రెండేళ్ల తర్వాత సాయి పల్లవి సంచలనాలు!
సహజత్వానికి చిరునామాగా, కట్టుబొట్టుతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న నటి సాయి పల్లవి.
By: Srikanth Kontham | 5 Oct 2026 12:20 AM ISTసహజత్వానికి చిరునామాగా, కట్టుబొట్టుతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న నటి సాయి పల్లవి. గ్లామర్ హంగులకు ప్రాధాన్యమిచ్చే పరిశ్రమలో నటన, ఎక్స్‌ప్రెషన్స్, డ్యాన్స్ మైమరపించే మేజిక్‌తో ప్రత్యేకమైన స్టార్‌డమ్ సొంతం చేసుకున్నారామె. కథాబలం, పాత్రలో ప్రాధాన్యం ఉంటే తప్ప ప్రాజెక్టులు ఒప్పుకోని సాయి పల్లవి తెలుగు తెరకు దూరంగా ఉంటూ అభిమానులను నిరీక్షణకు గురిచేశారు. ఆ నిరీక్షణకు తెరదించుతూ రెండేళ్ల విరామం తర్వాత ఒకే నెలలో రెండు భారీ చిత్రాలతో థియేటర్లలో సందడి చేయడానికి సిద్దమవుతున్నారు.
సాయి పల్లవి నుంచి రాబోతున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో మొదటిది పాన్-ఇండియా చిత్రం `రామాయణ`. నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మైథలాజికల్ విజ్యువల్ వండర్‌లో రణబీర్ కపూర్ రాముడిగా నటిస్తుండగా, సాయి పల్లవి సీతాదేవిగా నటించారు. భారతీయ ఇతిహాసాల్లో అత్యున్నతమైన పాత్రలో సాయి పల్లవి కనిపించడం పట్ల దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. నవంబర్ మొదటి వారంలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాతో అమ్మడు నటనా పటవాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.
అదే నెలలో సాయి పల్లవి నటించిన మరో భారీ సినిమా కూడా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. కోలీవుడ్ హీరో ధనుష్ కథానాయకుడిగా `అమరన్` ఫేమ్ రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కిన `ఓం: చాప్టర్ 1` చిత్రంలో సాయి పల్లవి కీలక పాత్ర పోషించారు. సీతాదేవిగా సహనానికి ప్రతీకగా కనిపించనున్న ఆమె ఈ చిత్రంలో అందుకు పూర్తి భిన్నమైన యాక్షన్, ఎమోషన్ కలగలిసిన పాత్రలో మెరవడం విశేషం. మమ్ముట్టి, శ్రీలీల వంటి దిగ్గజ తారాగణం ఉన్న సినిమాలో సాయి పల్లవి పాత్ర కథను మలుపు తిప్పే విధంగా ఉంటుందని సమాచారం.
ఇలా రెండు వారాల వ్యవధిలోనే ఒకవైపు పౌరాణిక కావ్యం, మరొకవైపు హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా వంటి విభిన్నమైన జోనర్ల చిత్రాలతో పలకరించడం చిన్న విషయం కాదు. హిందీ, తమిళంతో పాటు ఇతర ప్రధాన భాషల్లో రూపొందిన రెండు చిత్రాలు పాన్-ఇండియా లో రిలీజ్ అవుతున్నాయి. రెండు పెద్ద బ్యానర్లలో, భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమాలు ఒకే నెలలో బాక్సాఫీస్ వద్ద సందడి చేయ నుండటంతో ట్రేడ్ వర్గాల్లో సైతం భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ రెండు చిత్రాలతో సాయిపల్లవి మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకోవడానికి సిద్ధమవుతున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. సాయి పల్లవి తెలుగులో చివరిగా `తండేల్` సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే.
