సల్మాన్, దిల్ రాజు మూవీ టైటిల్ ఇదేనా?
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ మధ్య కాలంలో తెలుగులో స్టార్ హీరోలతో సినిమాలు ఎక్కువ తీయడం లేదనే విమర్శలు వస్తున్న విషయం తెల్సిందే.
By: Ramesh Palla | 21 Aug 2026 1:00 AM ISTటాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ మధ్య కాలంలో తెలుగులో స్టార్ హీరోలతో సినిమాలు ఎక్కువ తీయడం లేదనే విమర్శలు వస్తున్న విషయం తెల్సిందే. ఈ ఏడాది టాలీవుడ్‌లో దిల్ రాజు నిర్మించిన పెద్ద సినిమాలు, పెద్ద హీరోల సినిమాలు లేకపోవడం కాస్త అసంతృప్తిగా ఉందని ఆయన్ను అభిమానించే వారు, ఆయన సినిమాలను కోరుకునే వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. దిల్ రాజు టాలీవుడ్ స్టార్ హీరోలతో సినిమాలు చేయకున్నా బాలీవుడ్ బిగ్ స్టార్, సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్‌తో ప్రస్తుతం ఒక సినిమాను నిర్మిస్తున్న విషయం తెల్సిందే. కొన్ని రోజులుగా ఆ సినిమా గురించి ఎలాంటి అప్‌డేట్ లేదు. ఎట్టకేలకు బాలీవుడ్ వర్గాల నుంచి సినిమా గురించి కీలక విషయం ఒకటి బయటకు వచ్చింది. సల్మాన్ ఖాన్, దిల్ రాజు మూవీ టైటిల్ గురించి ఫిల్మింఫేర్ ఒక కథనంను ప్రచురించడంతో మరోసారి సినిమా గురించి బాలీవుడ్‌తో పాటు కోలీవుడ్ వర్గాల్లోనూ చర్చ మొదలైంది.
సల్మాన్ ఖాన్ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో...
ఆ కథనంలో సల్మాన్ ఖాన్ హీరోగా నయనతార హీరోయిన్‌గా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీకి 'మాన్‌స్టర్' అనే టైటిల్‌ను పెట్టారని పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా నాన్ స్టాప్‌గా షూటింగ్ జరుగుతోంది. యాక్షన్ సీన్స్ కోసం వినియోగించే సల్మాన్ ఖాన్ బాడీ డబుల్‌కి హార్ట్ ఎటాక్ రావడంతో షూటింగ్ కాస్త మెల్లగా సాగుతుందని సైతం కథనం లో పేర్కొనడం జరిగింది. సల్మాన్ ఖాన్ బాడీ డబుల్‌కి గుండె పోటు రావడంతో యాక్షన్ సన్నివేశాలను స్వయంగా సల్లూ భాయ్ చేయాల్సి వస్తుందని, అందుకోసం బాగా వర్కౌట్స్ చేసి, ప్రాక్టీస్ చేసిన తర్వాత షాట్ లోకి వెళ్తున్నారని, అందుకే కాస్త ఎక్కువ సమయం తీసుకుంటుందని అంటున్నారు. ముందుగా అనుకున్న ప్రకారం ఈ ఏడాది అక్టోబర్‌లోనే సినిమా షూటింగ్ పూర్తి చేయాల్సి ఉన్నా, కనీసం 45 రోజులు అదనంగా షూటింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి.
నయరతార హీరోయిన్‌గా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో...
సౌత్ సూపర్ స్టార్ హీరోయిన్ నయనతార ఈ సినిమాలో సల్మాన్ ఖాన్‌కి జోడీగా నటిస్తున్న నేపథ్యంలో తమిళ్‌తో పాటు, తెలుగు ప్రేక్షకుల్లోనూ అంచనాలు భారీగా ఉన్నాయి. సల్మాన్ ఖాన్‌తో దిల్ రాజు మొదటి సినిమా ఇదే కావడం విశేషం. అంతే కాకుండా సల్మాన్ ఖాన్ మొదటి సారి ఒక తెలుగు నిర్మాత నిర్మాణంలో, తెలుగు దర్శకుడి దర్శకత్వంలో నటిస్తున్నాడు. అంతే కాకుండా నయనతారతోనూ సల్మాన్ ఖాన్ మొదటి సారి నటిస్తున్నాడు. అందుకే ఈ సినిమా పై సౌత్ ఆడియన్స్‌లో ప్రత్యేకమైన ఆసక్తి ఉంది. దిల్ రాజు ఈ సినిమా కోసం భారీ మొత్తంలో ఖర్చు చేస్తున్నాడని సమాచారం. అయితే సల్మాన్ ఖాన్‌కు పారితోషికం రూ.120 కోట్లు కాగా, వంశీ పైడిపల్లి తెచ్చిన సబ్జెక్ట్ నచ్చడంతో దిల్ రాజు విజ్ఞప్తి మేరకు ఏకంగా రూ.50 కోట్లు తగ్గించుకుని రూ.70 కోట్లకు ఒప్పుకున్నాడని తెలుస్తోంది. సినిమా హిట్ అయితే ఆ రూ.50 కోట్లను లాభాల నుంచి సల్మాన్ ఖాన్ తీసుకునేలా ఒప్పందం జరిగిందట.
సల్మాన్ ఖాన్, దిల్ రాజు మూవీ టైటిల్ 'మాన్‌స్టర్'...
దిల్ రాజు ఇటీవల ఒక చిట్ చాట్‌లో సల్మాన్ ఖాన్‌తో తాము నిర్మిస్తున్న సినిమా రషెష్ చూసుకున్నాం. చాలా బాగా వస్తుందని చెప్పడం తో అంచనాలు పెరిగాయి. ఇప్పుడు సల్మాన్ ఖాన్ ఇమేజ్‌ని మ్యాచ్ చేసే విధంగా టైటిల్‌గా 'మాన్‌స్టర్' అంటూ ఖరారు చేశారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో సల్మాన్ ఖాన్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సల్మాన్ బిగ్ కమర్షియల్ హిట్ దక్కించుకుని ఏళ్ళు గడుస్తోంది. ఈ సినిమాతో ఫ్యాన్స్ ఎదురు చూపులకు తెర పడి సల్మాన్ కమర్షియల్ బ్లాక్ బస్టర్ దక్కించుకుంటాడా అనేది చూడాలి. వంశీ పైడిపల్లి చేస్తున్న సినిమాలు తక్కువే అయినా ప్రతి సినిమా మినిమం గ్యారెంటీ అన్నట్లుగా ఆడుతోంది. అందుకే సల్మాన్ మాన్‌స్టర్ సైతం భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుంది అనే నమ్మకం ప్రతి ఒక్కరిలోనూ ఉంది. దిల్ రాజు బాలీవుడ్‌లో హిట్ కొట్టేనా అనేది 2027 ఈద్ పండుగకు విడుదలైన తర్వాత క్లారిటీ వచ్చేను.
