అందుకే ఈ కఠిన నిర్ణయం..
సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఎక్కువగా సినిమా ఈవెంట్లలోనే కాకుండా ఎక్కువగా డబ్బున్న వాళ్ళ ఈవెంట్లకి కూడా వెళ్తూ సందడి చేస్తూ ఉంటారు.
By: Madhu Reddy | 18 Dec 2025 5:00 AM ISTసినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఎక్కువగా సినిమా ఈవెంట్లలోనే కాకుండా ఎక్కువగా డబ్బున్న వాళ్ళ ఈవెంట్లకి కూడా వెళ్తూ సందడి చేస్తూ ఉంటారు. ముఖ్యంగా బిలియనీర్లు ఏదైనా ఈవెంట్ నిర్వహిస్తున్నారు అంటే ఆ ఈవెంట్లలో మన సెలబ్రిటీలు ఆడిపాడుతూ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఇటీవల అనంత్ అంబానీ వివాహం జరిగినప్పుడు కూడా బాలీవుడ్ మొదలుకొని హాలీవుడ్ వరకు ఎంతో మంది సెలబ్రిటీలు ఈ వివాహ వేడుకలో చిందేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఇలాంటి ట్రెండ్ కి తాను పులిస్టాప్ పెట్టబోతున్నాను అని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్.
అయితే ఈ కఠిన నిర్ణయం తీసుకోవడం వెనుక అసలు కారణాన్ని కూడా ఆయన తెలియజేశారు. "కెరియర్ ప్రారంభంలో నేను ఎన్నో వివాహ వేడుకల్లో పాల్గొని ఆడి పాడేవాడిని. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. అలా చేయడం నాకే అసౌకర్యంగా అనిపిస్తుంది. ఎందుకంటే దానికి వయసు కూడా ఒక కారణం కావచ్చు. ముఖ్యంగా మనల్ని మనం ఎంటర్టైనర్లుగా భావించి మనకు బంధువులు కానీ ఇతరుల పెళ్లిళ్లలో డాన్స్ చేస్తే చూడడానికి మన కుటుంబ సభ్యులు కూడా ఇబ్బంది పడతారు. అందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నాను. ఇకపై ఇలాంటి ట్రెండ్ ని నేను ప్రోత్సహించాలని అనుకోవడం లేదు. పైగా బిలియనీర్ల పెళ్లిళ్లకు హాజరయ్యి ప్రదర్శనలు ఇవ్వాలని అనుకోవడం లేదు" అంటూ తెలిపారు సైఫ్ అలీ ఖాన్ .
ఇక ప్రస్తుతం సైఫ్ అలీఖాన్ తీసుకున్న ఈ నిర్ణయం పై పలువురు నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. మీ నిర్ణయం సరైనదే.. కుటుంబ సభ్యుల కోసం ఆలోచించిన తీరుకు మెచ్చుకోవాల్సిందే అంటూ ఆయనపై కామెంట్లు చేస్తున్నారు. అయితే సైఫ్ అలీఖాన్ ఈ నిర్ణయం తీసుకోవడానికి మరో కారణం కూడా ఉంది అని ఆయనే స్వయంగా చెప్పుకొచ్చారు. ముఖ్యంగా తన మేనత్తే తనను అవమానించింది అని గుర్తు చేసుకున్నారు. తాను ఒకసారి బొంబాయిలో జరిగిన ఒక పెళ్లిలో నృత్యం చేస్తుండగా తన అత్త తనను అవమానించిందని చెబుతూ.."నేను ఒక పెళ్ళిలో నృత్యం చేస్తున్నాను. అప్పుడు మా అత్త (నాన్న సోదరి) చాలా రాజరిక మహిళ. వేదిక వెనుక నుండి వచ్చి ఈ పెళ్లిలో డాన్స్ చేస్తున్నావ్.. కానీ నువ్వు ఎవరో ఎవరికీ చెప్పకు" అని అవమానించింది అంటూ ఆయన తెలిపారు.
ఎందుకంటే సైఫ్ రాజవంశం నుండి వచ్చిన వ్యక్తి.. సినీ నటుడిగా ఉండడం అలాగే ఉన్నత సామాజిక వర్గాలకు చెందిన వ్యక్తిగా ఉండడం మధ్య ఉన్న అంతరాన్ని ఎత్తి చూపిస్తోందని తెలుస్తోంది. ఏదేమైనా రాజ వంశం నుండి వచ్చిన సైఫ్ అలీ ఖాన్ ఇలా నటుడిగా ఇతరుల పెళ్లిలలో డాన్స్ చేయడాన్ని తన అత్త అవమానంగా ఫీల్ అవ్వడమే కాకుండా తనను అవమానించింది అంటూ కూడా ఆయన తెలిపారు..
సైఫ్ అలీ ఖాన్ విషయానికి వస్తే.. హిందీ నటుడిగా పేరు తెచ్చుకున్న ఈయన నేషనల్ అవార్డుతో పాటు ఏడు ఫిలింఫేర్ అవార్డులు అలాగే ఎన్నో అవార్డులను అందుకున్నారు. 2010లో అత్యున్నత నాల్గవ భారతీయ పౌర పురస్కారమైన పద్మ శ్రీని కూడా సొంతం చేసుకున్నారు.. 1993లో వచ్చిన ఖాన్ పరంపర లో తన నటనా రంగ ప్రవేశం చేసిన ఈయన.. ఆ తర్వాత బాలీవుడ్ లోనే వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. క్రైమ్ డ్రామాల నుండి యాక్షన్ థ్రిల్లర్ ల వరకు అలాగే కామిక్ రొమాన్స్ వరకు వివిధ రకాల చలన చిత్రాలకు పెట్టింది పేరుగా నిలిచారు. ఇప్పటికే వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు.
