విశ్వక్ సేన్‌తో విభేదాలపై ఓపెన్ అయిన సాయి రాజేష్!
తనకు, విశ్వక్ సేన్ మధ్య ఒకప్పుడు బహిరంగంగా చర్చకు వచ్చిన విభేదాలు ఇప్పుడు స్నేహంగా మారినట్లు డైరెక్టర్ సాయి రాజేష్ వెల్లడించారు.
By: Sravani Lakshmi Srungarapu | 9 Aug 2026 8:00 AM ISTతనకు, విశ్వక్ సేన్ మధ్య ఒకప్పుడు బహిరంగంగా చర్చకు వచ్చిన విభేదాలు ఇప్పుడు స్నేహంగా మారినట్లు డైరెక్టర్ సాయి రాజేష్ వెల్లడించారు. గతంలో బేబీ సినిమా టైమ్ లో జరిగిన ఒక అపార్థం తమ ఇద్దరి మధ్య దూరాన్ని పెంచినా, ఆ సంఘటనను ఇద్దరూ మెచ్యూర్డ్ గా అర్థం చేసుకుని ముందుకు సాగినట్లు ఆయన వివరించారు. బేబీ టైమ్ లో తాను కథ చెప్పడానికి వెళ్లినప్పుడు విశ్వక్ వినలేదని, ఆ విషయాన్ని తాను బయట చెప్పడంతో వివాదం మొదలైందని గుర్తు చేసుకున్నారు. తర్వాత విశ్వక్ ఆ విషయంపై క్లారిటీ ఇచ్చారని, ఆ సమయంలో ఇద్దరూ ఒకరినొకరు హర్ట్ చేసుకున్నామని చెప్పారు. అయితే అది ఉద్దేశపూర్వకంగా జరిగిన విషయం కాదని విశ్వక్ చెప్పారని, తాను కూడా ఆ సందర్భంలో ఓవర్ రియాక్ట్ కాకుండా ఉండాల్సిందని అంగీకరించినట్లు వెల్లడించారు.
ఆ తర్వాత జరిగిన సంభాషణలో విశ్వక్ సేన్ తనతో కలిసి సినిమా చేయాలని ప్రతిపాదించారని సాయి రాజేష్ తెలిపారు. ఆ సందర్భాన్ని గుర్తు చేస్తూ, అర్థరాత్రి మాట్లాడిన మాటలు అర్థరాత్రిలాగానే ఉంటాయి. ఉదయం గుర్తొచ్చాక ఆలోచిద్దామని తాను చెప్పినట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా, ఎవరు ముందుగా ఫోన్ చేస్తే వారికి సినిమా చేయాలనే ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉన్నట్లు భావిద్దామని సరదాగా మాట్లాడుకున్నామని చెప్పారు.
ఉదయం లేచిన తర్వాత ఆ మాట గుర్తొచ్చినా, హీరో దగ్గర అడ్వాంటేజ్ తీసుకున్నట్లుగా అనిపించకూడదనే ఉద్దేశంతో తాను ఫోన్ చేయలేదని సాయి రాజేష్ వెల్లడించారు. అయితే కొంతసేపటికే విశ్వక్ సేన్ స్వయంగా ఫోన్ చేసి, నాకే ఎక్కువ పర్సంటేజ్ ఇష్టం ఉంది. ఎప్పుడు సినిమా చేద్దామని అడిగారని తెలిపారు. ఆ ఫోన్ కాల్ తర్వాత తమ మధ్య ఉన్న దూరం పూర్తిగా తొలగిపోయిందని సాయి రాజేష్ చెప్పారు.
ప్రస్తుతం విశ్వక్ సేన్ అంటే తనకు చాలా ఇష్టమని సాయి రాజేష్ స్పష్టం చేశారు. గతంలో వివాదంగా కనిపించిన విషయం ఇప్పుడు ఒక మంచి అవగాహనకు దారితీసిందని ఆయన మాటల ద్వారా అర్థమవుతోంది. ఇండస్ట్రీలో అపార్థాలు వచ్చినా, మాటల ద్వారా సంబంధాలు మళ్లీ బలపడగలవని ఈ ఉదాహరణ చూపిస్తోందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. కాగా రీసెంట్ గా చెన్నై లవ్ స్టోరీ సినిమాతో నిర్మాతగా సాయి రాజేష్ మంచి సక్సెస్ ను అందుకున్న నేపథ్యంలో, ఆయన, విశ్వక్ సేన్ తో సినిమా చేస్తే అది ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌గా మారే అవకాశాలున్నాయని టాలీవుడ్‌లో చర్చ సాగుతోంది.
