కృష్ణ జింకల వేట కేసుపై మూవీ.. కంగారు పడుతున్న నటుడు.. అసలేమైంది?
ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్‌ను జూన్ 12న విడుదల చేసిన తర్వాత అసలు వివాదం మొదలైంది.
By: Sivaji Kontham | 15 Jun 2026 6:00 AM ISTబాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ 1998లో రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ సమీపంలో `హమ్ సాత్ సాత్ హైన్` షూటింగ్ సమయంలో రెండు కృష్ణజింకలను (బ్లాక్ బక్స్) వేటాడారనే ఆరోపణలు అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై బిష్ణోయ్ కమ్యూనిటీ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో సుదీర్ఘ కాలం చట్టపరమైన పోరాటం నడిచింది. ఇప్పుడు దాదాపు మూడు దశాబ్దాల క్రితం నాటి ఈ వివాదాస్పద ఉదంతాన్ని ఆధారంగా చేసుకుని నిర్మాత అమిత్ జాని `కాలా హిరణ్` అనే సినిమాను తెరకెక్కించారనే ప్రచారం సాగుతోంది. అయితే ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్ర పోషించిన సీనియర్ నటుడు గోవింద్ నామ్‌దేవ్ ఈ ప్రాజెక్ట్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా అసలు కథేంటో తనకు చెప్పకుండా తనను చీకట్లో ఉంచి మోసం చేశారని ఆయన మండిపడ్డారు.
ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్‌ను జూన్ 12న విడుదల చేసిన తర్వాత అసలు వివాదం మొదలైంది. ఈ వీడియోను `గురు జంబేశ్వర్ భగవాన్ - బిష్ణోయ్ కమ్యూనిటీకి అంకితం` అనే సందేశంతో మేకర్స్ షేర్ చేయడంతో అసలు విషయం బయటపడింది. ఈ టీజర్‌లో నటుడు కాషిఫ్ ఇక్బాల్ ఖాన్ పోషించిన పాత్ర.. నల్లటి టీ-షర్ట్, చేతికి బ్రాస్లెట్‌తో సల్మాన్ ఖాన్‌ను పోలి ఉండటం గమనార్హం. ఆ పాత్రను నెగెటివ్ షేడ్స్‌లో చూపించగా.. బిష్ణోయ్ కమ్యూనిటీ తరపున న్యాయం కోసం పోరాడే న్యాయవాదిగా గోవింద్ నామ్‌దేవ్ కనిపించారు. అయితే ఈ టీజర్ చూసిన తర్వాత గోవింద్ నామ్‌దేవ్ ఈ సినిమా నుండి తాను పూర్తిగా తప్పుకుంటున్నట్లు ప్రకటించి సల్మాన్‌ను టార్గెట్ చేసే ఇలాంటి ప్రాజెక్ట్‌లో తాను భాగం కాలేనని స్పష్టం చేశారు.
ఈ వివాదంపై గోవింద్ నామ్‌దేవ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ``నేను షూటింగ్ చేసిన సినిమాకు.. ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రానికి అసలు సంబంధమే లేదు. ట్రైలర్ చూడగానే నేను ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాను. సల్మాన్ ఖాన్‌ను పోలిన ఒక క్యారెక్టర్‌ను సృష్టించి.. అతడిని ఈ విధంగా నెగెటివ్‌గా చూపిస్తారని మాకు షూటింగ్ సమయంలో ఎప్పుడూ చెప్పలేదు. ఈ ట్రైలర్ చూశాక నన్ను పూర్తిగా చీకట్లో ఉంచి వాడుకున్నారని అర్థమైంది. నాకు చెప్పిన కథకు, వారు తీసిన సినిమాకు ఆకాశానికి, భూమికి ఉన్నంత తేడా ఉంది`` అని ఆవేదన వ్యక్తం చేశారు.
తనకు ఈ ప్రాజెక్ట్‌ను పరిచయం చేసినప్పుడు వేరే పేరు చెప్పారని నామ్‌దేవ్ వెల్లడించారు. మొదట ఈ సినిమా పేరు `సంభల్` అని చెప్పారని, కథ ఇలాంటి మలుపు తిరుగుతుందని తనకు అస్సలు ఊహించలేదన్నారు. తనకు కేవలం కోర్టు రూమ్ సీన్లు మాత్రమే ఉన్నాయని.. ఇప్పటికే పబ్లిక్ రికార్డుల్లో ఉన్న చట్టపరమైన వాదనలను మాత్రమే కోర్టులో ప్రెజెంట్ చేస్తున్నామని మేకర్స్ నమ్మించారని ఆయన పేర్కొన్నారు. కేవలం వాస్తవాలను మాత్రమే చూపిస్తున్నారనే ఉద్దేశంతోనే తాను నటించడానికి అంగీకరించానని చెప్పారు. అలాగే ఈ వివాదంతో ముడిపడి ఉన్న ఎలాంటి గ్యాంగ్ కల్చర్‌కు లేదా బిష్ణోయ్ గ్యాంగ్‌కు తాను మద్దతు ఇవ్వడం లేదని ఆయన స్పష్టం చేశారు.
మరోవైపు ఈ సినిమాపై సల్మాన్ ఖాన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. `కాలా హిరణ్` సినిమా తనపై వచ్చిన ఆరోపణల ఆధారంగా తెరకెక్కిందని.. ఇది తన పర్సనాలిటీ రైట్స్‌ను (వ్యక్తిగత హక్కులను) ఉల్లంఘించడమేనని పేర్కొంటూ.. సినిమా విడుదలపై స్టే విధించాలని సల్మాన్ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై జూన్ 19న న్యాయస్థానంలో విచారణ జరగనుంది. మొత్తానికి సల్మాన్ ఖాన్‌కు వ్యతిరేకంగా తీసిన ఈ చిత్రం బాలీవుడ్ వర్గాల్లో పెద్ద దుమారమే రేపుతోంది. సల్మాన్ నల్ల జింకల వేట కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది గనుక ఇలాంటి సున్నిత అంశంతో సినిమా తీస్తే అది పాన్ ఇండియాలో బంపర్ హిట్ కొట్టడానికి అర్హత కలిగి ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
