50 ఏళ్ల ప్రస్థానానికి సరిపడే గిఫ్ట్ ఈ శంబాల! - సాయికుమార్
డైలాగ్ కింగ్ సాయికుమార్ ఆల్ రౌండర్ నైపుణ్యం గురించి చెప్పాల్సిన పని లేదు. ఆయన డబ్బింగ్ కళాకారుడిగా, నటుడిగా సుదీర్ఘ అనుభవం ఉన్న ప్రతిభావంతుడు.
By: Sivaji Kontham | 30 Dec 2025 12:23 AM ISTడైలాగ్ కింగ్ సాయికుమార్ ఆల్ రౌండర్ నైపుణ్యం గురించి చెప్పాల్సిన పని లేదు. ఆయన డబ్బింగ్ కళాకారుడిగా, నటుడిగా సుదీర్ఘ అనుభవం ఉన్న ప్రతిభావంతుడు. పరిశ్రమలో ప్రవేశించి దాదాపు ఐదు దశాబ్ధాల కెరీర్ రన్ పూర్తి చేసారు. యాథృచ్ఛికంగా ఆయన యాభై ఏళ్ల సినీ జర్నీని పురస్కరించుకుని నటవారసుడు ఆది సాయికుమార్ అందించిన చిరస్మరణీయమైన విజయం ఇప్పుడు తెలుగు చిత్రసీమలో చర్చగా మారింది.
ఆది సాయికుమార్ నటించిన `శంబాల` గ్రాండ్ సక్సెస్ ఈవెంట్లో సాయికుమార్ మాట్లాడుతూ ఎంతో ఎమోషనల్ అయ్యారు. తనయుడి విజయం తన 50 వసంతాల కెరీర్ ప్రయాణానికి సంతోషాన్నిచ్చే, నిజమైన నివాళిగా భావిస్తున్నట్టు ఆయన ఉద్వేగంగా చెప్పారు. ఆది సాయికుమార్ చాలా కాలంగా ఎదురు చూస్తున్న విజయమిది. ఈ విజయం కోసం తన కుటుంబం చాలా కాలంగా ఎదురు చూస్తోందని సాయికుమార్ అన్నారు. ఎట్టకేలకు ఆది కెరీర్ లో సంతృప్తికరమైన విజయాన్ని అందుకున్నాడు. జయాపజయాలు ఉంటాయి. కానీ ఎలాంటి ప్రదర్శన ఇచ్చావు అన్నదే ముఖ్యమని అమ్మ చెబుతుండేది. నేను కూడా దానినే ఆదికి కూడా చెబుతుంటానని తెలిపారు.
సాయికుమార్ మాట్లాడుతూ-``సినిమాలో పుట్టి సినిమానే ప్రపంచంగా 50ఏళ్ల సినీప్రస్థానం పూర్తి చేసాను. ఈ స్వరం నాన్నగారిది అయితే సంస్కృతి సంప్రదాయం అమ్మ ఇచ్చినది. 50ఏళ్ల సినీప్రస్థానంలో ఈ యాభై ఏళ్లకు సరిపడా మీరంతా నాకు ఇచ్చిన పెద్ద గిఫ్ట్ ఈ శంబాల గిఫ్ట్. ప్రేమ కావాలి తో ఆది మీ ముందుకు వచ్చాడు. వెంకట్-అచ్చిరెడ్డి-విజయ్ భాస్కర్, చోటా, అనూప్ వాళ్ల టీమ్ అందరికీ థాంక్స్. ఆది అక్కడి నుంచి మొదలై జయాపజయాలను చవి చూసాడు. ఇవన్నీ మామూలే. నేను హీరోగా చేసినప్పుడు అమ్మ ఒక మాట అంది. ``నీ సినిమా ప్లాపవ్వొచ్చు కానీ నీ ప్రయత్నం ఫ్లాపవ్వకూడదు అని``. నటుడిగా పరకాయం చేసి నీ బెస్ట్ ఇవ్వు. ఒక్క సీన్ అయినా.. మొత్తం సినిమాలో హీరో అయినా అదరగొట్టాలని అమ్మ చెప్పేది. అదే ఆదికి చెప్పాను. ఎప్పటికి ఆది మంచి విజయం అందుకుంటాడు? అని ఎదురు చూస్తుంటే, నా ఈ 50 ఏళ్ల కెరీర్ జర్నీ పూర్తి చేసుకున్న వేళ శంబాల రావడం ఆనందంగా ఉంది.
అమ్మ చెప్పేది.. మనం ఇచ్చే ప్రతిదీ వెనక్కి వస్తుందని అంటారు. అమ్మా నాన్న ఇచ్చినది ఆశీస్సులుగా మారి మమ్మల్ని ఆనందంగా ఉంచిది. శంభాల అద్భుతంగా ఉందని .. ఆది అదిరిపోయే కంటెంట్ ఇచ్చాడని అందరూ ప్రశంసిస్తున్నారు. ఇండస్ట్రీలో సన్నిహితులంతా ఆది హిట్టు కొట్టాడని అంటుంటే ఆనందంగా ఉంది. నిర్మాత బావుంటే ఇండస్ట్రీ బావుంటుంది. నిర్మాతకు తిరిగి డబ్బు వచ్చేస్తే అదే హిట్టు. అలాంటిది ఈ చిత్ర నిర్మాతలు ఈ కథను ఎన్నుకోవడం నిజంగా గ్రేట్`` అని అన్నారు. యుగంధర్ ముని దర్శకత్వంలో షైనింగ్ పిక్చర్స్ పతాకంపై మహీందర్ రెడ్డి, రాజశేఖర్ నిర్మించారు.
