Begin typing your search above and press return to search.

ఐబొమ్మ రవి కేసులోకి లాయర్ సలీం.. ఏమన్నారంటే..

టాలీవుడ్ ని షేక్ చేస్తున్న 'ఐబొమ్మ' కేసులో ప్రధాన నిందితుడు ఇమ్మడి రవిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

By:  M Prashanth   |   20 Nov 2025 8:46 AM IST
ఐబొమ్మ రవి కేసులోకి లాయర్ సలీం.. ఏమన్నారంటే..
X

టాలీవుడ్ ని షేక్ చేస్తున్న 'ఐబొమ్మ' కేసులో ప్రధాన నిందితుడు ఇమ్మడి రవిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రవి తరపున వాదించడానికి ప్రముఖ క్రిమినల్ లాయర్ సలీం రంగంలోకి దిగారు. గతంలో కోడికత్తి శ్రీను, గులకరాయి కేసుల్లో సంచలనాత్మక వాదనలు వినిపించిన సలీం, ఇప్పుడు రవి కేసును టేకప్ చేయడం ఆసక్తికరంగా మారింది.

రవిని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించిన తర్వాత, సలీం మీడియాతో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పోలీసులు రవిని అరెస్ట్ చేయడంలో రూల్ ఆఫ్ లా పాటించారని, ఒక ముద్దాయికి న్యాయ సహాయం అందడం అతని హక్కు అని పేర్కొన్నారు. రవి తండ్రితో మాట్లాడిన తర్వాతే తాను ఈ కేసును చేపట్టానని, తన క్లయింట్ కు న్యాయం జరిగేలా చూస్తానని ఆయన స్పష్టం చేశారు.

ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉందనే వార్తలపై సలీం స్పందించారు. ఒకవేళ ఈడీ రంగంలోకి దిగినా, తాము చట్టపరంగానే ఎదుర్కొంటామని ధీమా వ్యక్తం చేశారు. గతంలో జగన్ మోహన్ రెడ్డి, కవిత వంటి హై ప్రొఫైల్ కేసుల్లో ఈడీ ఇన్వాల్వ్ అయిన విషయాన్ని గుర్తు చేస్తూ, రవి విషయంలోనూ చట్ట ప్రకారం నడుచుకుంటామని చెప్పారు.

ముఖ్యంగా రవికి సోషల్ మీడియాలో వస్తున్న మద్దతు గురించి సలీం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సినిమా నిర్మాతలు, పోలీసులు రవిని నిందితుడిగా చూస్తుంటే, సామాన్య జనం మాత్రం అతన్ని ఒక మాస్ హీరోగా ఆరాధిస్తున్నారని అన్నారు. తనకు వస్తున్న మెసేజ్ లలో చాలామంది "మీరు కేసును తీసుకోవడం సూపర్ సార్, థాంక్యూ సార్" అంటూ రవికి మద్దతుగా నిలుస్తున్నారని, ఇది తనకు ఆనందం కలిగించిందని చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం పోలీసులు రవిని 7 రోజుల కస్టడీకి కోరగా, కోర్టు అనుమతిస్తే 41D నిబంధన ప్రకారం లాయర్ సమక్షంలోనే విచారణ జరపాలని తాము కోరుతామని సలీం తెలిపారు. బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశామని, త్వరలోనే బెయిల్ వస్తుందనే నమ్మకం ఉందని ఆయన అన్నారు. రవికి వ్యతిరేకంగా పోలీసులు సవాల్ విసిరినా, న్యాయపరంగా తాము గట్టిగానే పోరాడతామని ఆయన స్పష్టం చేశారు.

ఫైనల్ గా ఐబొమ్మ రవి కేసు ఇప్పుడు లాయర్ సలీం ఎంట్రీతో కొత్త మలుపు తిరిగింది. సినిమా పెద్దలు ఒకవైపు, నెటిజన్లు మరోవైపు ఉంటే.. మధ్యలో న్యాయస్థానం ఎలాంటి తీర్పు ఇస్తుందో వేచి చూడాలి.