Begin typing your search above and press return to search.

ల‌క్ష్యం 1000 కోట్లు అంత‌కుమించి.. క‌ర్ణుడిగా న‌టిస్తున్న స‌ల్మాన్ టార్గెట్ ఇదేనా?

భారతీయ సినీ పరిశ్రమలో బాక్సాఫీస్ రికార్డుల వేట ఇప్పుడు రూ. 1000 కోట్లను దాటి వేల‌ కోట్ల దిశగా పరుగులు తీస్తోంది.

By:  Sivaji Kontham   |   30 Aug 2026 8:00 AM IST
ల‌క్ష్యం 1000 కోట్లు అంత‌కుమించి.. క‌ర్ణుడిగా న‌టిస్తున్న స‌ల్మాన్ టార్గెట్ ఇదేనా?
X

భారతీయ సినీ పరిశ్రమలో బాక్సాఫీస్ రికార్డుల వేట ఇప్పుడు రూ. 1000 కోట్లను దాటి వేల‌ కోట్ల దిశగా పరుగులు తీస్తోంది. ఒకప్పుడు ప్రభాస్, రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన `బాహుబలి 2` నెలకొల్పిన రికార్డులను అందుకోవడానికి ఖాన్ ల‌ త్రయం నుండి నేటి తరం స్టార్ల వరకు అందరూ తపిస్తున్నారు. ఇటీవలే `యానిమల్`తో అలరించిన రణ్‌బీర్ కపూర్ `రామాయణం` ఫ్రాంచైజీతో వేల కోట్ల క్ల‌బ్‌లో అడుగుపెట్టాల‌ని క‌సిగా ప్ర‌య‌త్నిస్తున్నాడు. అంత‌కుముందే `దురందర్` ఫ్రాంఛైజీతో రణ్‌వీర్ సింగ్ 3000 కోట్ల వ‌సూళ్ల క్ల‌బ్‌లో నిల‌బ‌డి రేసులో ముందంజలో ఉన్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ సుల్తాన్ సల్మాన్ ఖాన్ కూడా భారీ టార్గెట్‌తో ఈ పాన్-ఇండియా రేసులోకి దిగుతున్నారు.

సల్మాన్ ఖాన్ తన కెరీర్‌లోనే అత్యంత భారీ చిత్రంగా భావిస్తున్న `కర్ణ` ప్రాజెక్ట్ ద్వారా బాక్సాఫీస్ వద్ద రూ. 1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. మహాభారతంలో అత్యంత సంక్లిష్టమైన, శక్తివంతమైన పాత్ర అయిన కర్ణుడి కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్క‌నుంది. రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా దర్శకత్వంలో ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా అత్యంత ప్రతిష్టాత్మకంగా.. ఊహించని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ప్రభాస్ `బాహుబలి`, రణ్‌బీర్ `రామాయణం` సినిమాలకు ఏమాత్రం తగ్గకుండా దీనిని విజువల్ వండర్‌గా తీర్చిదిద్దేందుకు ప్లాన్ చేస్తున్నారు.

గత ఐదేళ్లుగా ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ రెండు భాగాల మైథలాజికల్ ఎపిక్ 2027 ఆగస్టు నాటికి సెట్స్ పైకి వెళ్లేందుకు సిద్ధమవుతోంది. అయితే ఈ ఐదేళ్ల సుదీర్ఘ ప్రయాణంలో పూర్తిగా నిమగ్నమవ్వడానికి ముందు దర్శకుడు రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా ఒక ఆసక్తికరమైన ప్లాన్ చేశారు. `కర్ణ` షూటింగ్ ప్రారంభమయ్యేలోపే యువ నటుడు విక్రాంత్ మాస్సేతో కలిసి ఒక చిన్న పట్టణం నేపథ్యంలో సాగే రొమాంటిక్ లవ్ స్టోరీని తెరకెక్కించనున్నారు.

విక్రాంత్ మాస్సేతో చేసే ఈ లవ్ స్టోరీ షూటింగ్‌ను కేవలం 30 రోజుల్లోనే వేగంగా పూర్తి చేయాలని దర్శకుడు భావిస్తున్నారు. ఈ చిన్న సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో కూడా `కర్ణ` ప్రీ-ప్రొడక్షన్ పనులు ఎక్కడా ఆగకుండా ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ సాంకేతిక బృందం నిరంతరం కొనసాగిస్తుండటం విశేషం. ఒక భారీ ప్రాజెక్ట్‌కి ముందు మైండ్ రిఫ్రెష్‌మెంట్ కోసం దర్శకుడు ఈ క్విక్ ప్రాజెక్ట్‌ను ఎంచుకున్నారు.

అయితే ప్ర‌జ‌ల దృష్టి స‌ల్మాన్ న‌టించ‌నున్న భారీ పాన్ ఇండియా సినిమా క‌ర్ణ పైనే. దీనిగురించే ఇటీవ‌ల మీడియాలోను డిబేట్లు ఉత్కంఠ పెంచుతున్నాయి. సల్మాన్ ఖాన్ - రాకేష్ ఓంప్రకాష్ మెహ్రాల కాంబినేషన్‌లో తెర‌కెక్క‌నున్న ఈ `కర్ణ` చిత్రంపై ఇప్పటికే సినీ వర్గాల్లోనూ, ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. పౌరాణిక అంశాలకు ఆధునిక సాంకేతికతను జోడించి తెరకెక్కించ‌నున్న‌ ఈ చిత్రం బ‌డ్జెట్ కార‌ణాల‌తో చాలా కాలంగా వెయిటింగ్ లో ఉంది. ఎట్ట‌కేల‌కు ఈ సినిమాని ప‌ట్టాలెక్కించాల‌ని స‌ల్మాన్- రాకేష్ బృందం క‌సిగా ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ర‌ణ‌బీర్ రామాయ‌ణంతో దూసుకెళుతున్న ఈ స‌మ‌యంలో స‌ల్మాన్ కూడా రేసులోకి రావ‌డం ఆస‌క్తిని క‌లిగిస్తోంది. అంతా ఆశించిన ప్ర‌కారం ముందుకు సాగితే.. సల్మాన్ ఖాన్ కూడా పాన్-ఇండియా రేసులో సరికొత్త రికార్డులను తిరగ రాస్తాడ‌నే అభిమానులు భావిస్తున్నారు. కొన్నిటికి కాల‌మే స‌మాధానం. ఏం జ‌రుగుతుందో వేచి చూడాలి.