సల్మాన్ ఖాన్ వార్నింగ్ తర్వాత మారిన రూట్!
సెలబ్రిటీల రూపాన్ని, బరువును ఉద్దేశించి హేళన చేసేవారికి సల్మాన్ కౌంటర్ ఇవ్వడంతో పాకిస్తానీ ఆర్‌జే తప్పును తెలుసుకుని క్షమాపణలు కోరారు.
By: Srikanth Kontham | 21 Sept 2026 3:21 PM ISTబాలీవుడ్ నటి కత్రినా కైఫ్‌ను ఉద్దేశించి బాడీ షేమింగ్ కామెంట్లు చేసిన ఓ పాకిస్తానీ రేడియో జాకీ (ఆర్‌జే) తాజాగా బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. రియాలిటీ షో బిగ్ బాస్ 20 వేదికగా బాడీ షేమింగ్ చేసే ట్రోలర్లపై సల్మాన్ ఖాన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. సెలబ్రిటీల రూపాన్ని, బరువును ఉద్దేశించి హేళన చేసేవారికి సల్మాన్ కౌంటర్ ఇవ్వడంతో పాకిస్తానీ ఆర్‌జే తప్పును తెలుసుకుని క్షమాపణలు కోరారు.
ఇటీవల అంబానీ ఇంట్లో జరిగిన గణేష్ చతుర్థి వేడుకల్లో కత్రినా కైఫ్ పాల్గొన్న సమయంలో ఆమె రూపం .. బరువుపై సోషల్ మీడియాలో తీవ్రమైన ట్రోలింగ్ జరిగింది. తల్లైనా తర్వాత కత్రినా రూపంలో వచ్చిన మార్పులను ఉద్దేశించి సదరు పాకిస్తానీ ఆర్‌జే కామెంట్లు చేశారు. ఓ మహిళా నటిపై ఈ రకమైన బాడీ షేమింగ్ కామెంట్లు చేయడం పై నెట్టింట చర్చనీయాంశంగా మారింది. కత్రినా అభిమానుల నుంచి ఆగ్రహం వ్యక్తమైంది.
ఈ వివాదంపై బిగ్ బాస్ 20 వీకెండ్ కా వార్ ఎపిసోడ్‌లో సల్మాన్ ఖాన్ తీవ్రంగా స్పందించారు. వేదికపై తన షర్టు తొలగించి.. తన శరీరకృతిని చూపిస్తూ ట్రోలర్లకు సవాల్ విసిరారు. ఇతరుల ముఖాలు, శరీరాలపై హేళనగా కామెంట్లు చేసే ముందు ప్రతి ఒక్కరూ అద్దంలో తమను తాము చూసుకోవాలని, తమ కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితిని గమనించాలని హితవు పలికారు. బరువు పెరగడం లేదా తగ్గడం సాధారణ విషయమని, కానీ దానిని పట్టుకుని హేళన చేయడం సహించరానిదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సల్మాన్ ఖాన్ ఆవేశపూరిత ప్రసంగం ..ఇచ్చిన వార్నింగ్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నెటిజన్ల నుంచి సినీ వర్గాల నుంచి ఆయన వ్యాఖ్యలకు భారీగా మద్దతు లభించింది. సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై రూపాలపై అనుచిత కామెంట్లు చేసే సంస్కృతికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు బలంగా వినిపించాయి.
సల్మాన్ ఖాన్ సీరియస్ అవ్వడంతో పాకిస్తానీ ఆర్‌జే ఎట్టకేలకు దిగివచ్చారు. తాను చేసిన వ్యాఖ్యలు తప్పని, ఒకరి రూపాన్ని హేళన చేయడం సరైన పద్ధతి కాదని అంగీకరిస్తూ సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు తెలియజేశారు. తన ఉద్దేశం ఎవరినీ బాధించడం కాదని.. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు పునరావృత్తం కాకుండా చూసు కుంటానని పేర్కొన్నారు. ఈ సంఘటన బాడీ షేమింగ్ సంస్కృతిపై మరోసారి తీవ్రమైన చర్చకు దారితీసింది.
పరిశ్రమలో అగ్ర కథానాయకుడిగా ఉన్న సల్మాన్ ఖాన్ బహిరంగంగా నిలదీయడం వల్ల విదేశీ ఆర్‌జే కూడా తప్పును ఒప్పుకోవాల్సి వచ్చింది. నెటిజన్లు సెలబ్రిటీలను ఉద్దేశించి కామెంట్లు చేసే ముందు బాధ్యతాయుతంగా, పరిణతితో వ్యవహరించాల్సిన అవసరం ఉందనే విషయాన్ని ఈ ఘటన స్పష్టం చేస్తోంది.
