సాయిపల్లవికి గోల్డెన్ ఛాన్స్.. కానీ వాళ్లకు రిస్కే
ఒక సినిమా కోసం ఎదురుచూస్తున్న సమయంలో మరో సినిమా వచ్చేస్తే.. అది హీరో, హీరోయిన్ కు ప్లస్ అవుతుందా, మైనస్ అవుతుందా అనేది ఇంట్రెస్టింగ్ విషయమే.
By: M Prashanth | 3 Oct 2026 3:17 PM ISTఒక సినిమా కోసం ఎదురుచూస్తున్న సమయంలో మరో సినిమా వచ్చేస్తే.. అది హీరో, హీరోయిన్ కు ప్లస్ అవుతుందా, మైనస్ అవుతుందా అనేది ఇంట్రెస్టింగ్ విషయమే. కానీ స్టార్ హీరోయిన్ సాయిపల్లవి విషయంలో పరిస్థితి కొంచెం భిన్నంగా ఉంది. ఆమె నటించిన రెండు భారీ పాన్ ఇండియా సినిమాలు కేవలం రెండు వారాల గ్యాప్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. నటిగా ఇది ఆమెకు మంచి అవకాశమే అయినా.. ఆ రెండు సినిమాల నిర్మాతలకు మాత్రం థియేటర్లు, ప్రమోషన్స్ విషయంలో రిస్క్ తప్పకపోవచ్చు.
నవంబర్ 6న రామాయణ: పార్ట్ 1 విడుదల కానుంది. రణబీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతాదేవిగా, యష్ రావణుడిగా నటిస్తున్న ఆ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్ లో భారీ స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక నవంబర్ 20న ధనుష్ హీరోగా నటించిన ఓం: చాప్టర్ 1 - ఉదిరం థియేటర్లలోకి రానుంది.
అమరన్ ఫేమ్ రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాలో మమ్ముట్టి, శ్రీలీల తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సాయిపల్లవి కూడా కథలో ఇంపార్టెన్స్ ఉన్న పాత్రలో కనిపించనుంది. ఇక్కడే అసలు రిస్క్ మొదలవుతుంది. రామాయణ భారీ విజయం సాధిస్తే ఆ సినిమా థియేటర్లలో కంటిన్యూషన్ పెరగొచ్చు. అదే సమయంలో ఓం రిలీజ్ కు థియేటర్లు సర్దుబాటు చేయడం నిర్మాతలకు సవాలుగా మారొచ్చు.
ముఖ్యంగా తెలుగు, తమిళం వంటి మార్కెట్లలో రెండు సినిమాల రిలీజ్ ప్లానింగ్ పై ఆ గ్యాప్ ఎఫెక్ట్ చూపే అవకాశం ఉంటుంది. అంతేకాదు.. ఒక సినిమా విడుదలైన రెండు వారాలకే మరో సినిమా రావడంతో ప్రేక్షకుల దృష్టిని రెండో మూవీ వైపు తీసుకెళ్లడం కూడా అంత ఈజీ కాదు. రామాయణ విడుదల తర్వాత దాని టాక్, కలెక్షన్లు, ప్రేక్షకుల చర్చ కొనసాగుతున్న సమయంలో ఓంను కొత్తగా ప్రమోట్ చేయాల్సి ఉంటుంది. సాయిపల్లవి కూడా రెండు సినిమాల ప్రమోషన్స్ కు సమయం కేటాయించాల్సి ఉంటుంది.
అయితే సాయిపల్లవికి మాత్రం ఇదే పరిస్థితి పెద్ద ప్లస్ గా మారొచ్చు. కారణం.. రెండు సినిమాల్లోనూ ఆమె కనిపించే పాత్రలు ఒకే తరహాలో ఉండవు. రామాయణ లో సీతాదేవిగా కనిపించనుండగా.. ఓంలో యాక్షన్, ఎమోషన్ తో కూడిన ఇంటెన్స్ రోల్ లో కనిపించనుంది. దీంతో రెండు సినిమాలు ఒకదానికొకటి పోటీగా కనిపించినా.. ప్రేక్షకులకు మాత్రం రెండు భిన్నమైన ఎక్స్పీరియన్స్ అందించే అవకాశం ఉంది.
అందుకే ఆ రెండు సినిమాల విడుదల సాయిపల్లవికి గోల్డెన్ ఛాన్స్ గా కనిపిస్తే.. నిర్మాతలకు మాత్రం థియేటర్ల నుంచి ప్రమోషన్స్ వరకు కొన్ని లెక్కలు వేసుకోవాల్సిన పరిస్థితి. రెండు సినిమాలు తమ తమ ప్రేక్షకులను ఆకట్టుకుంటే సాయిపల్లవికి మరింత క్రేజ్ రావొచ్చు. కానీ ఒక సినిమా భారీగా థియేటర్లు ఆక్యుపై చేసే పరిస్థితి వస్తే.. రెండు వారాల తర్వాత వచ్చే మరో సినిమాకు మాత్రం ఆ ఎఫెక్ట్ తప్పకపోవచ్చు.
