Begin typing your search above and press return to search.

'మాతృభూమి' మొద‌టి సమీక్ష: గల్వాన్ వీరుల కథతో సల్మాన్ ప్రయోగం ఫ‌లించిందా?

బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా నటించిన‌ ప్రతిష్టాత్మక చిత్రం `మాతృభూమి: మే వార్ రెస్ట్ ఇన్ పీస్` (గతంలో `బ్యాటిల్ ఆఫ్ గల్వాన్` అనే టైటిల్ ఉండేది) నిరంత‌రం మీడియా హెడ్ లైన్స్ లో నిలుస్తున్న సంగ‌తి తెలిసిందే.

By:  Sivaji Kontham   |   30 May 2026 9:26 AM IST
మాతృభూమి మొద‌టి సమీక్ష: గల్వాన్ వీరుల కథతో సల్మాన్ ప్రయోగం ఫ‌లించిందా?
X

బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా నటించిన‌ ప్రతిష్టాత్మక చిత్రం `మాతృభూమి: మే వార్ రెస్ట్ ఇన్ పీస్` (గతంలో `బ్యాటిల్ ఆఫ్ గల్వాన్` అనే టైటిల్ ఉండేది) నిరంత‌రం మీడియా హెడ్ లైన్స్ లో నిలుస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన రఫ్ కట్‌ను పరిశ్రమకు చెందిన ప్రముఖ దర్శకులు, మిత్రుల కోసం సల్మాన్ ఖాన్ ఒక ప్రత్యేకమైన ప్రైవేట్ స్క్రీనింగ్‌ను ఏర్పాటు చేశారు. ఈ స్పెష‌ల్ షో వీక్షించిన‌ తర్వాత సినిమా గురించిన సరికొత్త సమాచారం... ఆరంభ సమీక్షలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి. ఇండియ‌న్ సినిమా రంగానికి చెందిన అగ్ర దర్శకులు ఈ సినిమాను వీక్షించి తమ స్పందనలను షేర్ చేయ‌డంతో అభిమానుల్లో ఆసక్తి రెట్టింపయింది.

ముంబైలో జరిగిన ఈ స్పెషల్ షోకు బాలీవుడ్ దిగ్గజ దర్శకులు సుభాష్ ఘాయ్, సూరజ్ బర్జాత్యా, డేవిడ్ ధావన్, కబీర్ ఖాన్, రూమి జాఫ్రీ స‌హా నటుడు రితీష్ దేశ్‌ముఖ్, కథానాయిక చిత్రంగదా సింగ్, ప్రముఖ నిర్మాత సిద్ధార్థ్ రాయ్ కపూర్ త‌దిత‌రులు హాజరయ్యారు. సల్మాన్ ఖాన్‌కు ఈ దర్శకులలో చాలామందితో సుదీర్ఘమైన వృత్తిపరమైన అనుబంధం ఉంది. మైనే ప్యార్ కియా, బజరంగీ భాయిజాన్, జుడ్వా వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలను అందించిన ఈ దర్శకులంతా ఒకే వేదికపై చేరి సల్మాన్ చిత్రానికి మద్దతుగా నిలవడం విశేషం. ఈ వేడుకకు సంబంధించిన గ్రూప్ ఫోటోను సుభాష్ ఘాయ్ సోషల్ మీడియాలో షేర్ చేయ‌డంతో ఈ సినిమా మొదటి సమీక్ష బ‌య‌టి ప్రపంచానికి తెలిసింది.

ఈ ప్రత్యేక షో అనంతరం ప్రముఖ దర్శకుడు సుభాష్ ఘాయ్ `మాతృభూమి` చిత్ర బృందాన్ని ప్రశంసిస్తూ అద్భుతమైన సమీక్షను ఇచ్చారు. గల్వాన్ సరిహద్దుల్లో భారత్-చైనా సైనికుల మధ్య జరిగిన భావోద్వేగపూరితమైన ఘ‌ర్ష‌ణ‌.. హృదయాలను హత్తుకునే ప్రేమ‌క‌థ‌తో దర్శకుడు అపూర్వ లఖియా ఈ చిత్రాన్ని తెరకెక్కించారని ఆయన పేర్కొన్నారు. దేశభక్తి - సైనికుల కుటుంబాల భావోద్వేగాలను ఈ చిత్రం ప్రతిబింబిస్తుందని.. ఇది ప్రతి ఒక్కరూ తప్పక చూడవలసిన సినిమా అని ఘాయ్ కొనియాడారు. ప్రధాన తారాగణమైన సల్మాన్ ఖాన్, చిత్రాంగ‌దా సింగ్ ల నటన, సినిమాలోని సానుకూల దృక్పథం ప్రేక్షకులను కట్టిపడేస్తుందని ఘాయ్ ఆశాభావం వ్యక్తం చేశారు.

నిజానికి 2020లో గల్వాన్ లోయలో భారత్- చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణల నేపథ్యాన్ని ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని రూపొందించారు. కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబు, 19 మంది బీహార్ రెజిమెంట్ సైనికుల వీరోచిత పోరాటం, త్యాగాన్ని ఈ చిత్రంలో చూపించారు. అయితే ఇటీవలి కాలంలో భారత్-చైనా దౌత్య సంబంధాలలో ఏర్పడిన మార్పులు, రక్షణ మంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం..ఈ చిత్రంలో చైనాను విమర్శించే సన్నివేశాల కంటే ఒక సైనికుడి జీవితం.. అతడి కుటుంబ సంబంధాలు.. మానవీయ కోణాలపై చిత్ర బృందం ఎక్కువ దృష్టి పెట్టింది. ఇందుకోసం దాదాపు 40 రోజుల పాటు ప్రత్యేక రీషూట్లు కూడా నిర్వహించి కథనాన్ని మరింత హృద్యంగా మార్చారు.

మొదట ఏప్రిల్ 2026లో విడుదల కావాల్సిన ఈ చిత్రం కథాంశంలో చేసిన మార్పులు- బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ నుండి `మాతృభూమి`గా టైటిల్ మార్పు వంటి కారణాల‌తో వాయిదా పడింది. ప్రస్తుతం ఈ చిత్రాన్ని స్వాతంత్య్ర‌ దినోత్సవ వారంతంలో థియేటర్లలో విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. వివాదాలకు తావులేకుండా.. కేవలం దేశభక్తిని మానవీయ విలువలను చాటిచెప్పేలా రూపొందించిన ఈ చిత్రం సల్మాన్ ఖాన్ కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలుస్తుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.