మా కుటుంబం గొడ్డు మాంసం తినదు.. సల్మాన్ ఖాన్ తండ్రి ఐక్యరాగం
ఆయన చిన్నప్పటి నుంచి హిందువులతో కలిసి.. వారి మధ్య పెరిగానని అందువల్ల వారి సాంప్రదాయాలను ఎప్పుడూ గౌరవిస్తానని చెప్పారు.
By: Sivaji Kontham | 1 Sept 2025 9:41 AM ISTకులం మతం అంటూ సమాజం విడిపోయింది. కానీ అలాంటి సమాజంలో విలువలకు కట్టుబడి, సాంప్రదాయాలను గౌరవిస్తూ పరమత సహనాన్ని పాటిస్తూ, శాంతియుత సామాజిక జీవనం గడపడం, కుటుంబాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యమైనవి. దేవుళ్ల పేరుతో ఘర్షణలు కూడా తగదు.. ఇలాంటి విలువలు మానవతావాదంలో సల్మాన్ ఖాన్ కుటుంబం ఎప్పుడూ ముందుంటుంది. దీనికి కారణం సల్మాన్ ఖాన్ తండ్రి ప్రముఖ రచయిత సలీం ఖాన్ విధి విధానాలు, పద్ధతులు. ఆయన ఒక హిందువును పెళ్లాడారు. ఆమె పేరు సుశీలా చరక్.
ఆయన చిన్నప్పటి నుంచి హిందువులతో కలిసి.. వారి మధ్య పెరిగానని అందువల్ల వారి సాంప్రదాయాలను ఎప్పుడూ గౌరవిస్తానని చెప్పారు. అంతేకాదు.. తమ కుటుంబం అందరు దేవుళ్లను ప్రార్థిస్తుందని, అన్ని పండుగలను జరుపుకుంటుందని కూడా తెలిపారు. నిజానికి సలీంఖాన్ మహమ్మద్ ప్రవక్త ప్రవచనాలను ఆచరిస్తారు. దేవుడి సూచనలను, పరమత సహనాన్ని, శాంతిని నమ్ముతారు.
ఆయన గణేష్ చతుర్థి ఉత్సవాలతో పాటు అన్ని హిందూ పండుగలను తమ ఇంట్లో ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. తమ కుటుంబం గొడ్డు(ఆవు) మాంసం తినదని అన్నారు. చాలా ముస్లిమ్ కుటుంబాలు గొడ్డు మాంసం తింటాయి. దానికి కారణం అత్యంత చౌకగా దొరికే మాంసం ఇది. కానీ పవిత్రమైన గోమాతను చంపకూడదని మహమ్మద్ ప్రవక్త చెప్పారు. ఆవు పాలు తల్లి పాలకు ప్రత్యామ్నాయమని పవిత్ర గ్రంధాలు చెప్పాయని సలీం ఖాన్ అన్నారు. పెళ్లికి ముందే తాను హిందూ సాంప్రదాయాలకు అలవాటు పడ్డానని సలీంఖాన్ వెల్లడించారు.
ప్రవక్త మొహమ్మద్ ప్రతి మతం నుండి మంచి విషయాలను స్వీకరించారు. కోషర్ అని పిలిచే యూదుల నుండి స్వీకరించిన హలాల్ మాంసాన్ని మాత్రమే తినడం లాంటిది. ప్రతి మతం గొప్పది.. మనలాగే ఒక సుప్రీం శక్తిని నమ్ముతారని సలీంఖాన్ పేర్కొన్నారు. హిందూ అయిన సుశీలా చరక్ ని పెళ్లాడక ముందు నుంచి తన బాల్యంలో హిందూ సాంప్రదాయాలకు అలవాటు పడ్డానని అన్నారు. మా కాలనీ, పోలీస్ స్టేషన్ సహా అందరూ హిందువులే. అందుకే మేం హిందూ పండుగలను జరుపుకున్నామని సలీం ఖాన్ అన్నారు. నా పెళ్లి తర్వాతే ఇంట్లో గణపతిని ఉంచలేదు. నా కుటుంబం కూడా నా వివాహం విషయంలో అభ్యంతరం చెప్పలేదు. సుశీలా కుటుంబం మొదట్లో కొంత సంకోచించింది. కానీ ఆమె తండ్రి సలీం ఖాన్ విలువలు చూసాక అతడిని గౌరవించడం ప్రారంభించారు. ``నేను మంచి కుటుంబం నుండి వచ్చానని, బాగా చదువుకున్నానని ఆయన గౌరవించారు. నా మతం మాత్రమే తన అభ్యంతరమని ఆయన నాకు స్పష్టంగా చెప్పారు. మాకు అభిప్రాయభేదాలు లేదా తగాదాలు వచ్చినా, నా భార్య, నేను మా మతాల కారణంగా విభేధించమని నేను అతడికి హామీ ఇచ్చాను! మేము వివాహం చేసుకుని 60 సంవత్సరాలు అయింది!`` అని తెలిపారు.
