Begin typing your search above and press return to search.

మాతృభూమి ట్రైల‌ర్: గాల్వాన్ లోయ‌లో భాయ్ ఎమోష‌న‌ల్ ఘ‌ట్టాలు!

సల్మాన్ ఖాన్ నటించిన 'మాతృభూమి: మే వార్ రెస్ట్ ఇన్ పీస్' ట్రైలర్ విడుదలైంది. 2020 గాల్వన్ లోయ ఘర్షణల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కల్నల్ సంతోష్ బాబు పాత్రలో సల్మాన్ కనిపించనున్నారు. డిసెంబర్ 4న విడుదల కానున్న ఈ సినిమా ఏ దేశానికీ వ్యతిరేకం కాదని ట్రైలర్ లాంచ్‌లో సల్మాన్ స్పష్టం చేశారు.

By:  Sivaji Kontham   |   11 Nov 2026 12:12 PM IST
మాతృభూమి ట్రైల‌ర్: గాల్వాన్ లోయ‌లో భాయ్ ఎమోష‌న‌ల్ ఘ‌ట్టాలు!
X

సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా అపూర్వ లఖియా దర్శకత్వంలో తెరకెక్కిన ప్రతిష్ఠాత్మక చిత్రం `మాతృభూమి: మే వార్ రెస్ట్ ఇన్ పీస్` విడుద‌ల‌కు ముందు చాలా స్క్రుటినీని ఎదుర్కొంటున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ట్రైల‌ర్‌కి సీబీఎఫ్‌సి క్లియ‌రెన్స్ ఇవ్వ‌డానికి చాలా స‌మ‌యం ప‌ట్టింది. రిలీజ్ విష‌యంలోను భార‌త ఆర్మీ నుంచి చాలా అభ్యంత‌రాలు, సందిగ్ధ‌త‌లు త‌లెత్తాయ‌ని క‌థ‌నాలొచ్చాయి. ఈ సినిమా క‌థాంశం గాల్వాన్ లోయ‌లో చైనీ సైనికుల‌తో భార‌తీయ వీర సైనికుల బాహాబాహీ పోరాట క‌థ‌తో రూపొందుతుండ‌గా.. ఉన్న‌దున్న‌ట్టు తీస్తే.. దౌత్య‌ప‌రంగా చైనాతో కొన్ని ఇబ్బందులు త‌లెత్తుతాయ‌ని భావించిన భార‌త ర‌క్ష‌ణ శాఖ ఈ సినిమా క‌థాంశం విష‌యంలో చాలా మార్పులు చేయించాకే ఎన్.వో.సీని జారీ చేసింద‌ని క‌థ‌నాలొచ్చాయి.

డిసెంబ‌ర్‌లో ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. భాయ్ ప్ర‌మోష‌న్స్ స్టార్ట్ చేసాడు. ఎట్ట‌కేల‌కు ట్రైలర్ ఘనంగా విడుదలైంది. ట్రైల‌ర్ ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తించే ఎమోష‌న‌ల్ ఘ‌ట్టాల‌ను తెర‌పై ఆవిష్క‌రించారు. 2020లో సరిహద్దుల్లోని గాల్వన్ లోయలో భారత - చైనా దళాల మధ్య జరిగిన తీవ్రమైన ఘర్షణల నేపథ్యానికి చాలా ఫిక్ష‌న్ అంశాలను జోడించి ఈ చిత్రాన్ని రూపొందించారు. మంచు ప‌ర్వ‌తాల‌లో సైనికుల స‌వాళ్ల‌ను తెర‌పై ఆవిష్క‌రించారు. ప్ర‌తికూల వాతావ‌ర‌ణంలో జీవించ‌డ‌మే క‌ష్టం అనుకుంటే, శ‌త్రుదేశ సైనికుల‌తో పోరాటాలు ఎంత రిస్కుతో కూడుకున్న‌వో తెర‌పై క‌నిపిస్తున్నాయి. 16 బీహార్ రెజిమెంట్ కమాండింగ్ ఆఫీసర్ కర్నల్ సంతోష్ బాబు శౌర్యం - త్యాగాన్ని హైలైట్ చేస్తూ రూపొందించిన ఈ చిత్రంలో సంతోష్ బాబు పాత్ర‌లో స‌ల్మాన్ భాయ్ న‌టించారు.

దేశ రక్షణలో సైనికులు చేసే త్యాగాలు... ఆయుధాలు లేకుండా సాగిన భీకరమైన బాహాబాహీ పోరాటం.. వారి కుటుంబాలు ఎదుర్కొనే మానసిక వేదనను ఈ చిత్రం ప్రధానంగా ఆవిష్కరించనుంది. ఈ ట్రైలర్‌లో సల్మాన్ ఖాన్ చెప్పే `లెట్స్ సార్ట్ దిస్ షిట్ బ్రో` అనే డైలాగ్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. సల్మాన్ యాక్షన్ అవతార్ తో పాటు చిత్రాంగద సింగ్‌తో కెమిస్ట్రీ కథకు బలమైన ఎమోషనల్ టచ్ ఇచ్చింది. అయితే .. ఇరు దేశాల దౌత్య సంబంధాల దృష్ట్యా ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి స్క్రిప్ట్‌లో మార్పులు చేయించిందనే వార్తలను సల్మాన్ ట్రైల‌ర్ లాంచ్ ఈవెంట్‌లో ఖండించారు. ఇది ఏ దేశానికీ వ్యతిరేకంగా తీసిన చిత్రం కాదని.. ఇరు దేశాల సైనికుల కోణాన్ని చూపే కథ ఇది అని స్పష్టం చేశారు. అలాగే ప్రారంభంలో ఈ ప్రాజెక్ట్‌కి సహకరించిన ప్రముఖ డిఫెన్స్ జర్నలిస్టులు శివ్ అరూర్, రాహుల్ సింగ్ కథలోని మార్పుల కారణంగా గౌరవప్రదంగా ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంపైనా బోలెడంత చ‌ర్చ సాగింది. ఆస‌క్తిక‌రంగా ఈ సినిమాలో ప్రేమ‌క‌థ‌ను హైలైట్ చేసారనే ప్ర‌చారం ఉత్తుత్తి ప్ర‌చార‌మేన‌ని కూడా ట్రైల‌ర్ చెబుతోంది.

సల్మాన్ ఖాన్ ఫిలిమ్స్ నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. వివాదాలు ఉన్నా.. గాల్వన్ వీరుల పోరాట పటిమను వెండితెరపై చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా స‌ల్మాన్ భాయ్ అభిమానుల్లో ఒక‌టే ఉత్కంఠ నెల‌కొంది. సల్మాన్ ఖాన్ సరికొత్త ఆర్మీ ఆఫీసర్ లుక్.. గ్రాండియారిటీతో కూడుకున్న‌ విజువల్స్.. పవర్ ఫుల్ యాక్షన్ సన్నివేశాలు ఈ సినిమాపై భారీ అంచనాలను పెంచాయి.