దర్శకుడి పై 9కోట్ల దావా.. స్టార్ హీరోకి ఫేవర్‌గా
అలాగే అభినవ్ ఇంటర్వ్యూలను సామాజికమాధ్యమాలు, యూట్యూబ్ నుంచి తొలగించాలని కూడా కోర్టు సూచించింది.
By: Sivaji Kontham | 1 Feb 2026 4:03 PM ISTబాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన `దబాంగ్` చిత్రానికి అభినవ్ కశ్యప్ దర్శకుడు. అయితే ఆ సినిమా చిత్రీకరణ సమయంలో అభినవ్ తో సల్మాన్ మనస్ఫర్థలు తీవ్ర చర్చకు తెర తీసాయి. తనను, తన పనిని సల్మాన్ నియంత్రించాడని అభినవ్ ఆరోపించాడు. అంతేకాకుండా సల్మాన్ కూడా దావూద్ ఇబ్రహీం తరహా మాఫియా అని, అతడి కుటుంబ సభ్యులంతా బెదిరింపులకు పాల్పడతారని కూడా అభినవ్ ఆరోపించాడు. సల్మాన్ ని ఇంకా అనరాని మాటలు అన్నాడు. తీవ్ర అసభ్యకర పదజాలం కూడా ఉపయోగించాడు. జిహాదీ ఎకోసిస్టమ్! అంటూ సల్మాన్ కుటుంబాన్ని దుయ్యబట్టాడు.
అయితే దీనిపై సల్మాన్, అతడి కుటుంబం చాలా సీరియస్ గా ఉంది. అభినవ్ పై సల్మాన్ కోర్టులో పోరాడుతున్నారు. అతడిపై 9కోట్ల పరువు నష్టం దావా వేయడమే గాక, భేషరతుగా క్షమాపణలు చెప్పాలని ముంబై సివిల్ కోర్టులో దావా వేయగా దీనిపై విచారణ సాగుతోంది. తాజా సమాచారం మేరకు సల్మాన్ కి పెద్ద ఊరటను కలిగిస్తూ, కోర్టు దర్శకుడు అభినవ్ కి అక్షింతలు వేసింది.
వాక్ స్వాతంత్య్రం ఉన్నది ఇతరులను కించపరిచేందుకు, అవమానించేందుకు కాదు. ఇతరులను అవమానించే పదజాలం ఉండకూడదని కోర్టు హెచ్చరించింది. సల్మాన్, అతడి కుటుంబంపై ఇకపై అవమానకర వ్యాఖ్యలు లేదా పరువు నష్టం కలిగించే కామెంట్లు చేయకూడదని కోర్టు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది.
అలాగే అభినవ్ ఇంటర్వ్యూలను సామాజికమాధ్యమాలు, యూట్యూబ్ నుంచి తొలగించాలని కూడా కోర్టు సూచించింది.
అభినవ్ కశ్యప్ చేసిన ఆరోపణలు ఏమిటి?
సల్మాన్ ఖాన్ దావా ప్రకారం.. అభినవ్ కశ్యప్ సెప్టెంబర్ -డిసెంబర్ 2025 మధ్య ఇచ్చిన పలు తప్పుడు వ్యాఖ్యలు చేసాడు. ఖాన్ కుటుంబాన్ని శిక్ష అనుభవిస్తున్న నేరస్తులు అని, జిహాదీ ఎకోసిస్టమ్ సభ్యులు అని అభివర్ణించారు. సల్మాన్ ఖాన్‌ను అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో పోలుస్తూ ఫోటోలు వాడారు. దబాంగ్ చిత్రీకరణ సమయంలో తనను వేధించారని, తన ఎడిటర్ ని కిడ్నాప్ చేసారని కూడా అభినవ్ ఆరోపించారు. ప్రస్తుతానికి కోర్టు అభినవ్ కశ్యప్ నోరు విప్పకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అభినవ్ కశ్యప్ ప్రముఖ దర్శకరచయిత అనురాగ్ కశ్యప్ కి సోదరుడు అన్న సంగతి తెలిసిందే.
