Begin typing your search above and press return to search.

మెగాస్టార్ సీరియ‌స్.. పుస్త‌కం అట్ట‌ను చూసి లోన ఏం ఉందో అంచ‌నా వేయ‌కు!

సల్మాన్ ఖాన్, చిత్రాంగద సింగ్ నటిస్తున్న ‘మాతృభూమి: మే వార్ రెస్ట్ ఇన్ పీస్’ నుంచి ‘మదిరాపన్’ పాట విడుదలై ఆకట్టుకుంటోంది. హిమేష్ రేషమ్మియా సంగీతం అందించిన ఈ పాటలో చిత్రాంగద డ్యాన్స్, సల్మాన్ ఆర్మీ లుక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మరోవైపు ట్రైలర్‌పై విమర్శలకు స్పందించిన సల్మాన్, డిసెంబర్ 4న సినిమా చూసిన తర్వాతే అభిప్రాయం చెప్పాలని అన్నారు.

By:  Sivaji Kontham   |   20 Nov 2026 11:09 PM IST
మెగాస్టార్ సీరియ‌స్.. పుస్త‌కం అట్ట‌ను చూసి లోన ఏం ఉందో అంచ‌నా వేయ‌కు!
X

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్- అందాల తార చిత్రాంగద సింగ్ కాంబినేషన్‌లో వస్తున్న తాజా చిత్రం నుంచి `మదిరాపన్` అనే కొత్త పాట విడుదలై సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. దర్శకుడు అపూర్వ లఖియా తెరకెక్కిస్తున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఈ పెప్పీ నంబర్‌ను సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ అధికారికంగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చింది. హిమేష్ రేషమ్మియా బాణీలు సమకూర్చిన ఈ పాటకు సమీర్ అంజాన్ సాహిత్యం అందించగా.. జావేద్ అలీ‍ మహమ్మద్ దానిష్ సౌమీ శైలేష్ తమ గాత్రంతో ప్రాణం పోశారు.

ముదస్సర్ ఖాన్ కొరియోగ్రఫీలో రూపొందిన ఈ పాటలో చిత్రాంగద సింగ్ తన గ్లామర్, డ్యాన్స్ మూవ్స్‌తో అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. స‌ల్మాన్ ఖాన్ ఆర్మీ గెట‌ప్ కూడా ఆక‌ట్టుకుంది. అత‌డి ఎన‌ర్జీ ప్ర‌త్యేక ఆకర్ష‌ణ‌. పాట విడుదలైన కొద్దిసేపటికే సోషల్ మీడియాలో మంచి స్పందన రావడంతో పాటు.. అభిమానులు దీనిని `బ్యాంగర్` అంటూ ప్రశంసిస్తున్నారు. ముఖ్యంగా చిత్రాంగద సింగ్ లుక్స్ -సల్మాన్ ఖాన్ బ్రాండ్ వాల్యూ తోడవడంతో #మ‌దిరాపాన్ హ్యాష్‌ట్యాగ్ నెట్టింట వైరల్‌గా మారింది.

సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ మ్యూజిక్ లేబుల్‌పై.. సోనీ మ్యూజిక్ పంపిణీ చేసింది. ఈ పాట సినిమాపై అంచనాలను మరింత పెంచింది. జైన్ షా, అభిశ్రీ సేన్, జేసన్ థామ్, అంకుర్ భాటియా తదితరులు నటిస్తున్న ఈ చిత్రంలో `మదిరాపన్` పాట ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ పాటకు వస్తున్న ఆదరణ చూస్తుంటే ఇది కూడా పార్టీ సాంగ్స్ జాబితాలో తప్పకుండా చోటు దక్కించుకునేలా కనిపిస్తోంది.

ప్రెస్ మీట్‌లో భాయ్ పంచ్‌లే పంచ్‌లు:

`మాతృభూమి: మే వార్ రెస్ట్ ఇన్ పీస్` ప్రమోషన్లలో భాగంగా శుక్రవారం నాడు భాయిజాన్ హైదరాబాద్‌లో సందడి చేశారు. ఈ సందర్భంగా జరిగిన ప్రెస్ మీట్‌లో..ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌పై సోషల్ మీడియాలో వస్తున్న ట్రోలింగ్ - విమర్శలపై సల్మాన్ తనదైన శైలిలో ఘాటుగా స్పందించారు. తన సినిమాను లేదా తనను విమర్శించడం వల్ల కొందరికి వ్యూస్- ఫాలోవర్లు- డబ్బులు వస్తుంటే తాను ఎంతో సంతోషిస్తానని.. వారందరికీ దేవుడి ఆశీస్సులు ఉండాలని సల్మాన్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

ట్రైలర్ నిడివి ఎక్కువగా ఉందని.. సినిమా కథ మొత్తాన్ని ట్రైలర్‌లోనే చూపించేశారని వస్తున్న కామెంట్లను సల్మాన్ ఖాన్ కొట్టిపారేశారు. ఐదు నిమిషాల ట్రైలర్‌లోనే ఇన్ని విషయాలు కనిపిస్తే.. రెండున్నర గంటల సినిమాలో ఇంకెన్ని విశేషాలు ఉంటాయో ఊహించుకోవాలని అన్నారు. పుస్తకం అట్టను చూసి లోపల ఏముందో అంచనా వేయకూడదని.. డిసెంబర్ 4న థియేటర్లలో అసలు సినిమా చూసిన తర్వాత అభిప్రాయాలు కచ్చితంగా మారుతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

అలాగే ట్రైలర్ .. తాజాగా విడుదలైన `మదిరాపన్` పాటలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ , వీఎఫ్ఎక్స్ వాడారంటూ జరుగుతున్న ప్రచారంపై సల్మాన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దేశ సైనికులు.. వారి కుటుంబాల త్యాగాల నేపథ్యంలో రూపొందించిన ఈ కథను వదిలేసి.. ఏఐ - వీఎఫ్ఎక్స్ గురించి మాట్లాడుతున్న వారంతా ఏమైనా స్పెషలిస్టులా అని ప్రశ్నించారు. నిజమైన లొకేషన్లలో ఎంతో కష్టపడి షూట్ చేసిన సన్నివేశాలను కూడా గ్రాఫిక్స్ అంటూ విమర్శించడం సరికాదని.. సైనికుల కథపై దృష్టి పెట్టకుండా కేవలం లోపాలను వెతికే వారికి ఆయన వ్యంగ్యంగా కృతజ్ఞతలు తెలిపారు. గతంలో `బ్యాటిల్ ఆఫ్ గల్వాన్` పేరుతో మొదలైన ఈ చిత్రం భారత్-చైనా సరిహద్దు ఘర్షణల నేపథ్యంలో తెరకెక్కింది. డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.