గ్రీస్ వెకేషన్లో స్టార్‌కపుల్ రొమాన్స్.. వయసు ఒక అంకె మాత్రమే!
సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ తమ కుమారులు తైమూర్, జెహ్‌లతో కలిసి గ్రీస్‌లో గడిపిన వెకేషన్ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. సూర్యాస్తమయం, అక్కడి అందాల కంటే కరీనానే తన దృష్టిని ఆకర్షిస్తోందంటూ సైఫ్ సరదాగా కామెంట్స్ చేశారు. పిల్లల కోసం ట్రెజర్ హంట్ నిర్వహించడంతో పాటు, గ్రీస్ పర్యటనలో పుస్తక పఠనాన్ని కూడా ఆస్వాదించినట్లు తెలిపారు.
By: Sivaji Kontham | 18 Nov 2026 1:16 PM ISTబాలీవుడ్ స్టార్ కపుల్ సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ తమ కుమారులు తైమూర్, జెహ్‌లతో కలిసి ఇటీవల గ్రీస్‌లో గడిపిన మధుర క్షణాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఈ వెకేషన్‌కు సంబంధించిన అందమైన ఫోటోలతో పాటు సైఫ్ పెట్టిన రొమాంటిక్, ఫన్నీ క్యాప్షన్లు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. సూర్యాస్తమయాన్ని (Sunset) ఆస్వాదిస్తూ కరీనాతో దిగిన ఫోటోను షేర్ చేసిన సైఫ్.. "ఇక్కడ సూర్యాస్తమయమే హైలైట్ అవ్వాలి.. కానీ ఎవరో నన్ను డిస్ట్రాక్ట్ చేస్తున్నారు" అంటూ కరీనా అందాన్ని ఉద్దేశించి సరదాగా వ్యాఖ్యానించారు. అలాగే మరో ఫోటోలో కరీనాను చూపిస్తూ, "ఇక్కడి ఆర్కిటెక్చర్ చాలా బాగుంది.. కానీ ఈ వ్యూ (కరీనా) అంతకంటే బాగుంది" అంటూ తన భార్యపై ప్రేమను కురిపించారు.
ఈ పర్యటనలో తమ పిల్లలు తైమూర్, జెహ్‌ల కోసం సముద్ర తీరంలో ప్రత్యేకంగా 'ట్రెజర్ హంట్' (నిధి అన్వేషణ) నిర్వహించినట్లు సైఫ్ వెల్లడించారు. సముద్రపు అడుగున ఒక బాటిల్లో మ్యాప్ పెట్టి, దాని ఆధారంగా తీరంలో దాచిన బహుమతిని పిల్లలు కనిపెట్టేలా ప్లాన్ చేశామని, పిల్లలు ఈ ఆటను ఎంతో ఉత్సాహంగా ఆస్వాదించారని తెలిపారు. ఓడ ముందు నిల్చున్న తైమూర్, జెహ్ ఫోటోకు "ఈ సిబ్బంది చేతిలో ఉంటే ఓడ ఒడ్డుకు చేరినట్టే" అని, చేపలు పడుతున్న ఫోటోకు "తుఫానుకు ముందు ప్రశాంతత.. ఒకరినొకరు నీళ్లలోకి తోసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు" అంటూ సైఫ్ ఇచ్చిన ఫన్నీ క్యాప్షన్లు నవ్వులు పూయిస్తున్నాయి.
మరోవైపు, ఈ విహారయాత్రలో తమ పుస్తక పఠన అలవాటును కూడా సైఫ్-కరీనా కొనసాగించారు. కరీనా 'టాట్లర్' మ్యాగజైన్ చదువుతుండగా, తాను 'ది ఒడిస్సీ', 'గ్రీక్ మిథ్స్' పుస్తకాలు చదువుతున్న ఫోటోలను సైఫ్ పంచుకున్నారు. చిన్నతనంలో తన తండ్రి మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ తనకు గ్రీక్ పురాణ కథలు చదివి వినిపించేవారని గుర్తుచేసుకున్న సైఫ్.. 'ది ఒడిస్సీ'లో ఏజియన్ సముద్రం గురించి చదువుతూ, అదే సముద్రంలో ఈత కొట్టడం తన జీవితంలో మర్చిపోలేని అనుభూతి అని భావోద్వేగంగా రాసుకొచ్చారు.
