Begin typing your search above and press return to search.

వృద్ధాప్యాన్ని అంగీక‌రించిన మొట్ట‌మొద‌టి సూప‌ర్‌స్టార్!

చాలామంది బ‌ట్ట‌త‌ల‌ను దాచుకుంటారు. 60 ప్ల‌స్ లో అడుగుపెట్టినా వ‌య‌సును దాచేస్తూ గేమ్స్ ఆడుతుంటారు.

By:  Sivaji Kontham   |   20 July 2026 12:36 AM IST
వృద్ధాప్యాన్ని అంగీక‌రించిన మొట్ట‌మొద‌టి సూప‌ర్‌స్టార్!
X

చాలామంది బ‌ట్ట‌త‌ల‌ను దాచుకుంటారు. 60 ప్ల‌స్ లో అడుగుపెట్టినా వ‌య‌సును దాచేస్తూ గేమ్స్ ఆడుతుంటారు. అర‌వైలో కూడా ఇర‌వైలో ఉన్న హీరోయిన్ల‌తో రొమాన్స్ చేస్తూ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నారు. ప్రోస్థ‌టిక్ లు, కెమెరాల మాటున వీళ్ల వృద్ధాప్యం అస్స‌లు బ‌య‌ట‌ప‌డ‌టం లేదు. కానీ అన్నిసార్లు దీనిని క‌వ‌ర్ చేయ‌డం సులువు కాదు. ఒక్కోసారి అది బ‌య‌ట‌ప‌డిపోతుంటుంది. అంద‌రూ ర‌జ‌నీకాంత్- త‌ళా అజిత్‌ లు కాదు క‌దా! నేచురాలిటీ రియాలిటీకి ద‌గ్గ‌ర‌గా ఉండ‌టానికి... ముఖ్యంగా ఖాన్ లు 60 ప్ల‌స్ లో వ‌య‌సుడిగినా బ‌య‌ట‌కు మాత్రం దొరికిపోకుండా జాగ్ర‌త్త ప‌డుతుంటారు. కానీ ఇప్పుడు స‌ల్మాన్ ఖాన్ ఆలోచ‌న‌ల్లో మార్పు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. అత‌డు కొద్దిరోజులుగా త‌న వ‌య‌సును దాచుకోకుండా బ‌య‌ట‌ప‌డ‌టం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ ఇటీవల ముంబైలో జరిగిన ఒక ఈవెంట్‌లో పాల్గొన్నప్పుడు. ఆయన శారీరక రూపాన్ని -అలసటతో కూడిన ముఖాన్ని చూసి అభిమానులు సోషల్ మీడియాలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సల్మాన్ ఖాన్ లుక్ ఇలా మారడానికి గల కొన్ని ముఖ్యమైన కారణాలపై నెటిజ‌నుల్లో బిగ్ డిబేట్ ర‌న్ అవుతోంది.

చాలా మంది సల్మాన్ ఖాన్ మారిన‌ లుక్ చూసి నిజంగా షాక్ కి గుర‌వుతున్నారు. స‌ల్మాన్ ఏంటి ఇలా మారిపోయాడు! అంటూ షాక‌వుతున్నారు. అయితే ఖాన్ అభిమానులు మాత్రం దీనిని సమర్థిస్తున్నారు. 60 ఏళ్ల వయసులో ఎలాంటి కాస్మెటిక్ సర్జరీలు లేదా భారీ మేకప్ లేకుండా... కెమెరా ముందుకు తన అసలు రూపాన్ని చూపించ‌డానికి ఎంతో ధైర్యం కావాలని...హాలీవుడ్ లేదా సౌత్‌లో రజనీకాంత్ తరహాలో సల్మాన్ కూడా తన సహజత్వాన్ని దాచకుండా ఉండటం అభినందించదగ్గ విషయమని ఫ్యాన్స్ అంటున్నారు.

