Begin typing your search above and press return to search.

ఈసారైనా 'పెద్ద'లకి కలిసి వచ్చేనా..?

కరోనా కారణంగా అన్ని భాషల సినిమా ఇండస్ట్రీలు తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొన్న విషయం తెల్సిందే.

By:  Ramesh Palla   |   5 Jan 2026 3:00 PM IST
ఈసారైనా పెద్దలకి కలిసి వచ్చేనా..?
X

కరోనా కారణంగా అన్ని భాషల సినిమా ఇండస్ట్రీలు తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొన్న విషయం తెల్సిందే. అయితే సౌత్‌ ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీ ముఖ్యంగా టాలీవుడ్‌, కోలీవుడ్‌ సినిమా ఇండస్ట్రీలు చాలా స్పీడ్‌గా రికవరీ అయ్యాయి. కన్నడ, మలయాళ సినిమా ఇండస్ట్రీల నుంచి కూడా మంచి కంటెంట్‌ ఓరియంటెడ్‌ సినిమాలు వస్తున్నాయి, సూపర్‌ హిట్‌గా నిలిచి భారీ వసూళ్లు రాబడుతున్నాయి. కానీ హిందీ సినిమా ఇండస్ట్రీ ఇప్పటికీ కరోనా పరిస్థితుల నుంచి బయట పడలేక పోతుంది. ఏడాదిలో కనీసం అయిదు పది సినిమాలు కూడా సూపర్‌ హిట్‌ గా నిలవడం లేదు. గతంతో పోల్చితే బాలీవుడ్‌లో సినిమాల యొక్క సక్సెస్‌ రేటు దారుణంగా పడి పోయింది. ముఖ్యంగా స్టార్‌ హీరోలు అక్షయ్‌ కుమార్‌, అజయ్ దేవగన్‌, సల్మాన్‌ ఖాన్‌, అమీర్‌ ఖాన్ వంటి స్టార్స్ సైతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఎక్కువగా మీడియం రేంజ్‌ సినిమాలు, చిన్న సినిమాలు, కంటెంట్‌ ఓరియంటెడ్‌ సినిమాలు జనాలకు నచ్చుతున్నాయి.

దురంధర్ సినిమాతో భారీ విజయం..

భారీ యాక్షన్ సినిమాలను ఒకప్పుడు వందల కోట్ల వసూళ్లు కట్టబెట్టి హిట్‌ చేసిన ప్రేక్షకులు ఇప్పుడు వాటిని తీసి పక్కన పెట్టేస్తున్నారు. బాలీవుడ్‌ నుంచి ఈ మధ్య కాలంలో వచ్చిన చాలా సినిమాలు బడ్జెట్‌లో కనీసం సగం వసూళ్లను రాబట్టలేక పోయాయి. గత ఏడాది చివర్లో వచ్చిన దురంధర్‌ సినిమా మినహా మరే స్పై థ్రిల్లర్‌ సినిమాలు ఈ మధ్య హిట్‌ కాలేదు. సల్మాన్‌ ఖాన్‌, షారుఖ్‌ ఖాన్‌, అమీర్‌ ఖాన్‌ వంటి స్టార్స్ ఒకప్పుడు వస్తున్నారు అంటే బాక్సాఫీస్‌ వద్ద సందడి ఆహా... ఓహో అన్నట్లుగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. వారి సినిమాలను జనాలు లైట్‌ తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా సల్మాన్‌ ఖాన్‌, అమీర్‌ ఖాన్‌ సినిమాలను జనాలు థియేటర్‌లో వద్దు ఓటీటీలో చూద్దా అన్నట్లుగా ఫిక్స్ అవుతున్నారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. షారుఖ్‌ ఖాన్‌ బ్యాక్ టు బ్యాక్‌ హిట్స్ కారణంగా కాస్త పర్వాలేదు అన్నట్లుగా ఆయన సినిమాలకు బజ్‌ ఉంది. ఇతర పెద్ద హీరోల సినిమాలకు మార్కెట్‌ అస్సలే లేదని చెప్పాలి.

సల్మాన్‌ ఖాన్‌, అమీర్‌ ఖాన్‌ సినిమాలు...

బాలీవుడ్‌ నుంచి ఈ ఏడాది కూడా చాలా పెద్ద సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. వాటిల్లో హిట్‌ కొట్టే సినిమాలు ఏంటి అంటే ఠక్కున చెప్పలేని పరిస్థితి. ఒకప్పుడు స్టార్‌ హీరో సినిమా కనుక మినిమం ఉంటుంది అనే అభిప్రాయం ఉండేది. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. స్టార్‌ హీరో సినిమా అయినా కంటెంట్‌ లేకుంటే జనాలు పట్టించుకునే పరిస్థితి లేదు. అందుకే స్టార్‌ హీరోల సినిమాలు వచ్చినంత మాత్రాన బాక్సాఫీస్ కలకలగా ఉంటుంది అనుకుంటే పొరపాటే అనే అభిప్రాయంను విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. గత ఐదు సంవత్సరాలుగా పెద్ద సినిమాలు తీవ్రమైన ఆర్థిక నష్టాలను చవిచూస్తున్నాయి. దాంతో ఇప్పటికే సినిమాల మేకింగ్‌ విషయంలో నిర్మాతలు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా స్టార్‌ హీరోల సినిమాల బడ్జెట్‌ విషయంలో ఒకటికి పది సార్లు ఆలోచించి మరీ నిర్మాతలు, దర్శకులు అడుగు ముందుకు వేస్తున్నారు అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్‌.

బాలీవుడ్‌లో 2026 లో పెద్ద సినిమాలు..

గత ఏడాది సల్మాన్‌ ఖాన్‌ కి సికిందర్ రూపంలో చాలా పెద్ద షాక్‌ తగిలింది. ఇక అమీర్‌ ఖాన్‌ సైతం చేదు ఫలితంను చవిచూశాడు. ఈ ఏడాది సైతం వీరిద్దరు మరోసారి తమ అదృష్టంను పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నారు. ఈ ఇద్దరు స్టార్‌ హీరోలు మాత్రమే కాకుండా షారుఖ్‌ ఖాన్‌ ఇంకా పలువురు పెద్ద హీరోలు, సీనియర్‌ స్టార్‌ హీరోలు, గతంలో వందల కోట్ల వసూళ్లు సాధించిన హీరోలు రాబోతున్నాయి. గడచిన ఐదేళ్ల కాలంలో ఈ హీరోలు నటించిన సినిమాల్లో మెజార్టీ సినిమాలు ఫ్లాప్‌ అయ్యాయి. కొందరికి చాలా ఏళ్లుగా కమర్షియల్‌ హిట్‌ లేదు. కనుక 2026 అయినా ఈ బాలీవుడ్‌ 'పెద్ద' హీరోలకు కలిసి వచ్చి, సక్సెస్‌ దక్కేనా చూడాలి. గతంలో మాదిరిగా వందల కోట్ల వసూళ్లు నమోదు కావడం సాధ్యం కాదని ఇప్పటికే క్లారిటీ వచ్చింది. కానీ మినిమం వసూళ్లను సాధించడం ద్వారా అయినా నిర్మాతకు ఆర్థిక భారం లేకుండా చేయగలిగితే చాలు అని చాలా మంది సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి ఆ మినిమం వసూళ్లు అయినా పెద్ద హీరోల సినిమాలు 2026 లో నమోదు చేసేనా చూడాలి.