సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్‌కు మరోసారి హత్య బెదిరింపులు రావడంతో ముంబై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 2024లో బాబా సిద్ధిఖీ హత్య కేసులో నిందితుడిగా ఉన్న జీషన్ అక్తర్ పేరుతో బెదిరింపులు వచ్చినట్లు సమాచారం. అతడే పంపాడా, మరెవరైనా పేరు వాడుకున్నారా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.
By: Priya Chowdhary Nuthalapti | 19 Nov 2026 3:37 PM ISTబాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్‌కు మరోసారి ప్రాణహాని బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. గతంలో ఆయనపై జరిగిన కత్తి దాడి ఘటనను అభిమానులు ఇంకా మర్చిపోలేదు. ఇప్పుడు మరోసారి సైఫ్‌ను చంపేస్తామంటూ బెదిరింపులు రావడం బాలీవుడ్లో హట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా 2024లో జరిగిన రాజకీయ నాయకుడు బాబా సిద్ధిఖీ హత్య కేసులో నిందితుడిగా ఉన్న జీషన్ అక్తర్ పేరుతో ఈ బెదిరింపులు వచ్చినట్లు ముంబై పోలీసు వర్గాలు వెల్లడించాయి.
పోలీసుల సమాచారం ప్రకారం.. సైఫ్ అలీ ఖాన్‌కు వచ్చిన బెదిరింపుల వెనుక జీషన్ అక్తర్ ఉన్నాడా..లేక అతడి పేరును ఉపయోగించి మరెవరైనా ఈ పని చేశారా.. అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ నెల ప్రారంభంలో బాలీవుడ్ నటులు తుషార్ కపూర్, ఆయుష్మాన్ ఖురానాలకు కూడా ఇలాంటి బెదిరింపులు వచ్చినట్లు సమాచారం. ఈ రెండు ఘటనలకు సంబంధించి పోలీసులు వైభవ్ మిశ్రా అనే 30 ఏళ్ల వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతడు బెంగళూరుకు చెందిన ఐఐటీ గ్రాడ్యుయేట్ అని తెలుస్తోంది. అయితే అతడికి ఎలాంటి క్రిమినల్ గ్యాంగ్‌తో సంబంధాలు లేవని పోలీసులు గుర్తించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి బెదిరింపులు పంపినట్లు ఆరోపణలు ఉన్నాయి. తాజా బెదిరింపులపై సైఫ్ అలీ ఖాన్ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
ఇక బాబా సిద్ధిఖీ హత్య విషయానికి వస్తే.. 2024 అక్టోబర్ 12న ముంబైలోని బాంద్రా ఈస్ట్‌లో తన కుమారుడు జీషన్ సిద్ధిఖీ కార్యాలయం బయట ఆయనను ముగ్గురు దుండగులు కాల్చి చంపారు. అప్పట్లో ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ పేరు కూడా తెరపైకి వచ్చింది. అమెరికా నుంచి భారత్‌కు వచ్చిన అనంతరం అతడిని జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అరెస్ట్ చేసింది. ప్రస్తుతం అతడు ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్నాడు.
సైఫ్ అలీ ఖాన్‌కు వచ్చిన తాజా బెదిరింపుల వెనుక అసలు వ్యక్తులు ఎవరన్నది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.