సల్మాన్ ఖాన్ మారిన రూపాన్ని చూసి నెటిజన్లు ఆయన పాత ఆరోగ్య సమస్యలను గుర్తు చేసుకుంటున్నారు. గతంలో సల్మాన్ ఖాన్ `ట్రైజెమినల్ న్యూరాల్జియా` అనే తీవ్రమైన న్యూరోలాజికల్ (నరాల సంబంధిత) వ్యాధితో బాధపడ్డారు. దీనిని ప్రపంచంలోనే అత్యంత నొప్పితో కూడిన వ్యాధిగా పరిగణిస్తారు. దీని చికిత్స కోసం ఆయన అమెరికాలో `గామా నైఫ్ సర్జరీ` కూడా చేయించుకున్నారు. అయితే ప్రస్తుత సిక్ లుక్‌కు సంబంధించి ఖాన్ సరికొత్తగా ఏదైనా అనారోగ్యానికి గురయ్యారనే దానిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు.

సల్మాన్ ఖాన్ ఇలా బాగా బరువు తగ్గి లీన్ లుక్‌లోకి మారడానికి ఆయన నటిస్తున్న తాజా చిత్రం `మాతృభూమి: మే వార్ రెస్ట్ ఇన్ పీస్` (గతంలో `బ్యాటిల్ ఆఫ్ గాల్వన్`) కూడా ఒక ప్రధాన కారణం కావచ్చు. ఈ సినిమాలో ఆయన ఇండియన్ ఆర్మీకి చెందిన కల్నల్ బి. సంతోష్ బాబు పాత్రను పోషిస్తున్నారు. ఒక సైనిక అధికారి పాత్రకు తగ్గట్లుగా కనిపించడం కోసం కఠినమైన డైట్ - వర్కవుట్స్ చేయడం వల్ల ముఖంలో కాస్త అలసట, చర్మం వాలినట్లుగా కనిపించడం సహజం.

60 ఏళ్ల వయసులోనూ సల్మాన్ ఖాన్ వరుస ప్రాజెక్టులతో బిజీగా గడుపుతున్నారు. ఒకవైపు `మాతృభూమి` చిత్రానికి సంబంధించిన పనులు..రీ-షూట్స్‌తో పాటు మరోవైపు సౌత్ దర్శకుడు వంశీ పైడిపల్లితో ప్లాన్ చేసిన‌ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ (SVC 63) కోసం కూడా ఆయన సిద్ధమవుతున్నారు. నిరంతర ప్రయాణాలు, నైట్ షిఫ్ట్‌ల వల్ల ఒంటిపై ఆ ప్రభావం పడటం సాధారణమే.

సినిమాల్లో కనిపించే గ్లామర్, వందల మందితో ఒంటరిగా పోరాడే `భాయ్‌జాన్` లుక్ వెనుక విజువల్ ఎఫెక్ట్స్ - స్పెషల్ కెమెరా యాంగిల్స్ - భారీ మేకప్ ఉంటాయి. కానీ నిజ జీవితంలో సెలబ్రిటీలకైనా వయసు పెరగడం, శారీరక అలసట అనేది తప్పదు. ముంబైలో జరిగిన స్లమ్ రిహాబిలిటేషన్ అథారిటీ (ఎస్.ఆర్.ఏ) ఈవెంట్‌లో సల్మాన్ అలసిపోయినట్లు కనిపించినా.. అక్కడి పేద లబ్ధిదారులను ఎంతో ఆప్యాయంగా పలకరించి...ఇళ్ల తాళాలు అందజేయడం ఆయన మంచి మనసును చాటిచెప్పింది. బాలీవుడ్ లో అర‌డ‌జ‌ను పైగా హీరోలు వృధ్ధాప్యంలో ఉన్నా దానిని బ‌య‌ట‌ప‌డ‌నివ్వ‌రు. హిందీ చిత్ర‌సీమ‌లో మొట్ట‌మొద‌టిసారిగా ఒక సూప‌ర్ స్టార్ ఇలా బ‌య‌ట‌ప‌డ‌టం ఇదే మొద‌టిసారి.