Begin typing your search above and press return to search.

స‌ల్మాన్ వార్ సినిమాపై విషం చిమ్మిన చైనా ప‌త్రిక‌

ఇటీవ‌ల విడుద‌లైన టీజ‌ర్ పై చైనా ప్రభుత్వానికి అనుబంధంగా ఉన్న `గ్లోబల్ టైమ్స్` పత్రిక అస‌హ‌నాన్ని వ్య‌క్తం చేసింది.

By:  Sivaji Kontham   |   31 Dec 2025 7:34 PM IST
స‌ల్మాన్ వార్ సినిమాపై విషం చిమ్మిన చైనా ప‌త్రిక‌
X

సల్మాన్ ఖాన్ 60వ పుట్టినరోజు సందర్భంగా `బ్యాటిల్ ఆఫ్ గల్వాన్` టీజర్ విడుదలైన సంగ‌తి తెలిసిందే. వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌.వో.సి) వెంబడి భారత, చైనా దళాల మధ్య జూన్ 2020లో జరిగిన భయంకరమైన బాహాబాహీ పోరాటాన్ని మ‌న ఫిలింమేక‌ర్స్ వెండితెర‌కెక్కిస్తున్నారు. అపూర్వ ల‌ఖియా ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. ఈ చిత్రం ఇటీవల కాలంలో భారత్-చైనా స‌రిహ‌ద్దు వెంబ‌డి జరిగిన అత్యంత తీవ్రమైన ఘర్షణలలో ఒకదానిని డ్ర‌మ‌టిగ్గా తెర‌పైకి తెస్తున్నారు.

ఇటీవ‌ల విడుద‌లైన టీజ‌ర్ పై చైనా ప్రభుత్వానికి అనుబంధంగా ఉన్న `గ్లోబల్ టైమ్స్` పత్రిక అస‌హ‌నాన్ని వ్య‌క్తం చేసింది. ''బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ - చ‌రిత్రను తిరగరాయలేదు'' అంటూ ఒక క‌థ‌నాన్ని ప్ర‌చురించింది. జ‌రిగిన వాస్త‌వ‌ సంఘటనలను ఏకపక్ష వెర్షన్‌ను సినిమాలో చూపిస్తున్నార‌ని ఆరోపించింది. చైనా ప‌త్రిక త‌న క‌థ‌నంలో.. బ్యాటిల్ ఆఫ్ గ‌ల్వాన్ టీజర్‌లోని వాస్తవ లోపాలను కూడా ఎత్తి చూపింది. భారత సైన్యం చేసిన త్యాగాల‌ను అతిశ‌యోక్తిగా చూపిస్తున్నార‌ని కొట్టిపారేసింది.

ఈ విమర్శలకు స్పందిస్తూ.. చిత్ర‌నిర్మాత‌ మీడియాతో ముచ్చ‌టించారు. చైనా స్పందన ఆశ్చర్యకరమైనది కాదని, అలాగే భారతదేశంలో లేదా అంతర్జాతీయంగా సినిమా భవిష్యత్తుపై దాని ప్రభావం ఉండదని అన్నారు. ఒక భారతీయ ద‌ర్శ‌క‌నిర్మాత సినిమా తీసినప్పుడు మన శత్రు దేశం కార్యకలాపాలను బహిర్గతం చేయ‌డం స‌హ‌జం. మనం ఒక దేశంగా బలంగా ఉన్నాము.. మన భద్రతా దళాలు దేశం కోసం పోరాడటానికి నిజంగా ధైర్యంగా ముందుకెళ్లారు. కాబట్టి చైనా గ్లోబల్ టైమ్స్ ఒక రకమైన అభద్రతాభావంతో క‌నిపిస్తోంద‌ని వ్యాఖ్యానించారు.కేవలం సినిమా తీయడం కోసం వాస్తవాలను వక్రీకరించే చిత్రం కాద‌ని, చాలా ప‌రిశోధించి ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నార‌ని అన్నారు. గ‌ల్వాన్ ఘ‌ట‌న‌పై సినిమా కాబ‌ట్టి చైనా స్పందించ‌డం స‌హ‌జ‌మేన‌ని వ్యాఖ్యానించారు.

`బ్యాటిల్ ఆఫ్ గల్వాన్` చిత్రం జూన్ 2020 గల్వాన్ లోయ ఘర్షణ నుండి ప్రేరణ పొంది రూపొందిస్తున్న చిత్రం. గ‌ల్వాన్ లోయ‌లో భారత దళాలు ఎత్తైన ప్రదేశంలో చైనా దళాలతో అరుదైన క్రూరమైన బాహాబాహీ పోరాటంలో తలపడ్డాయి. ఈ పోరాటంలో ఇరువైపులా నష్ట‌పోవాల్సి వ‌చ్చింది. ఇందులో 20 మంది భారతీయ సైనికులు కూడా ఉన్నారు. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ నిజమైన యుద్ధంలో 16వ బీహార్ రెజిమెంట్ కమాండింగ్ ఆఫీసర్ అయిన కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబు పాత్రలో నటిస్తున్నారు. చిత్రంగద సింగ్, జైన్ షా, అంకుర్ భాటియా త‌దిత‌రులు న‌టిస్తున్నారు. 17 ఏప్రిల్ 2026న మూవీ థియేటర్లలో విడుదల కానుంది.