Begin typing your search above and press return to search.

హీరోపై కత్తి దాడి వెనుక భయంకరమైన నిజాలు!

జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలనూ అనూహ్యమైన ఘడియలనూ ఎదుర్కొనే క్రమంలో కొన్ని ప్రమాదాలు మనుషుల మనసులపై చెరిగిపోని ముద్ర వేస్తాయి.

By:  Srikanth Kontham   |   14 Sept 2026 5:00 PM IST
హీరోపై కత్తి దాడి వెనుక భయంకరమైన నిజాలు!
X

జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలనూ అనూహ్యమైన ఘడియలనూ ఎదుర్కొనే క్రమంలో కొన్ని ప్రమాదాలు మనుషుల మనసులపై చెరిగిపోని ముద్ర వేస్తాయి. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ జీవితంలోనూ అలాంటి ఒక భయానక సంఘటన చోటుచేసుకుంది. ఆ కత్తి దాడి ఘటన జరిగి ఏడాదికి పైగా సమయం గ‌డిచినా? మానసికంగా తానింకా ఆ చేదు జ్ఞాపకాల నుంచి పూర్తిగా బయటపడలేకపోయానని సంచలన విషయాలను పంచుకున్నారు. తన కుటుంబం ఆ సంఘటన నుంచి త్వరగానే తేరుకున్నా? ఇప్పటికీ ఎక్కడైనా కత్తి చూస్తే భయంకరమైన రియాక్షన్ వస్తుందని సైఫ్ పేర్కొన్నారు.

ఆ దాడి సమయంలో తానెంత అదృష్టవంతుడో వివరించారు. `ఆ దాడిలో ఉపయోగించిన కత్తి నాణ్యమైనది కాకపోవడం వల్ల దాడి మధ్యలోనే అది విరిగిపోయింది. ఒకవేళ అది బలమైన కత్తి అయి ఉంటే నేను ఈరోజు ప్రాణాలతో ఉండేవాడిని కాదు` అని వెల్లడించారు. తీవ్ర గాయాలైనప్పటికీ బ్రతికి బయటపడటం అదృష్టమని గుర్తు చేసుకున్నారు. ఆ రోజు రక్తం ఓడుతున్న సమయంలో తనకు చావుపై ఎలాంటి భయం కలగలేదని సైఫ్ అన్నారు. ప్రాణాలు పోతాయేమోననే భయం కంటే? బ్రతికినా పక్షవాతం (పారాలిసిస్) వస్తుందేమోనన్న భయమే ఎక్కువగా కలచివేసిందన్నారు. ఆ సమయంలో తన జీవితం ఎంతో అద్భుతంగా సాగిందని తలచుకుంటూ ప్రశాంతంగానే ఉన్నానని.. కానీ శారీరక వైకల్యం వస్తుందేమోనన్న ఆలోచనే కలవరపెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ఘోర సంఘటన 2025 జనవరి 16 తెల్లవారుజామున బాంద్రాలోని సైఫ్ అలీ ఖాన్ నివాసంలో జరిగింది. ఫైర్ ఎస్కేప్ ద్వారా 12వ అంతస్తులోని ఆయన అపార్ట్‌మెంట్‌లోకి చొరబడిన దుండగుడు, మొదట సైఫ్ చిన్న కుమారుడు జెహంగీర్ సంరక్షణ చూసుకునే ఆయాను బెదిరించి కోటి రూపాయలు డిమాండ్ చేశాడు. ఆమె అరుపులు విని అక్కడికి చేరుకున్న సైఫ్ దుండగుడిని అడ్డుకునేందుకు యత్నించగా, ఆయనపై దాడి చేశాడు.

ఈ దాడిలో సైఫ్ శరీరంలో 6 చోట్ల తీవ్రమైన గాయాలయ్యాయి.

ముఖ్యంగా వెన్నుపాము తీవ్రంగా గాయపడటంతో పాటు 2.5 అంగుళాల కత్తి ముక్క సైప్ వెన్నుముకలో కూరుకుపోయింది. లీలావతి ఆసుపత్రిలో అత్యవసర శస్త్రచికిత్స చేసి ఆ ముక్కను తొలగించారు. అటుపై పోలీసులు నిందితుడు మహమ్మద్ షరీఫుల్ ఇస్లామ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి కోర్టు విచారణ కొనసాగుతోంది. నిందితుడు నేరాన్ని అంగీకరిస్తానని పిటిషన్ వేసినా? ముంబై సెషన్స్ కోర్టు దాన్ని తిరస్కరించి విచారణ వేగవంతం చేసింది.