ఒకే పేరుకు మూడు కథలు? సైఫ్ తాజా వ్యాఖ్యలతో మొదలైన కొత్త చర్చ!
అయితే ఈ కామెంట్స్ గతంలో ఆయన చెప్పిన మాటలకే కాకుండా, కరీనా కపూర్ ఇచ్చిన పాత ఇంటర్వ్యూకు కూడా భిన్నంగా ఉండటంతో సోషల్ మీడియాలో కొత్త చర్చ మొదలైంది.
By: Sravani Lakshmi Srungarapu | 30 Jun 2026 10:00 PM ISTబాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ మరోసారి తన పెద్ద కుమారుడు తైమూర్ అలీ ఖాన్ పేరు కారణంగా వార్తల్లో నిలిచారు. వియ్ ది విమెన్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, తైమూర్ అనే పేరు ఎలా ఎంపిక చేశామనే విషయంపై కొత్త వివరణ ఇచ్చారు. అయితే ఈ కామెంట్స్ గతంలో ఆయన చెప్పిన మాటలకే కాకుండా, కరీనా కపూర్ ఇచ్చిన పాత ఇంటర్వ్యూకు కూడా భిన్నంగా ఉండటంతో సోషల్ మీడియాలో కొత్త చర్చ మొదలైంది. తమ పక్కింట్లో తైమూర్ అనే పేరున్న ఓ బాబు ఉండేవాడని, ఆ పేరు తమకు బాగా నచ్చిందని చెప్పారు. తైమూర్ అంటే ఐరన్ అని అర్థమని, ఆ పేరుకు ఉన్న అర్థం, వినడానికి బాగుండటంతో తాను, కరీనా కలిసి అదే పేరును ఎంపిక చేశామని, భారతదేశంపై దాడి చేసిన టర్కిష్ పాలకుడితో ఈ పేరును చాలా మంది అనుసంధానం చేస్తారని అప్పట్లో తమకు తెలియదని సైఫ్ వెల్లడించారు.
అయితే ఈ వీడియో వైరల్ అయిన వెంటనే కరీనా కపూర్ గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ అయింది. ఆ ఇంటర్వ్యూలో కరీనా, తైమూర్ పేరు సెలెక్షన్ వెనుక సైఫ్‌కు చరిత్రపై ఉన్న ఆసక్తే ప్రధాన కారణమని చెప్పారు. సైఫ్‌కు చరిత్ర అంటే చాలా ఇష్టమని, ముఖ్యంగా యోధుల గురించి ఎక్కువగా చదువుతుంటాడని, చిన్నప్పటి నుంచే తైమూర్ గురించి చదివాడని, ఆ కారణంగానే ఆ పేరు ఎంపిక చేశాడని కరీనా అప్పట్లో చెప్పారు.
ఇదిలా ఉండగా, 2016లో తైమూర్ పుట్టిన తర్వాత పేరు చుట్టూ వివాదం చెలరేగిన సమయంలో సైఫ్ కూడా మరో వివరణ ఇచ్చారు. అప్పట్లో ఇచ్చిన ఇంటర్వ్యూలో, తుర్కీ పాలకుడు తిమూర్ చరిత్ర గురించి తనకు తెలుసని, కానీ తమ కొడుకు పేరు తైమూర్ అని, ఇది ప్రాచీన పర్షియన్ పదమని, దీని అర్థం ఐరన్ అని, ఆ పేరు శబ్దం, అర్థం రెండూ తమకు నచ్చాయని చెప్పారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆ చారిత్రక అనుబంధం గురించి మాకు తెలియదని సైఫ్ చెప్పడం తన పాత కామెంట్స్ కు విరుద్ధంగా ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. దీంతో తైమూర్ పేరుని సెలెక్ట్ చేయడంపై గతంలో చెప్పిన వివరణలు, ప్రస్తుతం చెప్పిన మాటల మధ్య ఉన్న తేడాపై సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ సాగుతోంది.
2016 డిసెంబర్ 20న తైమూర్ అలీ ఖాన్ పుట్టినప్పటి నుంచే అతని పేరు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారి తీసింది. మధ్య ఆసియా విజేత తిమూర్‌తో ఈ పేరును లింక్ చేస్తూ విమర్శలు రావడంతో సైఫ్, కరీనా పలుమార్లు వివరణ ఇవ్వాల్సి వచ్చింది. తర్వాత వారి రెండో కొడుకు జహంగీర్ అలీ ఖాన్ పేరు కూడా కొంత వివాదానికి కారణమైంది. తాజా కామెంట్స్ తో తైమూర్ పేరు వివాదం మరోసారి వార్తల్లో నిలవడం మాత్రమే కాకుండా, ప్రముఖుల వ్యక్తిగత నిర్ణయాలు కాలక్రమేణా ఎలా కొత్త కోణాల్లో హాట్ టాపిక్ గా మారతాయో మరోసారి స్పష్టమైంది.
