నేను ఎవరి కెరీర్‌ను నాశనం చేయలేదు: సల్మాన్ ఖాన్
సల్మాన్ ఖాన్ సినీపరిశ్రమను నియంత్రిస్తాడని, అతడు ఒక గూండా, రాబందు అని విమర్శించాడు దబాంగ్ దర్శకుడు అభినవ్ కశ్యప్.
By: Sivaji Kontham | 8 Sept 2025 9:58 PM ISTసల్మాన్ ఖాన్ సినీపరిశ్రమను నియంత్రిస్తాడని, అతడు ఒక గూండా, రాబందు అని విమర్శించాడు దబాంగ్ దర్శకుడు అభినవ్ కశ్యప్. అతడి తీవ్ర ఆరోపణలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. తాను దబాంగ్ 2 కి దర్శకత్వం వహించనని చెప్పినందుకు తనపై చాలా దుష్ప్రచారం సాగించారని సల్మాన్ పైనా, అతడి కుటుంబీకుల పైనా ఆరోపించారు అభినవ్. దబాంగ్ దర్శకుడి ఆరోపణల నేపథ్యంలో.. సల్మాన్ ఖాన్ ఇంత దుర్మార్గుడా? అంటూ సోషల్ మీడియాల్లో చర్చ నడిచింది.
సల్మాన్ చాలామంది జీవితాలను కెరీర్ ని నిలబెట్టాడని చెబుతుంటారు. అతడు ఇప్పటికే చాలా మంది ఔత్సాహిక నటీనటులను వెండితెరకు పరిచయం చేసాడు. నటవారసులను కూడా ఇండస్ట్రీలో ప్రవేశ పెట్టాడు. వాళ్లలో కొందరు బాగానే అవకాశాలు అందుకుంటున్నారు. కానీ అభినవ్ కశ్యప్ తీవ్ర ఆరోపణలు ఆశ్చర్యం కలిగించాయి. ఇప్పుడు బిగ్ బాస్ షోలో పార్టిసిపెంట్ సల్మాన్ పై ఇదే తరహా కామెంట్ చేయడం షాకిస్తోంది.
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇటీవల `బిగ్ బాస్ 19 వీకెండ్ కా వార్` కార్యక్రమంలో తనపై జరుగుతున్న ప్రచారాన్ని తిప్పి కొట్టారు. తాను ఎవరి కెరీర్‌ను నాశనం చేయలేదని, అయితే కొందరు తమ కెరీర్ ని నాశనం చేస్తున్నానని ఆరోపిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఆదివారం ఎపిసోడ్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తన సోదరుడు షాబాజ్ బాదేశాకు మద్దతుగా షెహ్నాజ్ కనిపించింది. మీరు చాలా మంది కెరీర్‌లను నాశనం చేశారట కదా? అని షెహ్నాజ్ ఈ షోలో నేరుగా సల్మాన్ ని ప్రశ్నించింది.
దీనికి సల్మాన్ వెంటనే స్పందించాడు. ``నేను ఎవరి కెరీర్‌ను చేయలేదు. కెరీర్‌లను తయారు చేసేది దేవుడు.. నేను కాదు. చాలా మంది కెరీర్‌లను నాశనం చేశానని నాపై ఆరోపణలొచ్చాయి. ముఖ్యంగా కెరీర్‌లు నాశనం అయిన వారు ఎవరూ నా చేతుల్లో లేరు. కానీ ఈ రోజుల్లో నాశనం కావడం సర్వసాధారణం. అయినా నేను ఎవరి కెరీర్‌ను నాశనం చేసాను? నేను నాశనం చేయగలిగితే.. అది నా కెరీర్‌ను మాత్రమే!`` అని సల్మాన్ వివరణ ఇచ్చాడు.
ఈ ఎపిసోడ్ లో ప్రత్యక్షమైన షెహ్నాజ్ గిల్ ఎవరో పరిచయం అవసరం లేదు. బిగ్ బాస్ 13 లో పాపులర్ పోటీదారు. సల్మాన్ ఖాన్ `కిసీ కా భాయ్ కిసీ కి జాన్`(2023) తో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. వీరం రీమేక్ గా రూపొందించిన ఈ సినిమా డిజాస్టరైన సంగతి తెలిసిందే. రెండు వారాలుగా ఇంటి సభ్యుల రగడతో బిగ్ బాస్ 19 సందడి పీక్స్ కి చేరుకుంటోంది.
