డైరెక్టర్‌కి మళ్లీ కౌంటరిచ్చిన సూపర్‌స్టార్
2010లో విడుదలైంది దబాంగ్. సల్మాన్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ చిత్రాలలో ఇది ఒకటి. ఈ చిత్రానికి అభినవ్ కశ్యప్ దర్శకత్వం వహించారు.
By: Sivaji Kontham | 29 Sept 2025 1:35 AM IST2010లో విడుదలైంది దబాంగ్. సల్మాన్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ చిత్రాలలో ఇది ఒకటి. ఈ చిత్రానికి అభినవ్ కశ్యప్ దర్శకత్వం వహించారు. అయితే దబాంగ్ సీక్వెల్ తెరకెక్కించే ప్రాసెస్ లో సల్మాన్ ఖాన్, అతడి కుటుంబీకులతో అభినవ్ కశ్యప్ సంబంధాలు చెడిపోయాయి. వారి మధ్య విభేధాలు తారా స్థాయికి చేరుకోగా, అభినవ్ సల్మాన్ కుటుంబంపై తీవ్రంగా ఆరోపించాడు. సల్మాన్ ఒక గూండా అని, అతడు చెప్పింది వినకపోతే, ఎవరిని అయినా నియంత్రిస్తాడని అభినవ్ దూషించాడు. తన కెరీర్ నాశనమవ్వడానికి సల్మాన్ ఖాన్, అతడి కుటుంబం కారణమని అతడు డైరెక్ట్ గానే వ్యాఖ్యానించాడు.
2010 నుంచి పలుమార్లు అభినవ్ మీడియా ఎదుట సల్మాన్ పై తీవ్రంగా విరుచుకు పడ్డాడు. అయితే ఈ వివాదం ఆరోజుతో ముగియలేదు. ఇప్పుడు సల్మాన్ కూడా అతడిపై కౌంటర్లు స్టార్ట్ చేసాడు. ఇంతకుముందు అభినవ్ కశ్యప్ సోదరుడు అనురాగ్ కశ్యప్ తెరకెక్కించిన `నిశాంచి` సినిమా విజయం సాధించగా, దానిని సల్మాన్ ప్రశంసించాడు. ఆ తర్వాత అభినవ్ మరోసారి సల్మాన్ పై విరుచుకుపడ్డాడు. అతడు బూట్లు నాకేయడానికి కూడా వెనకాడడని విమర్శించాడు. `తేరే నామ్`(సల్మాన్ హీరో) చిత్రీకరణ సమయంలో తన సోదరుడు అనురాగ్ కశ్యప్ ని ఆ సినిమా నుంచి తొలగించాడని, కానీ ఇప్పుడు అతడిని పొగడటం ద్వారా మరోసారి తనను సైలెంట్ చేయాలని, ప్రజల దృష్టిని మరల్చాలని చూస్తున్నాడని ఆరోపించాడు.
ఇప్పుడు బిగ్ బాస్ లో దబాంగ్ డైరెక్టర్ అభినవ్ పై సల్మాన్ తనదైన శైలిలో కౌంటర్ వేసాడు. అక్కడ పార్టిసిపెంట్ ఒకరు తాను కుటుంబంతో గొడవపడి ముంబై వచ్చేశానని, కానీ తనకు ఇక్కడ కుటుంబం కావాలని, మీరు కుటుంబంగా మారి నాకు అండగా ఉంటారా? అని అడిగారు. దీనికి అతడు స్పందిస్తూ...ఈ రోజుల్లో నేను ఉన్న పరిస్థితిలో నాతో జతకట్టే ప్రతి ఒక్కరూ ఇబ్బందుల్లో పడుతున్నారని సమాధానం ఇచ్చారు.
''నాతో సంబంధం ఉన్నవారు.. లేని వారు కూడా ఈ రోజుల్లో నన్ను లక్ష్యంగా చేసుకుంటున్నారు. నాతో సంబంధాలు ఉన్న వ్యక్తులు ఒకప్పుడు నన్ను ప్రశంసించిన వారు కూడా ఇప్పుడు ఖాళీగా కూర్చుని రకరకాల అర్ధంలేని మాటలు చెబుతున్నారు! అని అన్నారు. ఈ రోజుల్లో పని లేని వాళ్లు పాడ్‌కాస్ట్‌లకు వెళ్లి చెత్తగా మాట్లాడుతున్నారు. మీ అందరికీ నా అభ్యర్థన ఏమిటంటే దయచేసి పని చేయండి.. బిజీ అవ్వండి...చేసే పని కంటే మెరుగైనది ఏదీ లేదు అని భాయ్ పంచ్ వేసారు. మీరు ఏది ఎదుర్కొంటున్నా.. లేచి స్నానం చేసి ఉద్యోగంలో చేరాలి! అంటూ తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రం విసిరారు సల్మాన్ భాయ్.
అయితే సల్మాన్ ఇలాంటి వేదికపై ఈ గొడవను హైలైట్ చేయడం ద్వారా ఎవరూ పట్టించుకోని అభినవ్ ని హైలైట్ చేస్తున్నారని కొందరు నెటిజనులు అన్నారు. పాత సల్మాన్ అంత వినయంగా ఉండేవాడు కాదు! అయినా అభినవ్ భరించాడని ఒకరు వ్యాఖ్యానించారు. సల్మాన్ తప్పు చేసినందున గత సంబంధాలు వర్కవుట్ కాలేదని అంగీకరించాడని, వయసు అయిపోయిన కారణంగా ఇప్పుడు అతడి స్వరం చాలా మారిపోయిందని మరొకరు వ్యాఖ్యానించారు. ``అసలు ఈ షోతో అభినవ్ కి సంబంధమే లేదు.. అయినా ఇది వింతగా ఉంద``ని ఒకరు తప్పు పట్టారు. చాలా మంది ప్రజలు అభినవ్ ని అంత సీరియస్‌గా తీసుకోవడం లేదని అన్నారు.
