Begin typing your search above and press return to search.

ఎంకి చావు సుబ్బికొచ్చినట్టు.. చైనాతో భారత్ స్నేహం సల్మాన్ ఖాన్‌ను దెబ్బకొట్టింది!

భారత్-చైనా సరిహద్దు ఘర్షణల నేపథ్యంలో తెరకెక్కిన అత‌డు న‌టించిన‌ తాజా చిత్రం `మాతృభూమి` విడుదల రాజకీయ, దౌత్యపరమైన కారణాల వల్ల ఎటూ తేలని సందిగ్ధంలో పడింది.

By:  Sivaji Kontham   |   15 Sept 2026 11:00 PM IST
ఎంకి చావు సుబ్బికొచ్చినట్టు.. చైనాతో భారత్ స్నేహం సల్మాన్ ఖాన్‌ను దెబ్బకొట్టింది!
X

సినిమా పరిశ్రమలో అప్పుడప్పుడు ఊహించని పరిణామాలు స్టార్ హీరోల ప్రాజెక్ట్‌లను తీవ్ర కష్టాల్లోకి నెట్టేస్తుంటాయి. సరిగ్గా అలాంటి విచిత్రమైన పరిస్థతినే ఇప్పుడు బాలీవుడ్ భాయ్‌జాన్ సల్మాన్ ఖాన్ ఎదుర్కొంటున్నారు. భారత్-చైనా సరిహద్దు ఘర్షణల నేపథ్యంలో తెరకెక్కిన అత‌డు న‌టించిన‌ తాజా చిత్రం `మాతృభూమి` విడుదల రాజకీయ, దౌత్యపరమైన కారణాల వల్ల ఎటూ తేలని సందిగ్ధంలో పడింది. ఒక సామెత చెప్పినట్లుగా.. దేశాల మధ్య మారుతున్న దౌత్య సంబంధాలు, స్నేహపూర్వక వాతావరణం ఇప్పుడు సల్మాన్ ఖాన్ కెరీర్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి.

తొలుత `బాటిల్ ఆఫ్ గల్వాన్` పేరుతో అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ఈ ప్రాజెక్ట్‌ను ఆ తర్వాత `మాతృభూమి`గా పేరు మార్చడానికి చైనాతో దౌత్య‌మే కార‌ణం. 2020లో జరిగిన గల్వాన్ లోయ ఉద్రిక్తతలు.. భారత్-చైనా సైనికుల మధ్య జరిగిన పోరాటం ఆధారంగా ఈ వార్ డ్రామా రూపుదిద్దుకుంది. అయితే సినిమా షూటింగ్ పూర్తయి రిలీజ్‌కు రెడీ అవుతున్న సమయంలో అంతర్జాతీయ రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. ఇటీవలి కాలంలో భారత్, చైనా దేశాల మధ్య దౌత్య సంబంధాలు మెరుగవుతున్న తరుణంలో ఈ సినిమాలోని కొన్ని సున్నితమైన అంశాలు రెండు దేశాల శాంతి ప్రయత్నాలకు అడ్డుగా మారుతాయనే వాదనలు తెరపైకి వచ్చాయి.

ఈ నేపథ్యంలోనే రక్షణ మంత్రిత్వ శాఖ ఈ చిత్రంలోని కంటెంట్‌పై కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నంలో భాగంగా చిత్రంలోని `చైనా` అనే పదాన్ని సైతం తొలగించవచ్చనే ఊహాగానాలు గతంలో పెద్దఎత్తున సంచలనం సృష్టించాయి. దేశాల మధ్య సంబంధాలు బలపడుతున్న సమయాన.. సరిహద్దు ఉద్రిక్తతలను కళ్లకు కట్టే ఇలాంటి చిత్రాలకు సెన్సార్ క్లియరెన్స్ రావడం ప్రభుత్వానికీ.. సెన్సార్ బోర్డుకూ కూడా ఒక సున్నితమైన విషయంగా మారింది. ఎంకి చావు సుబ్బికొచ్చినట్లుగా.. భారత్-చైనా దేశాల మధ్య కుదురుతున్న దౌత్యపరమైన సత్సంబంధాలు ఇప్పుడు సల్మాన్ ఖాన్ సినిమా విడుదలకు పెద్ద గండంగా మారాయి.

తాజాగా ఈ సినిమా త్వరలోనే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ముందుకు రానుందని.. తద్వారా రిలీజ్ డేట్ ఖరారు కానుందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ వాస్తవ పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. చైనా కనెక్షన్ కారణంగా ఈ సినిమా సెన్సార్ ప్రక్రియ ఇంకా ఎక్కడి గొంగళి అక్కడే అన్నట్టుగా నిలిచిపోయిందని ఇన్‌సైడ్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రభుత్వ అధికారులతో నిర్మాతలు నిరంతరం చర్చిస్తున్నా ఎలాంటి అధికారిక అప్‌డేట్ వెలువడకపోవడంతో సినిమా భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది.

ఒకవేళ సమస్య త్వరగా పరిష్కారమైతే ఈ ఏడాదే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నా ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఇది 2027వ సంవత్సరానికి వాయిదా పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దౌత్యపరమైన మార్పులు దేశానికి ఎంత మేలు చేసినా ఆ పరిణామాలు సరిగ్గా రిలీజ్ టైమ్‌లో సల్మాన్ ఖాన్ సినిమాను దెబ్బతీయడం విశేషం. ఏది ఏమైనా అధికారికంగా క్లియరెన్స్ వచ్చే వరకు `మాతృభూమి` గండం నుంచి గట్టెక్కడం కష్టమనే చెప్పాలి. మురుగదాస్ తో `సికింద‌ర్` డిజాస్ట‌ర్ అవ్వ‌డంతో తీవ్ర నిరాశ‌లో ఉన్న స‌ల్మాన్ ఖాన్ చాలా హోప్స్ పెట్టుకుని న‌టించిన మాతృభూమి విష‌యంలో ఇలా జ‌ర‌గ‌డం నిజంగా అత‌డిని మ‌రింత తీవ్ర నిరాశ‌కు గురి చేస్తోంది.