సీతాదేవి పాత్రపై విమర్శలు.. 'ఇఫీ' వేదికగా సాయిపల్లవి సమాధానం ఇదే!
గోవాలో ప్రారంభమైన 57వ ఇఫీ వేడుకల్లో సాయి పల్లవికి ప్రేక్షకులు, సినీ ప్రముఖుల నుంచి భారీ స్పందన లభించింది. ఆమె పేరు వినిపించగానే స్టేడియం చప్పట్లతో మార్మోగింది. ‘రామాయణం’లో సీత పాత్రపై గతంలో వచ్చిన విమర్శలకు ఈ ఆదరణ సమాధానంగా నిలిచింది. నవంబర్ 28 వరకు జరిగే ఈ వేడుకల్లో 86 దేశాలకు చెందిన 159 అంతర్జాతీయ చిత్రాలు ప్రదర్శించనున్నారు.
By: Sivaji Kontham | 22 Nov 2026 12:23 AM ISTగోవాలో శుక్రవారం 57వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఐ.ఎఫ్.ఎఫ్.ఐ) ప్రరంభమైంది. ఈ వేదికపై నేచురల్ బ్యూటీ సాయి పల్లవికి దక్కిన ప్రశంసలు ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. నితేష్ తివారీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన `రామాయణం` చిత్రంలో సీతాదేవి పాత్రకు సాయి పల్లవి రూపం సరిపోదని.. తన నటన మెప్పించలేదని గతంలో కొందరు విమర్శకులు పెదవి విరిచారు. అయితే అలాంటి విమర్శలన్నింటికీ గోవా అంతర్జాతీయ సినీ వేదికపై ప్రేక్షకులు, సినీ ప్రముఖులు బ్రహ్మరథం పట్టిన విధానమే సరైన సమాధానంగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా తరలివచ్చిన సినీ దిగ్గజాల సమక్షంలో సాయి పల్లవికి పీక్స్ లో హర్షధ్వానాలు లభించడం ఆషామాషీ విషయం కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ ఇండోర్ స్టేడియంలో అట్టహాసంగా జరిగిన ఈ ప్రారంభోత్సవ వేడుకకు ప్రముఖ దర్శకుడు అశుతోష్ గోవారికర్ ఫెస్టివల్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. సభా ప్రాంగణంలో సాయి పల్లవితో పాటు కార్తీక్ ఆర్యన్, రవి కిషన్, హనుమాన్ అన్ష్, దర్శకుడు డాక్టర్ విశాల్ చతుర్వేది తదితరులు సందడి చేశారు. ఎంతోమంది స్టార్లు హాజరైనా.. సాయి పల్లవి పేరు వినిపించగానే స్టేడియం మొత్తం చప్పట్లు- కేరింతలతో మార్మోగడం సీత పాత్రలో తనపై ప్రేక్షకులకు ఉన్న నమ్మకాన్ని, అభిమానాన్ని చాటిచెప్పింది. విమర్శలు ఉన్నా.. ప్రతిష్ఠాత్మక `రామాయణం` ఫ్రాంఛైజీకి సాయిపల్లవి ప్రతిభ అదనపు అస్సెట్ అయిందనే ప్రశంసల్ని విస్మరించకూడదు.
ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన నటుడు రవి కిషన్ హిందీ, భోజ్‌పురి, తెలుగు సహా పలు భారతీయ భాషల్లో దాదాపు 700 చిత్రాలతో కూడిన తన 34 ఏళ్ల సుదీర్ఘ సినీ ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. మరోవైపు మూడుసార్లు గ్రామీ అవార్డు విజేత రిక్కీ కేజ్ భారతీయ వాద్యాలతో ది గాడ్‌ఫాదర్, పారాసైట్, పతేర్ పాంచాళి, లగాన్ వంటి విశ్వవిఖ్యాత చిత్రాల థీమ్ మ్యూజిక్‌ను వినిపించి ఆకట్టుకున్నారు. ఇంటర్నేషనల్ జ్యూరీ హెడ్ ఆనంద్ ఎల్. రాయ్, ఇండియన్ పనోరమా జ్యూరీ ఛైర్మన్లు మధుర్ భండార్కర్, హిమాన్షు శేఖర్ ఖటువా కూడా ఈ వేడుకలో భాగమయ్యారు.
ఏది ఏమైనా.. అంతర్జాతీయ స్థాయి సినీ వేదికపై సాయి పల్లవికి దక్కిన ఈ గౌరవం.. తన సహజ నటనకు దక్కిన మరో విజయంగా చెప్పుకోవచ్చు. `రామాయణం`లో సీతాదేవిగా సాయిపల్లవి ఎంపికపై సందేహాలు వ్యక్తం చేసిన విమర్శకుల నోళ్లు మూయిస్తూ.. ఇఫీ వేదికపై లభించిన ఈ ఘన స్వాగతం సాయి పల్లవి స్థాయిని మరో మెట్టు పైకి తీసుకెళ్లింది.
1400 ఎంట్రీలు.. 86 దేశాలు...!
నవంబర్ 28 వరకు కొనసాగనున్న ఈ 57వ ఇఫీ చిత్రోత్సవం.. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ దర్శకుడి పురస్కారాన్ని అందుకున్న పావెల్ పావ్లికోవ్‌స్కీ చిత్రం `ఫాదర్‌ల్యాండ్` ప్రదర్శనతో ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా 1400కు పైగా ఎంట్రీల నుంచి ఎంపికైన 86 దేశాలకు చెందిన 159 అంతర్జాతీయ చిత్రాలతో పాటు.. 18 భారతీయ భాషలకు చెందిన 76 సినిమాలు ఈ వేడుకలో ప్రదర్శనకు సిద్ధంగా ఉన్నాయి.
