Begin typing your search above and press return to search.

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

సల్మాన్ ఖాన్ నటిస్తున్న ‘మాతృభూమి: మే వార్ రెస్ట్ ఇన్ పీస్’ సినిమా నుంచి రచయితలు శివ్ అరూర్, రాహుల్ సింగ్ తప్పుకోవడం చర్చనీయాంశమైంది. భారత ఆర్మీ అనుమతుల విషయంలో అభ్యంతరాలు రావడంతో అసలు కథలో మార్పులు చేసి కల్పిత సన్నివేశాలు, ప్రేమకథను జోడించినట్లు సమాచారం. దీంతో తమ పుస్తకంలోని వాస్తవాలకు సినిమా దూరమైందని రచయితలు తప్పుకున్నట్లు తెలుస్తోంది. నవంబర్ 6న సినిమా ట్రైలర్ విడుదల కానుంది. ఇందులో సల్మాన్ కల్నల్ సంతోష్ బాబు పాత్రలో నటిస్తున్నారు.

By:  Sivaji Kontham   |   6 Nov 2026 9:27 AM IST
స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?
X

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా అపూర్వ లఖియా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక సైనిక చిత్రం `మాతృభూమి: మే వార్ రెస్ట్ ఇన్ పీస్` (గతంలో `బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్`) చుట్టూ ప్రస్తుతం ఆసక్తికర చర్చ నడుస్తోంది. భారత్-చైనా సరిహద్దుల్లో జరిగిన గాల్వాన్ లోయ ఘర్షణ నేపథ్యంతో వచ్చిన `ఇండియాస్ మోస్ట్ ఫియర్‌లెస్ 3` పుస్తకం ఆధారంగా ఈ సినిమా రూపుదిద్దుకుంది. అయితే ఈ పుస్తకాన్ని రచించిన ప్రముఖ రక్షణ రంగ విలేఖరులు, రచయితలు శివ్ అరూర్‌- రాహుల్ సింగ్ ఈ ప్రాజెక్ట్ నుండి తాము అధికారికంగా తప్పుకుంటున్నట్లు నవంబర్ 5న సంయుక్తంగా ప్రకటించడం పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. దీంతో ``స్టార్ హీరో లేదా మేకర్స్ ఏమైనా తప్పు చేస్తున్నారా? అందుకే రచయితలు అలకపాన్పు ఎక్కారా?`` అనే సందేహాలు వ్యక్తమయ్యాయి.

అయితే ఈ సినిమా కథ పూర్తిగా మారిపోవడానికి లేదా ఒరిజినల్ పుస్తకంలో ఉన్న విశ్లేషణలకు దూరంగా జరగడానికి కేవలం స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌నో లేదా చిత్ర బృందాన్నో నిందించడం సరికాదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి చైనా బార్డ‌ర్ లో 2020 గాల్వాన్ వ్యాలీ ఘటనల ఆధారంగా ఉన్నది ఉన్నట్లుగా సినిమా తీయడానికి భారత ఆర్మీ నుండి అనుమతులు (ఎన్‌.వో.సీ) లభించడంలో తీవ్ర అభ్యంతరాలు తలెత్తడమే ప్రధాన కారణమని తెలుస్తోంది. అంతర్జాతీయంగా చైనాతో ఉన్న సున్నితమైన దౌత్య సంబంధాలు, సరిహద్దు శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకూడదనే దూరదృష్టితో ఆర్మీ వర్గాలు కొన్ని కీలకమైన సీన్లకు అనుమతి ఇవ్వడంలో ఇబ్బందులు ఎదుర‌య్యాయి.

ఈ ఆర్మీ అభ్యంతరాల నేపథ్యంలో నిర్మాతలు ఆ కథలోని మూలాలను మార్చక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. పుస్తకంలో శివ్ అరూర్‌, రాహుల్ సింగ్ నమోదు చేసిన చారిత్రక రికార్డులను పక్కనబెట్టి సినిమా టోన్- దిశను మార్చేస్తూ కొత్త కల్పిత స‌న్నివేశాల్ని, అలాగే కమర్షియల్ అంశాలను జోడించాల్సి వచ్చింది. ఇందులోకి ప్రేమ‌క‌థ‌ను కూడా జొప్పించారు. క్రమంగా సినిమా కథ రూపురేఖలు మారిపోవడం.. తమ పరిశోధనాత్మక పుస్తక పరిధిని దాటి వేరే మార్గంలోకి వెళ్లడంతో జర్నలిస్టులుగా తమ ప్రామాణికత దెబ్బతినకుండా ఉండేందుకే శివ్ అరూర్‌, రాహుల్ సింగ్ ఈ నిర్ణయం తీసుకున్నారని భావించవచ్చు. తమ ఆత్మగౌరవానికి భంగం కలగకూడదనే ఉద్దేశంతోనే వారు ప్రాజెక్ట్ నుండి గౌరవప్రదంగా పక్కకు తప్పుకున్నారు.

సినిమా కథ అనుకున్న రీతిలో సాగకపోయినా.. సల్మాన్ ఖాన్ గానీ లేదా రచయితలు గానీ ఎలాంటి వ్యక్తిగత విభేదాలకు తావివ్వకపోవడం విశేషం. సల్మాన్ ఖాన్, అపూర్వ లఖియా.. మొత్తం చిత్ర బృందం తమకు ఇచ్చిన గౌరవానికి ధన్యవాదాలు తెలుపుతూ... ఈ సినిమా అద్భుత‌ విజయం సాధించాలని రచయితలు శుభాకాంక్షలు తెలిపారు. చైనా ఘర్షణలో వీరమరణం పొందిన తెలంగాణ వీరుడు కల్నల్ బికుమళ్ల సంతోష్ బాబు పాత్రను సల్మాన్ ఖాన్ పోషిస్తుండగా చిత్రాంగద సింగ్ ఇతర ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.

ప్రస్తుతం ఈ చిత్రం 4 నిమిషాల 43 సెకన్ల ట్రైలర్‌కు సెన్సార్ బోర్డు (సీబీఎఫ్‌సీ) యుఏ 16+ సర్టిఫికేట్‌ను మంజూరు చేసింది. ఈరోజు (నవంబర్ 6న) ట్రైలర్ విడుదలవుతుండగా... నవంబర్ 20 లేదా డిసెంబర్ నెలాఖరులో థియేట్రికల్ రిలీజ్‌కు సన్నాహాలు చేస్తున్నారు. నిజ జీవిత సైనిక పోరాటాల ఆధారంగా తీసే సినిమాల్లో రక్షణ రంగ అనుమతులు.. సెన్సార్ నిబంధనలు.. సినిమాటిక్ కమర్షియల్ హంగుల మధ్య బ్యాలెన్స్ చేయడం మేకర్స్‌కు ఎంత పెద్ద సవాలో `మాతృభూమి` వివాదం మరొకసారి స్పష్టం చేసింది. `బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్` అనే అస‌లు టైటిల్ ని తొల‌గించ‌డంతోనే ఈ సినిమా విష‌యంలో ఏదో జ‌రుగుతోంద‌ని అంద‌రికీ అర్థ‌మైంది. అయితే క‌ల్పిత క‌థ‌ను థియేట‌ర్ల‌లో వీక్షించేందుకు ప్ర‌జ‌లు ఆస‌క్తిగా ఉన్నారా? అన్న‌ది రానున్న‌ ఫ‌లిత‌మే క్లియ‌ర్ క‌ట్ గా తేల్చి చెబుతుంది.