తాజ్ హోటల్‌లో డ్యాన్స్ చేసి అందుకున్న రూ.75!
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ పారితోషికం ఇప్పుడు ఏ రేంజ్ లో అందుకుంటున్నారో? చెప్పాల్సిన పనిలేదు.
By: Srikanth Kontham | 26 Aug 2026 3:00 PM ISTబాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ పారితోషికం ఇప్పుడు ఏ రేంజ్ లో అందుకుంటున్నారో? చెప్పాల్సిన పనిలేదు. కోట్లాది మంది అభిమానులు అలరించే స్టార్ పారితోషికంతో పాటు లాభాల్లో వాటా సైతం అందుకుంటారు. ఆ వాటా కోట్లలో ఉంటుంది. ఇదంతా ఇప్పుడు మరి ఒకప్పుడు సల్మాన్ ఏంటి? అంటే నట వారసత్వం ఉన్నా? అతడి జీవితం చాలా సాధారణంగానే ప్రారంభమైంది. సల్మాన్ సినీ జీవితం ప్రారంభం కాకముందు తొలి సంపాదన కింద కేవలం 75 రూపాయలు మాత్రమే సంపాదించారు. ఈ ఆసక్తికరమైన విషయాన్ని స్వయంగా సల్మాన్ ఖాన్ ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు.
1980వ దశకంలో అంటే బాలీవుడ్‌లో హీరోగా అడుగుపెట్టడానికి చాలా కాలం ముందే సల్మాన్ ఖాన్ ఆర్టిస్ట్‌గా చిన్నచిన్న ప్రదర్శనలు ఇచ్చేవారు. ముంబైలోని ప్రసిద్ధ తాజ్ హోటల్లో జరిగిన ఈవెంట్‌లో ఆయన బ్యాక్‌గ్రౌండ్ డ్యాన్సర్‌గా పాల్గొన్నారు. ప్రధాన నటుల వెనుక నిలబడి డ్యాన్స్ చేసినందుకు ఆ రోజు నిర్వాహకులు సల్మాన్ కు తొలి వేతనం కింద సరిగ్గా 75 రూపాయలను చెల్లించారట. అప్పట్లో ఆ చిన్న మొత్తమే తనకు ఎంతో పెద్ద సంపాదనగా అనిపించిందని సల్మాన్ సంతోషంగా గుర్తు చేసుకున్నారు. జీవితంలో ఏదీ సులభంగా రాదని, ప్రతి ఒక్కరూ కింది స్థాయి నుంచే కష్టపడి పైకి రావాలనేదానికి తన తొలి జీతమే చక్కని ఉదాహరణ అని పేర్కొన్నారు.
ఆ చిన్న సంతోషమే తనలో మరింత కష్టపడే తత్వాన్ని పెంచిందని తెలిపారు. సినిమా బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా? కెరీర్ ఆరంభంలో సల్మాన్ ఖాన్ కూడా ఎన్నో చిన్నచిన్న పనులను, స్ట్రగుల్స్‌ను ఎదుర్కొన్నారు. బ్యాక్‌గ్రౌండ్ డ్యాన్సర్‌గా కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసారు. చివరకు `మైనే ప్యార్ కియా` సినిమాతో హీరోగా టర్న్ తీసుకుని ఓవర్ నైట్ స్టార్‌గా ఎదిగారు. సల్మాన్ ఖాన్ పడిన ఆ కష్టాలే నేడు ఆయన్ని ఈ స్థాయికి చేర్చాయి.
ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కోట్ల రూపాయల కలెక్షన్లు రాబట్టే సల్మాన్ ఖాన్ గతాన్ని ఎప్పుడూ మరువలేదని చెప్పడానికి ఈ చిన్న ఉదంతమే నిదర్శనం. స్టార్ హీరో స్థాయికి చేరిన తర్వాత కూడా తొలి జీతానికి సంబంధించిన జ్ఞాపకాలను ఆయన ఎంతో సరదాగా.. గర్వంగా పంచుకోవడం ఆయన గొప్ప మనసుకు నిదర్శనంగా నిలుస్తోంది. ఈ తొలి సంపాదన జ్ఞాపకం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 75 రూపాయల నుంచి మొదలైన సల్మాన్ ప్రయాణం నేడు గ్లోబల్ స్టార్ స్థాయికి చేరడం యువ తరానికి ఎంతో స్ఫూర్తిదాయకం.
