Begin typing your search above and press return to search.

ప్రిన్స్ విలియం ముందు సైఫ్ అలీఖాన్ బోల్డ్ కామెంట్స్!

ముంబైలో ప్రిన్స్ విలియంతో జరిగిన సమావేశంలో సైఫ్ అలీఖాన్ తన పటౌడీ కుటుంబ రాజరిక నేపథ్యంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్ రాజరిక వ్యవస్థను ఎప్పుడో దాటిందని స్పష్టం చేశారు. సినిమాలు, క్రికెట్, పర్యావరణ పరిరక్షణ, భారత్-యూకే సాంస్కృతిక సంబంధాలపై ఇద్దరూ చర్చించారు.

By:  Srikanth Kontham   |   19 Nov 2026 11:06 AM IST
ప్రిన్స్ విలియం ముందు సైఫ్ అలీఖాన్ బోల్డ్ కామెంట్స్!
X

బ్రిటన్ యువరాజు ప్రిన్స్ విలియం ముంబై పర్యటన సందర్భంగా బాలీవుడ్ ప్రముఖులతో కలిసిన తీరు.. అక్కడ జరిగిన ముచ్చట్లు దేశవ్యాప్తంగా ఆసక్తిని రేపుతున్నాయి. ముఖ్యంగా ధర్మా ప్రొడక్షన్స్ వేదికగా కరణ్ జోహార్.. కరీనా కపూర్‌లతో కలిసి సైఫ్ అలీఖాన్ పాల్గొన్న సమావేశంలో ఓ ఆసక్తికర అంశం తెరపైకి వచ్చింది. పటౌడీ కుటుంబానికి చెందిన రాజరిక నేపథ్యం గురించి ప్రస్తావన వచ్చినప్పుడు సైఫ్ ఇచ్చిన సమాధానం ఎంతో హుందాగా అంద‌రి దృష్టినీ ఆకర్షించింది. మన దేశంలో ఇప్పుడు రాజరిక వ్యవస్థ లేదని సైఫ్ చెప్పడం భేటీలో ప్రత్యేకంగా నిలిచింది.

సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన సైఫ్.. ప్రిన్స్ విలియంతో తమ సంభాషణ ఎంతో సరదాగా.. తేలిక పాటి ధోరణిలో సాగిందని వివరించారు. సినిమాలు, పాటలు, క్రికెట్ అంశాలపై చర్చించామని, ఇరు దేశాల మధ్య సాంస్కృతిక బంధాలను మరింత బలోపేతం చేసే విషయంపై మాట్లాడుకున్నామని తెలిపారు. తండ్రి, భారత మాజీ క్రికెట్ కెప్టెన్ మన్సూర్ అలీఖాన్ పటౌడీ ఇంగ్లండ్..భారత్‌లలో ఆడిన క్రికెట్ అనుభవాల గురించి కూడా ప్రస్తావన వచ్చిందని సైఫ్ పంచుకున్నారు. అయితే తమ రాయల్ బ్యాక్‌గ్రౌండ్ గురించి మాట వచ్చినప్పుడు భారత్ ఆ వ్యవస్థను ఎప్పుడో దాటి ముందుకు వెళ్లిపోయిందని సైప్ వెల్లడించారు.

పర్యావరణ పరిరక్షణ.. గ్రీన్ ఎనర్జీ కోసం ప్రిన్స్ విలియం చేస్తున్న కృషిని సైఫ్ మనస్ఫూర్తిగా ప్రశంసించారు. ఎర్త్‌షాట్ ప్రైజ్ వంటి వేదికలు ప్రపంచ సమస్యలకు పరిష్కారాలు చూపే దిశగా అద్భుతంగా పనిచేస్తున్నాయని అన్నారు. అదే సమయంలో బాలీవుడ్‌కు.. యూకేకు మధ్య దశాబ్దాలుగా ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఇటీవల యశ్ రాజ్ ఫిల్మ్స్ కుదుర్చుకున్న ఒప్పందం వంటి పరిణామాలతో భవిష్యత్తులో మరింత సహకారం అవసరమని అభిప్రాయపడ్డారు.

మారుతున్న బాలీవుడ్ కథాంశాలపైనా సైఫ్ అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పారు. ఒకప్పుడు మన సినిమాలు ఎక్కువగా ఎన్ఆర్ఐ ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని తెరకెక్కేవని.. కానీ ఇప్పుడు మన కథలు.. మన నేల.. మన సంస్కృతి వైపే ఎక్కువగా చూస్తున్నాయన్నారు. ఇలాంటి తరుణంలో భవిష్యత్తులో యూకే కథలు మన కథనంలో ఎలా ఇమిడిపోతాయో? చూడటం ఆసక్తికరంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. ఇక సైఫ్ అలీఖాన్ ఈ ఏడాది రెండు సినిమాల‌తో ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన సంగ‌తి తెలిసిందే. `క‌ర్త‌వ్య`..`హేవాన్` విడుద‌లైనా అవి ఆశించిన ఫ‌లితాలు సాధించ‌లేదు. ప్ర‌స్తుతం `హ‌మ్ హిందుస్తానీ` తో పాటు రితీష్ బ‌త్రాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ రెండు అన్ని ప‌నులు పూర్తి చేసుకుని వ‌చ్చే ఏడాది ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాయి.