Begin typing your search above and press return to search.

ఒంట‌రి కాదు సింగిల్ అంతే! అక్క‌డ స‌ల్మాన్ ఇక్క‌డ ప్ర‌భాస్!!

ఒక వ్యక్తి బ్యాచిలర్‌గా సింగిల్‌గా ఉండొచ్చు.. కానీ ఒంటరి కాదు! ఇదే విషయాన్ని బాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సల్మాన్ ఖాన్ కాస్త అటూ ఇటూగా ప్రపంచానికి చాటిచెప్పారు.

By:  Sivaji Kontham   |   19 May 2026 10:56 PM IST
ఒంట‌రి కాదు సింగిల్ అంతే! అక్క‌డ స‌ల్మాన్ ఇక్క‌డ ప్ర‌భాస్!!
X

ఒక వ్యక్తి బ్యాచిలర్‌గా సింగిల్‌గా ఉండొచ్చు.. కానీ ఒంటరి కాదు! ఇదే విషయాన్ని బాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సల్మాన్ ఖాన్ కాస్త అటూ ఇటూగా ప్రపంచానికి చాటిచెప్పారు. ప్రస్తుతం 60 ఏళ్ల వయసులోనూ ఇంకా సింగిల్‌గానే ఉంటూ.. ఇప్పటికీ ఎక్కడికి వెళ్లినా `పెళ్లెప్పుడు?` అనే ప్రశ్నలను ఎదుర్కొంటున్నాడు ఈ బాలీవుడ్ భాయ్. వాస్తవానికి తన కెరీర్ ప్రారంభంలో ప్రేమించిన నటి సంగీతా బిజ్లానీని పెళ్లాడాలనుకున్నాడు కానీ రకరకాల కారణాలతో అది ఫెయిలైంది. ఆ తర్వాత సిన్సియర్ గా ఐశ్వర్యారాయ్‌ని పెళ్లాడాలని కలలు కన్నా.. ఆ డేటింగ్ కాస్తా ఒక అగ్లీ ఫైట్‌తో ముగిసింది. ఆ తర్వాత తన మేకప్ ఉమెన్ లులియా వాంటూర్‌తో ప్రేమలో ఉన్నాడంటూ ప్రచారం సాగినా.. ఇటీవలి కాలంలో ఆ గాసిప్పులు కూడా వినబడటం లేదు. మొత్తానికి సల్మాన్ భాయ్‌ని జీవితాంతం ఇలాంటి ఊహాజనిత పుకార్లు వెంటాడుతూనే ఉన్నాయి.

అటు బాలీవుడ్‌లో భాయ్ పరిస్థితి ఇలా ఉంటే.. ఇటు టాలీవుడ్‌లో పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ 46 ఏళ్ల వయసు వచ్చినా మోస్ట్ వాంటెడ్ `చియాన్`లా యువతుల మనసులు దోచేస్తూనే ఉన్నాడు. డార్లింగ్ ప్రభాస్ కూడా ఇప్పటివరకు పెళ్లి మాటే ఎత్తకుండా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా సింగిల్ లైఫ్‌ను ఎంతో హ్యాపీగా లీడ్ చేస్తున్నాడు. అయితే తాజాగా 60 ఏళ్ల సల్మాన్ ఖాన్ ఇన్‌స్టాలో షేర్ చేసిన ఒక క్రిప్టిక్ (నిగూఢమైన) పోస్ట్ సోషల్ మీడియాలో తీవ్ర కలకలం రేపింది. తాను షర్ట్‌లెస్ ఫోటోను షేర్ చేస్తూ.. ఒంటరిగా ఉండటంలో రెండు రకాలు ఉంటాయని.. ఒకటి మన ఇష్టపూర్వకంగా ఒంటరిగా ఉండటం.. రెండోది ఎవరూ మనతో ఉండకపోవడం వల్ల ఒంటరితనాన్ని అనుభవించడం! అంటూ రాసుకొచ్చాడు. దీనితో నెటిజన్లు భాయ్ పర్సనల్ లైఫ్‌లో ఏదో మానసిక వేదన అనుభవిస్తున్నాడంటూ విపరీతంగా రియాక్ట్ అయ్యారు.

