మాన్‌కు గతంలో పోకిరి, రెడీ లాంటి సౌత్ రీమేక్‌లు కలిసొచ్చాయి కానీ.. తర్వాత ఏవీ ఫలితాన్నివ్వలేదు.
తనీ ఒరువన్ లాంటి పాపులర్, పాత సినిమాను ఇప్పుడు రీమేక్ చేయడం కరెక్టేనా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఐతే ఈ ప్రచారం నిజమేనా అనే చర్చ కూడా జరుగుతోంది. కొందరు కావాలనే ఈ పుకారు పుట్టించి వైరల్ చేస్తున్నారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. షారుఖ్ సినిమా కింగ్ ఒక ఫారిన్ మూవీకి రీమేక్ అని ప్రచారం మొదలవగా.. దానికి కౌంటర్‌గా సల్మాన్ మూవీ మీద దుష్ప్రచారం చేస్తన్నారని కూడా అంటున్నారు. కానీ మాన్‌స్టర్.. తనీ ఒరువన్ రీమేక్ అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులైతే కనిపిస్తున్నాయి. ఇదెంత వరకు నిజమో చూడాలి మరి.
