హీరో నుంచి కాపాడమని బాడీ గార్డ్‌ని పెట్టుకుంటే.. రెండో రోజే పరార్!
సల్మాన్ ఖాన్‌తో విడిపోయిన తర్వాత ఐశ్వర్యారాయ్ తనకు రక్షణగా బాడీగార్డ్‌ను నియమించుకున్నట్లు మాజీ బాడీగార్డ్ కేతన్ కరణ్డే వెల్లడించారు. సల్మాన్‌తో ఎదురైన ఉద్రిక్త పరిస్థితుల కారణంగా తాను కేవలం రెండు రోజులకే ఆ ఉద్యోగాన్ని వదిలేసినట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. రెండు దశాబ్దాల క్రితం జరిగిన ఈ ఘటనపై ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు బాలీవుడ్‌లో చర్చనీయాంశమయ్యాయి.
By: Sivaji Kontham | 21 Nov 2026 11:59 AM ISTరిలేషన్‌షిప్‌లో ఉన్నంతవరకూ ఓకే.. ఒకసారి తేడా వచ్చి గొడవలు ముదిరితేనే పరిస్థితులు ఎలా మారిపోతాయో చెప్పుకోవడానికి ఆ ఒక్క ఉదాహరణ చాలు. ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ సెలబ్రిటీ జంట ఒక్కసారిగా విడిపోయి.. పెద్ద వివాదంలోకి అడుగుపెట్టగా, తనను ప్రియుడి నుంచి కాపాడుకునేందుకు ఆ హీరోయిన్ ఒక బాడీగార్డ్ ను నియమించుకున్నారు. కానీ అతడు భయపడి ఒత్తిడిలో రెండు రోజులకే ఉద్యోగం వదిలేసాడట. కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చినా ఈ విషయం నిజంగా విన్నవారికి షాకింగ్ గా ఉంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
బాలీవుడ్‌లో ఒకప్పుడు అత్యంత చర్చనీయాంశమైన సల్మాన్ ఖాన్- ఐశ్వర్య రాయ్ రిలేషన్ - బ్రేకప్ తర్వాత నెలకొన్న పరిస్థితుల గురించి మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. `హమ్ దిల్ దే చుకే సనమ్` సినిమా సమయంలో ప్రేమలో పడిన ఈ జంట ఆ తర్వాత ఒక అగ్లీ ఫైట్ కారణంగా విడిపోయారు. సల్మాన్ ఖాన్ తనను ఫిజికల్ గా గాయపరిచారని, తిట్టారని ఐశ్వర్యారాయ్ బహిరంగంగానే ఆరోపించారు. ఆ తర్వాత వివాదాల మధ్య బంధం ముగిసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐశ్వర్య రాయ్ మాజీ బాడీగార్డ్, ప్రస్తుత నటుడు- బాడీబిల్డర్ కేతన్ కరణ్డే ఓ ఇంటర్వ్యూలో పాత జ్ఞాపకాలను పంచుకున్నారు. ఒక ఫ్యాషన్ షోలో సల్మాన్ ఖాన్‌తో ఎదురైన ఉద్రిక్త పరిస్థితులను గుర్తు చేసుకుంటూనే.. తాను కేవలం రెండు రోజుల్లోనే ఆ బాడీగార్డ్ ఉద్యోగానికి ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందో వివరించారు.
ఆర్ట్ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేతన్ కరణ్డే మాట్లాడుతూ.. మాజీ ప్రియుడు సల్మాన్ ఖాన్ నుంచి తనకు రక్షణ కల్పించడానికే ఐశ్వర్య రాయ్ తనను బాడీగార్డ్‌గా నియమించుకున్నారని స్పష్టం చేశారు. సల్మాన్ నుంచి తప్పించుకోవడానికే తనను పెట్టుకున్నారని.. ఈ విషయాన్ని తాను ఎవరికీ చెప్పకుండా రహస్యంగా ఉంచానని తెలిపారు. తన నియామకం గురించి సల్మాన్ ఖాన్‌కు కూడా తెలిసి ఉండే అవకాశం ఉందని కేతన్ పేర్కొన్నారు.
ఫ్యాషన్ షో వేదిక వద్ద చోటుచేసుకున్న ఆందోళనకర ఘటనను ప్రస్తావిస్తూ.. ఆ పరిస్థితుల మధ్య పనిచేయడం ఎంత ఒత్తిడితో కూడుకున్నదో కేతన్ వివరించారు. ఆ ఘటన జరిగిన మరుసటి రోజే ఆయన ఆ ఉద్యోగం నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే బాడీగార్డ్ బాధ్యతల నుంచి వైదొలగడం వెనుక ఉన్న కారణాలను అతడు షేర్ చేయడం సినీ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది.
`క్యా కూల్ హై హమ్ 3` వంటి చిత్రాల్లో నటించిన కేతన్ కరణ్డే వెల్లడించిన ఈ పాత విషయాలు మరోసారి సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. రెండు దశాబ్దాల క్రితం జరిగిన ఈ సంఘటనల తాలూకు వివరాలను ఇప్పుడు బయటపెట్టడంతో.. నాటి బాలీవుడ్ పరిణామాలపై మరోసారి ఆసక్తి నెలకొంది. ఐశ్వర్యారాయ్ తో ప్రేమాయణం సాగించిన నటుడు వివేక్ ఒబెరాయ్ చాలా ఇంటర్వ్యూలలో తన కెరీర్ కి ఎలాంటి ఆటంకాలు ఎదురయ్యాయో వెల్లడించారు. ఒక బహిరంగ సమావేశంలో సల్మాన్ ఖాన్ పైనా తీవ్ర వ్యాఖ్యలు చేసాడు.
