బాధపెట్టందే థియేటర్ నుంచి బయటకి రానివ్వను: సాయి రాజేష్
అప్పట్లో తన దగ్గర ఉన్న ఐవా వాక్ మ్యాన్ తో పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్స్ వింటూ ఇక్కడి రోడ్ల మీద తిరుగుతూ కథలు రాసుకునేవాడినని సాయి రాజేష్ చెప్పారు.
By: M Prashanth | 21 Jun 2026 10:29 AM ISTకిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ జంటగా నటించిన చెన్నై లవ్ స్టోరీ మ్యూజికల్ ఫెస్ట్ తిరుపతిలో అట్టహాసంగా జరిగింది. ఈ సినిమాకు నిర్మాతగా, కథా రచయితగా వ్యవహరించిన సాయి రాజేష్ ఈ ఈవెంట్ లో ఎమోషనల్ గా మాట్లాడారు. తిరుపతి తనకు సెకండ్ హోమ్ లాంటిదని, టెన్త్, ఇంటర్ చదువుకునే రోజుల్లో చదువు మీద ఆసక్తి లేక సినిమాల్లోకి రావాలని నెల్లూరు నుంచి రాత్రి 12 గంటల ప్యాసింజర్ రైలెక్కి 27 రూపాయల టికెట్ తో ఇక్కడికి వచ్చేవాడినని తన పాత రోజులను గుర్తు చేసుకున్నారు.
అప్పట్లో తన దగ్గర ఉన్న ఐవా వాక్ మ్యాన్ తో పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్స్ వింటూ ఇక్కడి రోడ్ల మీద తిరుగుతూ కథలు రాసుకునేవాడినని సాయి రాజేష్ చెప్పారు. దాదాపు 30, 40 సార్లు తిరుమల కొండ ఎక్కానని, ఎక్కడెక్కడి నుంచో వచ్చే తమిళ పోస్టర్లు చూస్తూ తిరుపతి వీధుల్లో తిరిగేవాడినని తెలిపారు. అప్పటి ఆ తిరుపతి వాతావరణం ఎంత బ్యూటిఫుల్ గా ఉండేదో, ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ సినిమా కూడా అంతే బ్యూటిఫుల్ గా ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు.
తన ప్రతి సినిమా తిరుపతికి వచ్చి ఇక్కడి నుంచే మొదలుపెట్టడం ఆనవాయితీగా వస్తోందని, కానీ ఈసారి రిలీజ్ కు ముందే ఇక్కడికి వచ్చి సెలబ్రేట్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈవెంట్ కు ఎంత మంది వస్తారో అని తనకు భయం ఉండిందని, కానీ ఎస్కేఎన్, ధీరజ్ లకు ఉన్న ఏకైక ధైర్యం కిరణ్ అబ్బవరం అని ఆయన అన్నారు. కిరణ్ అభిమానులు ఎంతో ప్రౌడ్ గా చెప్పుకునే సినిమా ఇదని, తానైతే ఆర్ఆర్ఆర్ థియేటర్ లో కూర్చుని తన హీరో పెర్ఫార్మెన్స్ చూసి ఎంతో గర్వంగా ఫీల్ అయ్యానని ప్రశంసించారు.
యాంకర్ స్టీవెన్ శంకర్ అనగానే తాను కంగారు పడ్డానని, కిరణ్ క్యారెక్టర్ పేరు స్టీవెన్ శంకర్ అయినా, అసలు ఆ పేరు తనదేనని సాయి రాజేష్ ఒక సీక్రెట్ రివీల్ చేశారు. టాలెంట్ లేని డైరెక్టర్ ని అవ్వాలనుకున్నప్పుడు తమిళ ఇండస్ట్రీకి వెళ్లి స్టీవెన్ స్పీల్ బర్గ్ లో సగం, శంకర్ లో సగం కలిపి స్టీవెన్ శంకర్ అని పేరు పెట్టుకున్నానని నవ్వించారు. కలర్ ఫోటో, బేబీ సినిమాలకే తన ఒరిజినల్ పేరు వేసుకున్నానని తెలిపారు.
సినిమా మొత్తం హీరోయిన్ చుట్టూ నడుస్తుందని, ఈ కథకు గౌరీ లాంటి తెలుగమ్మాయి దొరకడం దర్శకుడు రవి అదృష్టం, తన అదృష్టం అని సంతోషం వ్యక్తం చేశారు. తొలి సినిమా నుంచి తెలుగమ్మాయిలనే హీరోయిన్లుగా పెట్టుకుంటూ వస్తున్నామని, కథ వినగానే గౌరీ అరగంటలోనే ఒకే చెప్పేసిందని ఆయన గుర్తు చేసుకున్నారు. మణిశర్మ గారి ఏవీ చూసినప్పుడు తన మనసు సంతోషంతో నిండిపోయిందని, ఆయన మళ్ళీ ఇండస్ట్రీని ఏలేయాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
అందరూ ఈ సినిమాను బేబీతో కంపేర్ చేస్తున్నారని, మళ్ళీ బేబీ లాంటి సినిమా రాదు కదా అని అడుగుతున్నారని, కానీ బేబీ మళ్లీ వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ సినిమా సెకండ్ హాఫ్ చాలా సర్ప్రైజింగ్ గా, మోర్ ఇంటెన్స్ గా, మోర్ ఎమోషనల్ గా ఉంటుందని చెప్పారు. ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టించందే, బాధపెట్టందే థియేటర్ నుంచి బయటకి రానివ్వనని చెన్నై లవ్ స్టోరీ క్లైమాక్స్ పై తన కాన్ఫిడెన్స్ ను గట్టిగా తెలియజేశారు.
