డైరెక్టర్‌కి ఇల్లు కొనిచ్చాడు.. ఇదేనేమో హృదయ కాలేయ సంబంధం!
చిత్ర పరిశ్రమలో కేవలం విజయాలు- పారితోషికాలే కాకుండా కొన్ని అనుబంధాలు హృదయాన్ని తాకుతాయి.
By: Sivaji Kontham | 15 Aug 2026 9:08 AM ISTచిత్ర పరిశ్రమలో కేవలం విజయాలు- పారితోషికాలే కాకుండా కొన్ని అనుబంధాలు హృదయాన్ని తాకుతాయి. అలాంటి ఒక అరుదైన ఆత్మీయమైన బంధం దర్శకుడు సాయి రాజేష్ నీలం, నటుడు సంపూర్ణేష్ బాబు (సంపత్) మధ్య ఉంది. 2014లో సాయి రాజేష్ దర్శకత్వంలో వచ్చిన `హృదయ కాలేయం` అనే పేరడీ చిత్రంతో సంపూర్ణేష్ బాబు కథానాయకుడిగా పరిచయమయ్యారు. కేవలం రూ. 1.5 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 4 కోట్లు వసూలు చేసి ఊహించని విజయాన్ని సాధించింది. ఈ సినిమా అందించిన గుర్తింపుతో వీరిద్దరి మధ్య ఉన్న బంధం కేవలం దర్శకుడు- నటుడి స్థాయిని దాటి ఒక ఆత్మీయ సంబంధంగా మారింది.
తాజాగా ఓ వేదికపై దర్శకుడు సాయి రాజేష్... సంపూతో ఉన్న పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. సంపూర్ణేష్ బాబు తొలినాళ్లలో కథా చర్చల కోసం సిద్దిపేట నుండి సికింద్రాబాద్ వచ్చేవారని ఆయన తెలిపారు. రోజంతా కథ గురించి మాట్లాడుకున్న తర్వాత సాయంత్రం జేఎన్‌జే బస్ స్టాప్ దగ్గర దింపే సమయంలో ఊరికి వెళ్లడానికి జేబులో డబ్బులు కూడా లేవని సంపూ చెప్పడంతో తన దగ్గరున్న రూ. 500లో రూ. 200 తీసి ఇచ్చేవాడినని సాయి రాజేష్ ఆనాటి కష్టాలను వర్ణించారు.
అయితే 2018లో సంపూర్ణేష్ బాబు చేసిన ఒక పని సాయి రాజేష్‌ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. అప్పట్లో సాయి రాజేష్‌కు సొంత ఇల్లు లేకపోవడంతో సునీల్ బాయ్ రూమ్‌లో లేదా ఆఫీస్‌లోనే ఉండేవారని తెలుసుకున్న సంపూ భార్య ఆయనతో మాట్లాడారట. ఆ తర్వాత సాయి రాజేష్‌కు అసలు చెప్పకుండానే బిల్డర్ వద్దకు వెళ్లి అడ్వాన్స్‌గా ఏకంగా రూ. 12 లక్షలు చెల్లించి వచ్చాడు సంపూ. ``ఇంకొక రూ. 13 లక్షలు నువ్వు కట్టు... లేకపోతే నా రూ. 12 లక్షలు పోతాయి.. నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో`` అంటూ సాయి రాజేష్‌పై ఒత్తిడి తెచ్చాడని ఆ సందర్భాన్ని గుర్తుచేసుకున్నారు.
ఆ సమయంలో తన వద్ద సినిమాలు ఊహించడానికి తప్ప మిగిలిన రూ. 13 లక్షలు కట్టడానికి అసలు డబ్బులు లేవని... సంపూ చేసిన పనికి అప్పట్లో చాలా కోపం వచ్చిందని సాయి రాజేష్ తెలిపారు. కానీ ఎలాగోలా కష్టపడి ఆ ఇల్లు కొనుక్కున్నానని.. నేడు ఆ ఇంటి విలువ మరో రూ. 30 లక్షలు పెరిగిందని నవ్వుతూ చెప్పారు. తనకు ఇల్లు కొనిచ్చే స్తోమత లేకపోయినా... తన గురించి ఆలోచించి సంపూర్ణేష్ బాబు చూపించిన ఆ ప్రేమాభిమానం మాటల్లో చెప్పలేనిదని ఆయన కొనియాడారు.
చివరగా సినిమా పరిశ్రమలో ఎదుగుబొదుగులపై మాట్లాడుతు సాయి రాజేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ``ఇక్కడ ఎవ్వడూ పెద్దోడూ కాదు. ఎవ్వడూ చిన్నోడూ కాదు. నాకు `బేబీ` సినిమా వచ్చి నేను మళ్లీ లేచాను.. సంపూకి కొద్దిగా గ్రాఫ్ తగ్గినట్టు ఉండవచ్చు. కానీ రేపు నేను మళ్లీ కింద పడినా నాకు కాపాడటానికి సంపూ ఉన్నాడు! అంటూ వీరిద్దరి మధ్య ఉన్న నిస్వార్థమైన అనుబంధాన్ని, నిజమైన `హృదయ కాలేయ`బంధాన్ని అందరికీ చాటిచెప్పారు.