నెటిజనుల రియాక్షన్ చూసి ఒక్కసారిగా కంగారుపడ్డ సల్మాన్ ఖాన్.. మంగళవారం మరో పోస్ట్‌తో క్లారిటీ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ''అరె యార్.. నేను నా గురించి మాట్లాడటం లేదు. అంత పెద్ద అద్భుతమైన కుటుంబం, ... స్నేహితులు నా చుట్టూ ఉండగా నేను ఎలా ఒంటరిగా ఉంటాను? మీ అందరి ఆశీస్సులు నాకు ఉన్నాయి. చుట్టూ ఎప్పుడూ జనాలు ఉంటే విసుగొస్తుంది (పాడైపోతాను).. అందుకే నాతో నేను కొంత సమయం గ‌డ‌పాలనుకుంటాను, అంతే!'' అని స్పష్టం చేశాడు.

ఈ వార్త క్ష‌ణాల్లో వైర‌ల్ అయింది. ఆఖరికి సల్మాన్ తల్లి కూడా కంగారుపడి 'ఏమైంది బేటా?' అని అడిగిందని.. అందరూ కాస్త చిల్ అవ్వాలని భాయ్ కోరాడు. బాలీవుడ్ భాయ్‌ని వెంటాడుతున్న ఈ పెళ్లి, ఒంటరితనం మునుముందు టాలీవుడ్ డార్లింగ్ ప్రభాస్‌కు కూడా వర్తిస్తుందేమోనని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

ఇక సల్మాన్ ఖాన్ కెరీర్ విషయానికి వస్తే.. ప్ర‌స్తుతం అపూర్వ లఖియా దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న 'మాతృభూమి' చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నారు. గతంలో 'ది బ్యాటిల్ ఆఫ్ గాల్వన్' అనే టైటిల్‌తో ఇండియా-చైనా సరిహద్దు ఘర్షణల నేపథ్యంలో అనుకున్న ఈ ప్రాజెక్ట్ కొన్ని మార్పుల తర్వాత కొత్త కథతో సెట్స్ పైకి వెళ్లింది. దీనితో పాటు టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం (SVC63) షూటింగ్‌లో కూడా సల్మాన్ భాయ్ పాల్గొంటున్నారు. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను 2027 ఈద్ కానుకగా భారీ స్థాయిలో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

వెండితెరపై వందల కోట్ల వసూళ్లు సాధిస్తూ కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న సల్మాన్ ఖాన్, ప్రభాస్ లాంటి స్టార్స్.. వ్యక్తిగత జీవితంలో సింగిల్‌గా ఉండటాన్ని సమాజం ఎప్పుడూ 'ఒంటరితనం' అనే కోణంలోనే చూస్తుంది. కానీ సల్మాన్ ఖాన్ ఇచ్చిన వివరణతో.. సెలబ్రిటీ హోదాలో నిరంతరం పబ్లిక్ గ్లేర్‌లో ఉండే వ్యక్తులకు పెళ్లి లేదా వైవాహిక బంధాల కంటే కూడా తమకంటూ దొరికే కొంత `సొంత సమయం` కుటుంబం, స్నేహితుల అండనే అసలైన సంతోషాన్ని ఇస్తుందని అర్థమవుతోంది. కేవలం ఒక తోడు లేనంత మాత్రాన జీవితంలో ఒంటరితనం ఏర్పడదని.. చుట్టూ ఉన్న ఆత్మీయుల ప్రేమే వారిని లైఫ్‌లో ఎప్పుడూ ఒంటరిగా కాకుండా సింగిల్‌గా గర్వంగా నిలబెడుతుందని మనం క‌చ్చితంగా నమ్మవచ్చు.