బ్యాటిల్ ఆఫ్ గల్వాన్: రక్షణ మంత్రికి సల్మాన్ ఏం చెప్పి ఒప్పించాడు?
దర్శకుడు అపూర్వ లఖియా రూపొందించనున్న ఈ సినిమా కథాంశం ఇండియా- చైనా బార్డర్ లోని గల్వాన్ లోయ వార్ నేపథ్యంలో రూపొందనుండడంతో ఇది ప్రజల్ని ఎంతో ఎగ్జయిట్ చేస్తుందని అంతా భావిస్తున్నారు.
By: Sivaji Kontham | 11 Sept 2025 12:04 PM IST`సికందర్` లాంటి డిజాస్టర్ తర్వాత ఎట్టి పరిస్థితుల్లో బ్లాక్ బస్టర్ కొట్టాలనే పంతంతో ఉన్నాడు సల్మాన్ ఖాన్. కంబ్యాక్ కోసం సరైన దేశభక్తి, వీరత్వానికి సంబంధించిన స్క్రిప్టును ఎంపిక చేసుకుని తదుపరి చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు సిద్ధమయ్యాడు. దర్శకుడు అపూర్వ లఖియా రూపొందించనున్న ఈ సినిమా కథాంశం ఇండియా- చైనా బార్డర్ లోని గల్వాన్ లోయ వార్ నేపథ్యంలో రూపొందనుండడంతో ఇది ప్రజల్ని ఎంతో ఎగ్జయిట్ చేస్తుందని అంతా భావిస్తున్నారు. ఒక రియలిస్టిక్ కథలో సల్మాన్ తనను తాను దేశభక్తుడిగా, వీరుడిగా ఆవిష్కరించుకునేందుకు ఎక్కువ స్కోప్ ఉంది.
కానీ ఇంతలోనే ఊహించని పరిణామాలతో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లదు! అని ప్రచారం సాగింది. వివాదాస్పద క్రిటిక్ కమల్ ఆర్.ఖాన్ ప్రకారం.. భారతదేశంతో చైనా సంబంధాలు మెరుగవుతున్న ప్రస్తుత పరిణామాల క్రమంలో ఈ సినిమా చిత్రీకరణకు వెళ్లడం కుదరదు. చైనాకు వ్యతిరేకంగా ఈ సినిమాలో ఏదీ చూపించడానికి లేదని రక్షణ శాఖ మంత్రి స్పష్ఠం చేసినట్టు కూడా కథనాలొచ్చాయి. చైనాతో సంబంధాలను దెబ్బ తీసే విధంగా సినిమాలు తీయడానికి వీల్లేదని ప్రభుత్వం నిర్ణయించినట్టు కమల్ ఆర్. ఖాన్ వెల్లడించారు.
అయితే మారిన పరిస్థితుల నేపథ్యంలో సల్మాన్ ఖాన్ నేరుగా మంత్రి రాజ్ నాథ్ సింగ్ ని కలిసి మాట్లాడారు. లఢఖ్‌లో షూటింగుకు ఎలాంటి అంతరాయాలు కలగకుండా చూడాలని రాజ్ నాథ్ ని సల్మాన్ అభ్యర్థించారు. అయితే చైనాను కించపరిచేలా సినిమాలో కంటెంట్ ఉండకూడదని రాజ్ నాథ్ సల్మాన్ కి సూచించినట్టు తెలిసింది. దానికి సల్మాన్ కట్టుబడి ఉన్నారు. ఇరువైపులా ఒక అండర్ స్టాండింగ్ కుదిరింది. ఈ సినిమా కథాంశం చైనాకు వ్యతిరేకంగా ఉండదని సల్మాన్ హామీ ఇచ్చాక, రాజ్ నాథ్ కూడా తమవంతు సహకారం అందిస్తామని తెలిపారట. భారత సైన్యం ధైర్యసాహసాల నేపథ్యంలో దేశభక్తి ప్రధాన చిత్రమిదని రాజ్ నాథ్ కి ఖాన్ చెప్పారు. సైనికులు గర్వపడేలా, వారిని గౌరవించే కథతో సినిమా తీస్తున్నామని సల్మాన్ వివరించారు. దీనికి అంతిమంగా మంత్రివర్యులు ఆమోదం తెలిపారు.
ప్రభుత్వం, రక్షణ శాఖ నుంచి క్లియరెన్స్ రావడంతో ఇప్పుడు బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ షూటింగును వేగంగా పూర్తి చేసేందుకు దర్శకుడు అపూర్వ లఖియా ప్రయత్నిస్తున్నారని సమాచారం. షూటింగ్ అనుకున్న దానికంటే త్వరగా పూర్తి చేయాలని, 2026 ముగింపులో విడుదలయ్యేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. సుల్తాన్, భజరంగి భాయిజాన్ తరహాలో ఒక భారీ హిట్టు కొట్టాలని సల్మాన్ ఖాన్ దాహంతో ఉన్నాడు. దానిని బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ తీరుస్తుందనే ఆశిద్దాం.
